అగ్ని మహా పురాణము

Table of Contents

గాయత్రీ మంత్రార్థము-2

అగ్నిదేవుడు ఇట్లు చెప్పెను:

వసిష్ఠా! మరొక వసిష్ఠుడు గాయత్రీ జపపూర్వకముగ లింగమూర్తియగు శివుని స్తుతించి శివుని అనుగ్రహముచే నిర్వాణ స్వరూపమగు పరబ్రహ్మను పొందెను. వసిష్టుడు ఇట్లు స్తుతించెను-‘కనక లింగమునకు నమస్కారము. వేద లింగమునకు నమస్కారము. పరమ లింగమునకు నమస్కారము. ఆకాశ లింగమునకు నమస్కారము. సహస్రలింగ, వహ్నిలింగ, పురాణలింగ, వేదలింగ శివునకు మాటిమాటికి నమస్కారము చేయు చున్నాను. పాతాళలింగ బ్రహ్మలింగ, సప్త ద్వీపోర్ధ్వ లింగమునకు మాటిమాటికి నమస్కారము. సర్వాత్మలింగ, సర్వలోక లింగ, అవ్యక్త లింగ, బుద్ధి లింగ, అహంకార లింగ, భూత లింగ, ఇంద్రియ లింగ, తన్మాత్ర లింగ, పురుషలింగ, భావలింగ, రజోర్ధ్వ లింగ, సత్త్వ లింగ, భవ లింగ, త్రైగుణ్యలింగ, అనాగత లింగ, తేజో లింగ, వాయూర్ధ్వ లింగ, శ్రుతి లింగ, అథర్వ లింగ, సమ లింగ, యజ్ఞాంగ లింగ, యజ్ఞ లింగ, తత్త్వ లింగ, దైవతానుగత లింగ స్వరూపుడవు అగు నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను. ప్రభూ! నాకు పరమ యోగమును ఉపదేశించుము; నాతో సమానుడైన పుత్రుని ఇమ్ము. నాకు అవినాశియగు పరబ్రహ్మయొక్క ప్రాప్తిని కలిగించుము. పరమ శాంతిని ఇమ్ము. నా వంశము ఎన్నటికిని క్షీణము కాకుండుగాక! నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైయుండుగాక’ అని అగ్ని పలికెను. పూర్వము వసిష్ఠుడు శ్రీశైలముపై స్తుతించగా శంకరుడు ప్రసన్నుడై వసిష్ఠునకు వరములు ఇచ్చి అచటనే అంతర్ధానము చెందెను. (217)