అగ్ని మహా పురాణము

Table of Contents

దేవీప్రతిమా లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: చండీదేవికి ఇరువది భుజములుండును. కుడిచేతులలో శూల, ఖడ్గ, శక్తి, చక్ర, పాశ, ఖేట, ఆయుధ, అభయ, డమరు శక్తులను; ఎడమచేతులలో నాగపాశ, ఖేటక, కుఠార, అంకుశ, పాశ, ఘంటా, ఆయుధ, గదా, దర్పణ, ముద్గరములను ధరించియుండును. చండీదేవి ప్రతిమకు పది భుజములుకూడ ఉండవచ్చును. ఆమె పాదముల క్రింద తల ఖండించిన మహిషముండును. ఆ తలతెగి వేరుగా ఉండవలెను. దాని కంఠము నుండి శూలము హస్తమందుగల పురుషుడు శస్త్రమును ఎత్తి మిక్కిలి కోపముతో ముఖమునుండి రక్తము కక్కుచుండును. వాని కంఠమునందు మాల, వెండ్రుకలు, ఎఱ్ఱగా ఉండును. దేవీవాహనమైన సింహము దాని రక్తమును ఆస్వాదించు చుండును. ఆ మహిషాసురుని కంఠమున పాశమొకటి గట్టిగా బిగించి యుండును. దేవి కుడికాలు సింహముపైనను, ఎడమకాలు క్రిందనున్న మహిషాసురుని పైనను ఉండును.

ఈ చండీదేవికి మూడు నేత్రములు ఉండును. ఈమె అనేక శస్త్రములను ధరించి శత్రువులను మర్దించునది. తొమ్మిది పద్మముల రూపమున ఉన్న పీఠముపై దుర్గాప్రతిమపై ఈమెను పూజింపవలెను. మొదటి కమలము తొమ్మిది దళములందును, మధ్యన ఉన్న కర్ణికయందును ఇంద్రాది దిక్పాలులను, నవతత్త్వాత్మికలగు శక్తులతో దుర్గాదేవిని పూజింపవలెను. దుర్గాదేవి ప్రతిమకు పదునెనిమిది భుజములుండును. కుడివైపున ఉన్న హస్తములలో ముండ, ఖేటక, దర్పణ, తర్జనీ, ధనుష్, ధ్వజ, డమరు, చర్మ, పాశములను; వామ భాగమున ఉన్న హస్తములలో శక్తి, ముద్గర, శూల, వజ్ర, ఖడ్గ, కంకుశ, బాణ, చక్ర, శలాకలను ధరించి ఉండును. పదునారు భుజముల దుర్గా ప్రతిమకు కూడ డమరువు, తర్జని తప్ప ఈ ఆయుధములే ఉండును. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతిచండిక అనువారు ఎనమండుగురు దుర్గలు. ఈ దుర్గలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందును స్థాపించి పూజింపవలెను. ఉగ్రచండ అను తొమ్మిదవ దుర్గను మధ్య భాగమున స్థాపించి పూజింపవలెను. రుద్రచండ మొదలగు ఎనమండు గురు దుర్గల దేహకాంతి వరుసగ గోరోచనా సదృశముగను, అరుణముగను, నల్లగను, నీలముగను, తెల్లగను, ధూమ్రముగను, పచ్చగను, తెల్లగను ఉండును. వీరు అందరును సింహవాహనులై మహిషాసురుని కంఠము నుండి ఆవిర్భవించిన పురుషుడు శస్త్రధారియై యుండును. ఈ దుర్గాదేవులు వానిజుట్టు, తమ చేతులతో పట్టుకొని ఉందురు.

ఈ నవ దుర్గలును ఆలీఢమున ఉందురు. (కుడికాలు వెనుకకు తన్నిపెట్టి ఎడమకాలు ముందుకువంచి నిలబడుటకు ఆలీఢమనిపేరు), ఈ నవ దుర్గలను పూజించినచో పుత్ర పౌత్రాభి వృద్ధి కలుగును. చండికాది రూపములలో పూజింపబడునది గౌరియే. హస్తములలో కుండి, అక్షమాల, గద, అగ్ని ధరించినచో ఆమెకే “రంభ” అని పేరు. వనమునందు ఆమెకే “సిద్ధ” యని పేరు. సిద్ధావస్థలో ఆమెవద్ద అగ్ని ఉండదు. “లలిత” కూడ గౌరియే. ఆమె స్వరూపము ఇట్లుండును- ఒక ఎడమచేతిలో కంఠసహితమైన ముండము (భిన్న శిరస్సు), రెండవ చేతిలో దర్పణము, క్రింది కుడిచేతిలో ఫలాంజలి, పై చేతిలో సౌభాగ్య ముద్ర ఉండును. లక్ష్మి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో మారేడు పండు ఉండును. సరస్వతి రెండు చేతులలో పుస్తకము, అక్షమాల ఉండును. మిగిలిన రెండు చేతులలో వీణ ఉండును. గంగాదేవి తెల్లని దేహచ్ఛాయతో మకరారూఢయై ఒక హస్తమున కలశమును, మరియొక హస్తమున కమలమును ధరించి యుండును. యమునాదేవి శ్యామ వర్ణ, రెండు హస్తములందును కలశములు ధరించి తాబేలుపై నిలచి యుండును. తుంబురుని ప్రతిమ వీణా సహితముగ నుండవలెను. ఆతని శరీరకాంతి తెల్లగా నుండును. శంకరుడు శూలపాణియై, వృషభమును ఎక్కి మాతృకల ముందు వెళ్ళుచుండును. బ్రహ్మ పత్నియైన సావిత్రి గౌరవర్ణముగలది. నాలుగు ముఖములుండును. కుడి చేతులలో అక్షమాల, స్రుక్కు ఉండును. ఎడమ చేతులలో కుండము, అక్షపాత్ర ఉండును. వాహనము హంస. శంకరుని పత్నియగు పార్వతి వృషభారూఢయై కుడిచేతులలో ధనుర్బాణములను, ఎడమ చేతులలో చక్ర, ధనస్సులను ధరించి యుండును.

ఎఱ్ఱని కాంతిగల కౌమారీ శక్తి నెమలిపై ఎక్కి రెండు చేతులందును శక్త్యాయుధములను ధరించి ఉండును. లక్ష్మి (వైష్ణవీ శక్తి) కుడిచేతులలో చక్ర, శంఖములను, ఎడమచేతులలో గదా కమలములను ధరించును. వారాహీశక్తి మహిషముపై ఎక్కిదండ, శంఖ, చక్ర, గదలను ధరించును. ఐంద్రీ శక్తి సహస్ర నేత్రములు గలది. ఐరావతముపై ఎక్కివజ్రము ధరించి యుండును. చాముండ కండ్లు చెట్టు తొఱ్ఱలవలె లోతుగా ఉండును. శరీరము మాంస రహితమై అస్థి పంజరమువలె నుండును. నేత్రములు మూడు. మాంసహీనమగు శరీరమునందు అస్తులు మాత్రమే సారముగ మిగిలి యుండును. జుట్టు పైకి లేచి ఉండును. అణగి ఉండదు. ఏనుగు చర్మమును ధరించును. ఎడమ చేతులలో కపాలము, పట్టిసము, కుడిచేతులలో శూలము, ఖడ్గము ఉండును. శవముపై ఎక్కి ఎముకల ఆభరణములు ధరించును.

వినాయకుని ఆకారము మనుష్యాకార సదృశముగా నుండును. పొట్ట చాల పెద్దది. ముఖము ఏనుగు ముఖము; తొండము చాల పొడవుగా నుండును. యజ్ఞోపవీతము ధరించి యుండును. ముఖము వెడల్పు ఏడు కళలు, తొండము పొడవు ముప్పదియారు అంగుళములు. నాడి (కంఠముపై నున్న ఎముక) విస్తారము పండ్రెండు కళలు, మెడ ఒకటిన్నర కళల ఎత్తు ఉండును. కంఠప్రదేశము విస్తారము ముప్పదియారు అంగుళములు. గుహ్య ప్రదేశము ఒకటిన్నర అంగుళములు. నాభి-ఊరువుల విస్తారము పండ్రెండు అంగుళములు, కాళ్లు, పాదాల ప్రమాణము కూడ ఇంతియే, కుడి చేతులలో తన దంతమును, పరశువును; ఎడమచేతులలో లడ్డు, నల్లకలువ ధరించి యుండును.

మయూర ఆరూఢుడై ఉన్న కుమారస్వామికి ఇరువైపుల సుముఖీ, బిడాలాక్షి అను మాతృకలును, శాఖ-విశాఖులను అనుజులును నిలచి యుందురు, రెండు హస్తములు, బాలరూపము, కుడిచేతిలో శక్తి, ఎడమ చేతిలో కోడి ఉండును. ముఖములు ఒకటి కాని, ఆరుకాని నిర్మింపవచ్చును. గ్రామములోని విగ్రహమునకు ఆరు లేదా పండ్రెండు హస్తములుండవలెను. వనమునందు స్థాపించు విగ్రహమున మాత్రము రెండు భుజములే ఉండవలెను. ఆరు కుడి భుజములలో శక్తి బాణ, పాశ, ఖడ్గ, గదా, తర్జనీ ముద్రలును; ఎడమ చేతులలో నెమలి పింఛము, ధనస్సు, ఖేటము, పతాక, అభయముద్ర, కుక్కుటము ఉండవలెను. రుద్రచర్చిక గజచర్మమును ధరించి ఎడమ చేతిలో కపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల, పాశములను ధరించి, ముఖమును, ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భుజారూపమున గూడ పూజింపబడును.

ముండమాలను డమరువును ధరించినప్పుడు ఆమెయే ‘రుద్రచాముండ’ అని చెప్పబడును. ఆమె నాట్యముచేయును. అందుచే ‘నాట్యశ్వరి’ అని కూడ ఈమెకు పేరు. ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు “చతుర్ముఖీ మహాలక్ష్మీ” (మహాలక్ష్మి యొక్క తామసమూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలోనున్న నరులను గుఱ్ఱములను, దున్నలను, ఏనుగులను తినుచుండును. సిద్ధ చాముండకు పది భుజములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతులలో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును. ఎడమ చేతులలో ఘంట, ఖేటకము, మంచపుకోడు, త్రిశూలము, (డాలు) ధరించియుండును. సిద్ధ యోగీశ్వరీదేవి సంపూర్ణ సిద్ధినిచ్చును, ఈ దేవికి స్వరూపమైన మరియొక శక్తి యున్నది. ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు ‘భైరవి’ అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకరముగ ఉందురు. ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, అష్టభుజ లేదా రుద్ర చాముండ, సిద్ధయోగీశ్వరి భైరవి, రూపవిద్య) “అంబాష్టకము” అని పేరు. క్షమాదేవి చుట్టు ఆడ నక్కలుండును. వృద్ధ స్త్రీ రూపములోనున్న ఆమెకు రెండు హస్తములు ఉండును. నోరు తెరచి ఉండును, పండ్లు ఎత్తుగా ఉండును, మోకాళ్ళు, చేయి ఆనుకొని భూమిపై కూర్చుండును. ఈమె ఉపాసకులకు కల్యాణప్రదాయిని. యక్షిణులు కండ్లు తెరచుకొని (మూయకుండ చూచుచు) ఉందురు. అప్సరసలు సర్వదా సౌందర్యవతులు, వీళ్ళ కండ్లు పచ్చగా ఉండును.

నందీశ్వరునకు ఒక చేతిలో అక్షమాల, రెండవ చేతిలో త్రిశూలము ఉండును. మహాకాలుని చేతిలో కత్తి, రెండవ చేతిలో ఖండితమైన శిరస్సు, మూడవ చేతిలో శూలము, నాల్గవ చేతిలో ఖేడముండవలెను. కృశమైన శరీరముగల భృంగి నృత్యముద్రలో నుండును. ఈతని శిరస్సు కూష్మాండమువలె స్థూలమై బట్టతలయై ఉండును. వీరభద్రుడు మొదలగు గణములకు ఏనుగులు, గోవుల వంటి చెవులు, ముఖములు ఉండును. ఘంటాకర్ణునకు పదునెనిమిది భుజములు ఉండును. ఆతడు పాపములను, రోగములను నశింపచేయును, ఎడమ ప్రక్కన నున్న ఎనిమిది చేతులలో వజ్ర, ఖడ్గ, దండ, చక్ర, బాణ, ముసల, అంకుశ, ముద్గరములను, కుడిప్రక్కనున్న ఎనిమిది చేతులలో తర్జనీ, ఖేట, శక్తి, ముండ, పాశ, ధనుష్, ఘంటా, కుఠారములను ధరించును. మిగిలిన రెండు చేతులతో త్రిశూలమును పట్టుకొని ఉండును. ఘంటామాలచే అలంకృతుడగు ఘంటాకర్ణుడు విస్ఫోటకమును నివారించును. (50)