అగ్ని మహా పురాణము

Table of Contents

బుద్ధ, కల్కి అవతార కథనము

అటు పిమ్మట అగ్ని ఈ విధముగా పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని విను వానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితులైన దేవతలు “రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. ఆ పరమేశ్వరుడే అర్హతుడై, మిగిలిన వేద వర్జితులను అందరిని అర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాది వర్జితులైన పాషండులుగా అయిరి.

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధముని నుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకరమగుదురు. శీలరహితులైన దొంగలు అగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు. ధర్మమను చొక్కా తొడిగికొనిన మ్లేచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు)

విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కలవాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి మ్లేచ్ఛులను నశింపజేయును.

నాలుగు వర్ణములందు తగిన కట్టుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్ధర్మ మార్గము నందును నిలుపగలడు. విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును, పిమ్మట పూర్వమునందు వలె కృతయుగము ఏర్పడును.

ఓ మునీ! వర్ణాశ్రమములు తమతమ ధర్మములను ఆచరించును. ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకములైన అవతారములు ఎత్తుచుండును. గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మ వ్యవస్థ చేయుచుండును. సృష్ట్యాదులకు కారణమైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను. (16)