అగ్ని మహా పురాణము

Table of Contents

చామరాది లక్షణ కథనము

అగ్నిదేవుడు పలికెను: వశిష్ఠా! సువర్ణ దండభూషితమగు చామరము ఉత్తమము. హంస పక్షములతో గాని, మయూర పక్షములతో గాని, శుక పక్షములతో గాని నిర్మించిన ఛత్రము రాజునకు మంచిది. బక పక్ష నిర్మిత ఛత్రమును కూడ ఉపయోగించవచ్చును. మిశ్రిత పక్షముల ఛత్రము మాత్రము మంచిదికాదు. మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు లేదా ఎనిమిది పర్వములున్న దండము ప్రశస్తము. భద్రాసనము క్షీరవృక్ష కాష్టముచే నిర్మితమై ఏబది అంగుళముల ఎత్తు ఉండవలెను. అది సువర్ణ విచిత్రతమై మూడు హస్తముల విస్తారము ఉండవలెను. ఓ ద్విజశ్రేష్ఠా! ధనస్సును నిర్మించుటకు లోహము గాని, శృంగముగాని, కాష్ఠముగాని ఉపయోగించవలెను. వెదురు, భంగము లేదా చర్మము వారికి ఉపయోగించును. దారు నిర్మితమగు శ్రేష్ఠ ధనుస్సుయొక్క పొడవు నాలుగు హస్తములు-దానిలో ఒక్కొక్క హస్తము పొడవు తగ్గించగా మధ్యమ, అధమ ధనస్సులు ఏర్పడును, పిడికిలితో పట్టుకొనుటకు ధనస్సునకు మధ్య భాగమున ఏదైన ద్రవ్యమును ఉపయోగించవలెను. ధనస్సుయొక్క కోటిని కామినీ భ్రూలత ఆకారములో చాల గట్టిగ చేయవలెను. లోహ-శృంగ ధనస్సులను ప్రత్యేకముగ ఒక పదార్థముతోగాని, మిశ్రపదార్థములతో గాని తయారు చేయవలెను. శృంగధనస్సును అత్యంతోపయుక్తము గాను, సువర్ణ బింద్వలంకృతముగాను చేయవలెను. ధాతువులతో సువర్ణ, రజత, తామ్ర, కృష్ణ లోహములను ఉపయోగించవలెను. శార్జ్గ ధనస్సులలో మహిష, శరభ, రోహిణ మృగముల శృంగములతో నిర్మించినవి శుభములు. దారుమయశరాసనములలో చందన, వేతన, సాల, ధవ, అర్జున వృక్షముల కాష్ఠముతో నిర్మించినవి ఉత్తమములు. శరదృతువునందు పక్వమైన వెదురు కోసి నిర్మించిన ధనస్సు సర్వోత్తమము. ధనస్సును, ఖడ్గమును త్రైలోక్య మోహన మంత్రములతో పూజించవలెను.

లోహము, వెదురు, సరకాండము వీటి తోగాని, మరియే ఇతర పదార్థములతో నిర్మించినను బాణము వంకర లేకుండగను, బంగారు కాంతి కలదిగను, స్నాయువువలె క్లిష్టముగను, బంగారుపొన్నుతో భూషితముగను, తైలధౌతముగను, అందమైన రెక్కలు కట్టినదిగను ఉండవలెను. రాజు యాత్రయందును, అభిషేకమునందును, ధనుర్బాణములు మొదలగు అస్త్రములు; పతాకలు సంగ్రహించునపుడు దైవజ్ఞులనుగూడ పూజించవలెను. పూర్వము బ్రహ్మదేవుడు సుమేరు పర్వత శిఖరమునందు, ఆకాశగంగాతీరమున యజ్ఞము చేసెను. అతడు ఆ యజ్ఞమునకు వచ్చియున్న లోహదైత్యుని చూచెను. అతనిని చూడగనే “వీడు నా యజ్ఞమున విఘ్నము కలిగించడు కదా!’ అని చింతలోపడెను. ఇట్టి చింత కలుగగనే అగ్నినుండి బలవంతుడగు ఒక పురుషుడు ఆవిర్భవించి బ్రహ్మకు నమస్కరించెను. దేవతలు ప్రసన్నులై ఆతనిని అభినందించిరి. ఇట్లు అభినందింపబడుటచే ఆతడు ‘నందక’ మను పేరుతో ఒక ఖడ్గమాయెను. దేవతలు ప్రార్థింపగా శ్రీమహావిష్ణువు ఆ ఖడ్గమును తన ఆయుధముగ స్వీకరించెను. ఆ దేవాది దేవుడు ఆ ఖడ్గమును దానికంఠమున చేయి ఉంచి పట్టుకొనుటచే అది ఒరనుండి బైటకువచ్చెను. ఆ ఖడ్గకాంతి నీలముగను, ముస్టి రత్న మయముగను ఉండెను. అది పెరిగి సూరు హస్తముల పొడవాయెను. లోకదైత్యుడు గదాప్రహారము చేయుచు దేవతలను యుద్ధభూమినుండి తరుమ మొదలిడెను. శ్రీమహా విష్ణువు ఆ ఖడ్గముతో దైత్యుని శరీరమునంతను ఖండించివేసెను. నందకము స్పర్శతగుల గనే ఆ దైత్యుని లోహమ యాంగములు అన్నియు ఛిన్నాభిన్నములై భూతలముపై పడిపోయినవి. ఈ విధముగ లోహాసురుని సంహరించి శ్రీమహావిష్ణువు-నీ పవిత్ర శరీరము భూతలమున ఆయుధ నిర్మాణమునకై ఉపయుక్తమగుగాక’ అని ఆతనికి వరమిచ్చెను. అనంతరము శ్రీ మహావిష్ణు ప్రసాదముచే బ్రహ్మ సర్వ సమర్థుడగు శ్రీ మహావిష్ణువును యజ్ఞముద్వారా నిర్విఘ్నముగా ఆరాధించెను. ఇపుడు నేను ఖడ్గ లక్షణములను చెప్పెదను.

ఖటీఖట్టర దేశమునందు నిర్మితములగు ఖడ్గములు చాల అందముగా ఉండును. ఋషీకదేశ నిర్మితములు శరీరమును చీల్చివేయును. శూర్పారక దేశీయ ఖడ్గములు చాల దృఢముగ నుండును. వంగదేశ ఖడ్గములు తీక్ష్ణములై దెబ్బను ఎదుర్కొన సమర్థములై యుండును. అంగదేశ ఖడ్గములు తీక్ష్ణములు. ఏబది అంగుళముల ఖడ్గము ఉత్తమము. దానిలో సగము పరిమాణము గలది మధ్యమము. ఇంతకంటె తక్కువ ప్రమాణముగల దానిని ధరించగూడదు. మువ్వల ధ్వనివలె దీర్ఘశబ్దము చేయు ఖడ్గమును ధరించుట చాలమంచిది. పద్మపత్రమువలె గాని, మండలాకారమునగాని, కరవీర పత్రమువలెగాని ఉన్న అగ్రము గలదియు, ఘృతగంధము కలదియు, ఆకాశ శీలమును అగు ఖడ్గము ప్రశస్తము. ఖడ్గముపై, సమాంగుళము నందున్న లింగాకారమగు వ్రణము ప్రశస్తము. కాక-ఉలూకముల వంటి వర్ణము గలిగి విషమముగ నుండు ఖడ్గములు మంగళ కరములు కావు. ఖడ్గమునందు తనముఖము చూచుకొనగూడదు. ఖడ్గముజాతిని, మూల్యమునుకూడ ఎవ్వరికిని చెప్పరాదు. రాత్రి ఖడ్గమును తలవైపున పెట్టుకొని నిద్రింపరాదు. (245)