అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాయశ్చిత్తములు (అ)

పాపములను నశింపచేయు ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చెప్పిన విధముగ చెప్పెదను. ప్రాణములను తీయుపని ‘హననము’. రాగమువలన గాని, ద్వేషము వలన గాని, ప్రమాదము వలన గాని, ఒక బ్రాహ్మణుని, తానే గాని, పరప్రేరణచే గాని చంపినవాడు బ్రహ్మ ఘాతకుడు. ఒకే కార్యమును చేయుటకై ఉద్యుక్తులై చాలమంది శస్త్రములు ధరించి వచ్చినపుడు వారిలో ఒక్కడే బ్రాహ్మణుని చంపినను, వారందరు బ్రహ్మహత్య చేసినట్లే. తిట్టబడి గాని, ధనాప హారాదులచే పీడింపబడి గాని ఒక బ్రాహ్మణుడు ఎవని మూలముగా తన ప్రాణములు కోల్పోవునో అతడు బ్రహ్మహత్య చేసినవాడు. ఔషధాది ఉపకారము చేసినపుడు మరణించినను బ్రహ్మహత్యా దోషము లేదు. పుత్రుని, శిష్యుని, భార్యను శాసించునపుడు వారు మృతులైనను పాపములేదు. దేశమును, కాలమును, వయస్సును, శక్తిని, పాపమును బాగుగా పరీక్షించి, మరొక విమోచన ఉపాయము లేనప్పుడు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేసినవాడు మరొక బ్రాహ్మణుని కాపాడుటకుగాని తన ప్రాణములు విడచినచో లేదా అగ్నిలో దుమికినచో ఆతని బ్రహ్మ హత్యాపాపము తొలగును. శిరస్సు కపాలమును గుర్తుగా ధరించి, తాను చేసిన పాపముచెప్పుచు, భిక్షాన్నము మితముగా తినుచు పండ్రెండు సంవత్సరములు గడపినచో శుద్ధిపొందును. పరిశుద్ధమైన నడవడిక కలవాడై ప్రవర్తించు వాడు బ్రహ్మహత్య దోషమునుండి ఆరు సంవత్సరములలో విముక్తుడగును. కావలెనని ఈ పాపము చేసినవారు ఇష్టము లేకుండ చేసినవారికి చెప్పిన ప్రాయశ్చిత్తమునకు రెట్టింపు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేయుటకై ఉద్యమించిన వానికి మూడు సంవత్సరములు ప్రాయశ్చిత్తము. బ్రహ్మహత్య చేసిన క్షత్రియునకు రెట్టింపు ప్రాయశ్చిత్తము, వైశ్యునకు రెండు రెట్లు, శూద్రునకు మూడు రెట్లు. ఇతర పాపముల విషయమున బ్రాహ్మణునకు పూర్తి ప్రాయశ్చిత్తము, క్షత్రియునకు మూడు పాదములు, వైశ్యునకు స్త్రీ, వృద్ధ, బాల, రోగులకు ఒకపాదము ప్రాయశ్చిత్తము. క్షత్రియవధ చేసినవారికి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు ప్రాయశ్చిత్తము, వైశ్యహత్య యందు ఎనిమిదవవంతు; సదాచారవంతుడగు శూద్రుని హత్యయందు పదహారవ వంతు.

దుష్టురాలు కాని స్త్రీని చంపినవాడు శూద్రహత్యకు చెప్పిన ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. గోవును చంపినవాడు మాసము పాటు పంచగవ్యములు భక్షించుచు నియతుడై, గోష్ఠమునందు శయనించుచు, గోవులను అనుసరించుచు, గోవును దానముచేయుటచే శుద్ధుడగును. లేదా కృచ్ఛ్రమును, అతి కృచ్ఛ్రమును చేయవలెను. క్షత్రియాదులందు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము తగ్గును. చాల ముసలిది, చాల దుర్బలముగా నున్నది, చాల బాల్యావస్థలో ఉన్నదియగు గోవును చంపిన ద్విజుడుపైన చెప్పిన వ్రతమును సగము చేయవలెను. గుద్దుచేతగాని, చెంపదెబ్బచేత గాని, కీలముచేత గాని గోవును హింసించినను; చెవులు మొదలగునవి విరుగగొట్టినపుడును, కథ మొదలగువాటితో కొట్టినను దానిని గోవధగా చెప్పవలెను. లొంగదీసికొనునపుడును, లొంగదీయించేటప్పుడును, బండమొదలైన వాటికి కట్టినపుడును, స్తంభము, గొలుసు, త్రాడు మొదలైన వాటిచే చనిపోయినను ఒక పాదము తక్కువ చేయవలెను. కఱ్ఱచే కొట్టగా చనిపోయినచో సాంత పనము, మట్టిబిడ్డతో కొట్టినపుడు చనిపోయినచో ప్రాజాపత్యమును, ఱాయితో కొట్టగా చనిపోయినచో తప్త కృచ్ఛ్రమును, శస్త్రముచే మరణించగా అతికృచ్ఛ్రమును ఆచరించవలెను. పిల్లిని, ఉడుమును, ముంగిసను, కప్పను, కుక్కను, పక్షిని చంపినవాడు మూడు దినములు క్షీరము మాత్రమే త్రాగి, కృచ్ఛ్రమును, చాంద్రాయణమును చేయవలెను. ఈ వధ రహస్యముగా చేసినచో వ్రతము కూడ రహస్యముగా చేయవలెను. ప్రకాశముగా చేసినపుడు ప్రకాశముగా చేయవలెను. సర్వ పాపములను తొలగించుకొనుటకు నూరు ప్రాణాయామములు చేయ వలెను. పానకము, ద్రాక్షామధువు, ఖర్జూర జన్యము, తాళవృక్ష భవము, ఇక్షురసభవము. మాధ్వీకము, టంకమాధ్వీకము, మైరేయము, నారికేళ వృక్ష మలము, ఇవన్నియు మద్యములే (మాదకములే) అయినను మద్యములు కావు. పిష్టముతో తయారుచేసినదే నిజమైన సుర. మూడు వర్ణముల వారికిని నిషిద్ధములగు మద్యములను త్రాగినవాడు బాగా మరుగుచున్న నీళ్లు త్రాగి శుద్ధుడగును. లేదా ఒక సంవత్సరము ధాన్య కణములను మాత్రమే తినవలెను. లేదా ఒక పర్యాయము మాత్రమే రాత్రియందు తెలక పిండి తినుచు సంవత్సరము గడపవలెను. సురాపాన దోష నివృత్తి కొరకు జటాధారియై, సురాపానము చేసిన గుర్తు ధరించి కంబళ ధారియై ఉండవలెను.

మలమూత్రములను, సురతగిలిన ఆహారమును తెలియక భుజించిన మూడు వర్ణముల వారును పునః సంస్కారార్హులు మద్యభాండములో ఉన్న నీళ్ళు త్రాగినవాడు ఏడు రోజులు వ్రతము చేయవలెను. చాండాలోదకము త్రాగినవాడు ఆరు దినములు వ్రతము ఆచరించవలెను. చాండాలుల కూప భాండముల యందు నీరు త్రాగినవాడు సాంతపనము చేయవలెను. అంత్యజాతీయుల జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్రి ఉపవాసము చేసిన పంచగవ్య ప్రాశనము చేయవలెను. మత్స్యములు, కంటకములు, శంబూకము (నత్త గుల్ల) శంఖములు, ముత్యపు చిప్పలు, కపర్దములు, తిన్నవాడును, నవోదకము త్రాగినవాడును పంచ గవ్యముచే శుద్ధుడు అగును. శవ కూపోదకము త్రాగినవాడు మూడు రాత్రులలో శుద్ధుడగును. చాండాలాన్నము తిన్నవాడు చాంద్రాయణ వ్రతము చేయవలెను. ఆపత్కాలమునందు శూద్రగృహమున భుజించినవాడు మనస్తాపముచే శుద్ధుడు అగును. శూద్రులపాత్రలో భుజించిన విప్రుడు ఉపవాసము ఉండి పంచగవ్య భక్షణ చేయుటచే శుద్ధుడు అగును, కందుపక్వమును (మంగలములో వేయించిన పదార్థము) తైల పక్వమును స్నేహపదార్థము, పెరుగుతో కలసిన సక్తువు గుడక్షీరరసాదికము కూడ శూద్రుని నుండి గ్రహించినను అనింద్యములు, స్నానము చేయకుండ భుజించిన వాడు ఉపవాసముచేసి దినాంతము నందు జపము చేయుటచే శుద్ధుడగును. మూత్ర విసర్జనచేసి అశుచిగా నున్నపుడు భుజించినవాడు మూడు రాత్రుల ఉపవాసముచే శుద్ధుడగును. కేశ కీటాదులతో కూడిన దానిని, కావలెనని పాదముతో స్పృశించిన దానిని, కాకులు తిన్నదానిని, కుక్క ముట్టినదానిని, గవాదులు వాసన చూచిన దానిని తిన్నవాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. రేతస్సును, మల మూత్రములను భక్షించినవాడు ప్రాజాపత్యమును ఆచరింపవలెను.

నవశ్రాద్ధమునందు భోజనము చేసినవాడు చాంద్రాయణమును, మాసికమునందు పరాక ప్రాయశ్చిత్తము, పక్షత్రయ శ్రాద్ధమునందు అతి కృచ్ఛ్రమును, షణ్మాసము నందు కృచ్ఛ్రమును, ఆబ్దికమునందు పాద కృచ్ఛ్రమును, మరల ఆబ్దికమునందు ఏకాహము వెనుకటి రోజున వార్షిక శ్రాద్ధము మరునాడుమరల ఆబ్దికము నందు ఏకాహము చేయవలెను. నిషిద్ధవస్తువులను భక్షించినచో ఉపవాసముండుట ప్రాయశ్చిత్తము. భూతృణమును, అశునము(వెల్లుల్లి)ను తిన్నవాడు శిశుక కృచ్ఛ్రము చేయవలెను. అభోజ్యుల అన్నము తిన్నను, స్త్రీ శూద్రోచ్ఛిష్టమును తిన్నను, అభక్ష్య మాంసమును తిన్నను ఏడు దినములు పాలుత్రాగవలెను. మధు మాంసములను, శావాశౌచాన్నమును తిన్న బ్రహ్మచారియు, యతియు వ్రతస్థుడును ప్రాజాపత్య-కృచ్ఛ్రములు చేయవలెను. అన్యాయముచే పరధనా పహరణము స్తేయము (దొంగతనము), స్వర్ణస్తేయము చేసినవాడు రాజుచే ముసలముతో కొట్టి చంపబడినచో శుద్ధుడగును. స్వర్ణస్తేయము చేసినవాడును, సురాపానము చేసిన వాడును, బ్రహ్మహత్య చేసినవాడును, గురుతల్పగుడును క్రింద పండుకొనుచు, జటాధారియై ఆకులు, దుంపలు, ఫలములు మాత్రము ఒక పూటమాత్రమే తినుచు ఉన్నచో పండ్రెండు సంవత్సరములలో శుద్ధుడగును (కృచ్ఛ్రము)స్తేయము చేసినవాడును, సురాపానము చేసిన వాడును ఒక సంవత్సరము సురాపానము చేయవలెను. మణులు, ముత్యములు, పొగడములు, రాగి, వెండి, ఇనుము, కంచు, రాళ్ళు అపహరించినవాడు చాంద్రాయణము చేయవలెను. భక్ష్యములను, భోజ్యములను, వాహనములను, శయ్యను, ఆసనమును, పుష్పమూల ఫలములను అపహరించినచో పంచ గవ్యముచే శుద్ధియగును.

తృణ-కాష్ఠ-ద్రుమములను, శుష్కాన్నమును, బెల్లమును, వస్త్ర-చర్మ-మాంసములను అపహరించినవాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. తండ్రి భార్య, సోదరి, ఆచార్యపుత్రి, గురుభార్య, స్వసుత వీరితో సంగమము చేసినవాడు గురుతల్పగుడు. ఈ పాపము చేసినవాడు చేసిన పాపమును చెప్పుచు, కాలుచున్న ఇనుప పెనముపై ప్రజ్వలించుచున్న ఇనుప స్త్రీ మూర్తిని కౌగలించుకొని మరణించినచో శుద్ధి పొందును. లేదా గురుతల్పగుడు మూడు చాంద్రాయణములను చేయవలెను. పతిత స్త్రీలు కూడ ఇట్లే చేయవలెను. పరభార్యాగాములైన పురుషులకు ఏది ప్రాయశ్చిత్తమో స్త్రీలకుగూడ అదే ప్రాయశ్చిత్తము. బాలికలు, చాండాల స్త్రీలు, కుమార్తెలు, సపిండుల కుమార్తెలు భార్యలు, వీరి సంగము చేసినవానికి మరణమే ప్రాయశ్చిత్తము. ఒక రాత్రి శూద్ర స్త్రీ సంగము చేసిన ద్విజుడు భిక్షాన్నము తినుచు, నిత్యము జపము చేసినచో మూడు మాసములలో ఆ దోషమును పోగొట్టుకొనును. తండ్రి సోదరుని భార్య, సోదరుని భార్య, చాండాల స్త్రీ, పుక్కసీస్త్రీ, కోడలు సోదరి, సఖురాలు, తల్లిదండ్రుల సోదరి, తన దగ్గర రక్షణ నిమిత్తమై ఉంచిన స్త్రీ, శరణు జొచ్చిన స్త్రీ, మేనమామ కూతురు, సోదరి, సగోత్రయైన స్త్రీ, అన్యుని కోరుచున్న స్త్రీ, శిష్యభార్య, గురుభార్య వీరితో సంగము చేసినవాడు చాంద్రాయణము చేయవలెను. (173)