అగ్ని మహా పురాణము

Table of Contents

అంగాక్షరార్చనము - వాసుదేవాది పూజ

అగ్నిదేవుడు చెప్పెను:

చంద్రుడు జన్మ నక్షత్రమునందును సూర్యుడు సప్తమ రాశియందును వున్నచో అది పౌష్ణ కాలము. అపుడు శ్వాసను పరీక్షించవలయును. ఎవని కంఠము ఓష్ఠములు స్థానము నుండి చలించినవో, నాసిక వక్రమైనదో, జిహ్వ నల్లపడినదో, అతడు ఏడు దినములకు మించి జీవించడు. తార(ఓం), మేష(న), విష(మ), దంతీ(ఓ), దీర్ఘ స్వరయుక్త (న,ర,లు) య నాలు రసము(య). ఇది మహావిష్ణువు యొక్క అష్టాక్షర మంత్రము (ఓం నమో నారాయణాయ “క్రుద్ధోల్కాయ” మహోల్కాయ “వీరోల్కాయ”, “ద్యుల్కాయ”, “సహస్రోల్కాయ” అను మంత్రములతో హృదయ, శిరః, శిఖా, భుజద్వయ సకల దిగ్భాగములందు న్యాసము చేయవలయును. కనిష్ఠ మొదలు కనిష్ఠ వరకు ఎనిమిది వ్రేళ్ళ పర్వములందును అష్టాక్షర మంత్రము యొక్క ఎనిమిది అక్షరములను ఒక్కొక్క దానిని ప్రణవము ‘నమః’తో సంపుటితముచేసి అంగుష్ఠాగ్ర భాగముచే క్రమముగ న్యాసము చేయవలయును. తర్జని యందు మధ్యమాయుక్తమగు అంగుష్ఠము నందు కరతలమునందు మరల అంగుష్ఠము నందు ప్రణవ న్యాసమునకు ఉత్తారమని పేరు. అందుచే వెనుక చెప్పిన న్యాసము చేసిన పిమ్మట బీజోత్తార న్యాసము చేయవలయును. ఈ మంత్రము నందలి మొదటి ఐదు అక్షరముల వర్ణములు వరుసగ రక్త, గౌర, ధూమ్ర, హరిత, సువర్ణ రూపములు. చివరి మూడు వర్ణముల రంగు శ్వేతము. వర్ణములను ఈ రూపములలో భావన చేసి క్రమముగా హృదయము ముఖ నేత్ర శీర్ష చరణములు, గుహ్య హస్తాదులందు న్యాసము చేయవలయును. హస్తములందును, దేహమునందును బీజ న్యాసముచేసి మరల అంగన్యాసము చేయవలయును. తన శరీరమునందు చేసినట్లే దేవ విగ్రహము నందు కూడ కరన్యాసము తప్ప ఇతర న్యాసములు చేయవలయును. దేవతా విగ్రహము యొక్క హృదయాద్యంగములందు న్యాసముచేసిన వర్ణములను గంధ పుష్పములతో పూజించ వలయును. దేవ పీఠముపై ధర్మాదులను అగ్న్యాదులను, అధర్మాదులను వాటి వాటి స్థానమున న్యాసము చేయవలయును. పిదప దానిపై కమలము కూడ న్యాసము చేయవలయును. ఆ పీఠముపైననే కమలదళములు, కేసరములు కింజల్కవ్యాపి, సూర్య మండల, చంద్రమండల, అగ్ని మండలములు వేరువేరుగ క్రమముగా న్యాసము చేయవలయును. అచట సత్వాది గుణత్రయమును కేసరములపైనున్న విమలా-ఉత్కర్షిణీ-జ్ఞాన-క్రియా-యోగ-ప్రహ్వీ -సత్యా-ఈశాన-అను ఎనిమిది శక్తులను భావన చేయవలయును. ఈ ఎనిమిది శక్తులును ఎనిమిది దిక్కులందు ఉండును. తొమ్మిదవదగు అనుగ్రహ శక్తి మధ్య యందుండును. పాద్య అర్ఘ్య ఆచమనీయ పీతాంబర అలంకారములు అనునవి ఐదు ఉపచారములు. వీటిని అన్నింటిని మూల మంత్రముతో సమర్పించవలెను. పీఠము యొక్క పూర్వాది దిక్కులయందు వాసుదేవాది మూర్తి చతుష్టయమును ఆగ్నేయాది విదిక్కులయందు క్రమముగా శ్రీ సరస్వతీ రతి, శాంతులను పూజించవలెను. ఇట్లే దిక్కులందు శంఖ చక్రగదా పద్మములను విదిక్కులందు ముసల ఖడ్గ, శార్ఙ్గ, వనమాలలను పూజించ వలెను. మండలము వెలుపల గరుత్మంతుని పూజించి నారాయణుని ఎదుటనున్న విష్వక్సేనుని మధ్య భాగమున సోమేశుని, ఆవరణము వెలుపల ఇంద్రాది పరిచారక వర్గముతో శ్రీ మహావిష్ణువును పూజించిన సాధకునకు సర్వ ఫలములు సిద్ధించును. (303)