అగ్ని మహా పురాణము

Table of Contents

తెలుగులో అగ్నిపురాణాలు

తెలుగులో అగ్నిపురాణ అనువాదములు సంపూర్ణముగాగానీ సంక్షిప్తముగా గానీ రాలేదు. ఇందు కథాభాగములు ఉపాఖ్యానములుగానీ ప్రత్యేకముగా లేక కేవలము శాస్త్ర విషయముల వివరణ ఉండుటయే కారణము కావచ్చును.

అయినను అగ్నిపురాణ అనువాదమువంటిదే తెనుగున ఒక గ్రంథము వెలసినది. అది టేకుమళ్ల రంగశాయి రచించిన ‘వాణీవిలాస వనమాలిక’ అనే గ్రంథము. ఈ రంగశాయి పుష్పగిరి తిమ్మనగారి సహపాఠి, ధర్మపురి నివాసి. ఇతడి గురువు రామభద్రయ్య. ఇతడు దక్షిణంలో తిరువళ్ళూరు ప్రాంతంలో ఉండేవాడు. రంగశాయి తిరువళ్ళూరు వీర రాఘవ స్వామిపై ఒక శతకం, కృష్ణరాజ దండకం అనే దండకం, జానకీ పరిణయం అనే యక్షగానం, ద్విపద భాగవతాన్ని రచించాడు. పోతన రచనను అనుకరించిన ఈ ద్విపద భాగవతం నేడు సంపూర్తిగా లభ్యం కావటం లేదు. కేవలం నాలుగు స్కంధాలు మాత్రం లభ్యం అవుతున్నాయి. ఈ గ్రంథాలన్నీ అముద్రితాలే. ఒక్క వాణీ విలాస వన మాలిక ముద్రితం అయింది. కవి 17వ శతాబ్దానికి చెందినవాడు.

తెలుగు సాహిత్యంలోనే వాణీ విలాస వనమాలిక కొంగ్రొత్త తరహాకు చెందిన రచన. వేద, పురాణ, స్మృతి, షడ్దర్శన, శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందం, ఆయుర్వేదం, శిల్పం, గాంధర్వం మొదలైన సమస్త విజ్ఞానాన్ని క్రోడీకరించి 2,574 గద్య, పద్యములలో నాలుగు ఆశ్వాసములుగా చెప్పబడిన రచన ఇది. వేదశాఖ సూత్ర కల్పాంగ సంఖ్యానంతో ప్రారంభించి వాస్తు శాస్త్రము వఱకును వివరములు సేకరించి దండగా గుచ్చాడు. ఇది వనమాల అనే తరగతికి చెందిన గ్రంథమని అన్ని ఋతువులకు చెందిన పుష్పములు వనమాలికలో ఉన్నట్లే ఇందు సర్వ విషయములుండ వలెనని చెప్పబడింది. ఈ వనమాల లక్షణమిది.

ఆజాను లంబినీ మాలా సర్వర్తు కుసుమోజ్జ్వలా

మధ్య స్థూల కదంబాఢ్యా వనమాలేతి కథ్యతే. (వీణీ విలాస వన మాలిక-పీఠిక)

కవి ఇట్టి గ్రంథమును వ్రాయుటలో కృతకృత్యు డైనాడని చెప్పవచ్చును. ఈ గ్రంథం రచనలో రంగశాయికి మహంకాళి వెంకటపతి అనే కవి సహాయము చేశాడట. సంస్కృత అగ్ని పురాణముతో ఈ గ్రంథమును తైపారువేసి పరిశోధించవలసిన అవసరము ఉన్నది. లభ్యము అగుచున్నంతవరకు కాక ఇంకనూ చాలా గ్రంథము ఉండి ఉండవచ్చునని పరిశోధకులు ఊహించుచున్నారు.

శ్రీరామ రాజనీతి-వెంకట పార్వతీశ కవులు. ఇది చిన్న గ్రంథము. పిఠాపురము యువరాజా వారి 13వ జన్మదిన సందర్భమున 1923లో వెంకట పార్వతీశ కవులచే రచింపబడినది ఈ గ్రంథము. ఇది యువరాజు గంగాధర రామారావుగారికి అంకితము చేయబడింది. 55 పేజీల ఈ కావ్యములో 147 పద్యము గలవు. అగ్నిపురాణమున ఇంద్రజిత్ సంహారార్థము ఏగుచున్న సౌమిత్రికి శ్రీరాముడు ఉపదేశించిన రాజనీతి ఈ కావ్యమునకు ఆధారము.