అగ్ని మహా పురాణము

Table of Contents

లింగమానముల లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇప్పుడు నేను ఇతర లింగాదులను గూర్చి చెప్పెదను వినుము. లవణముతోను, ఘృతముతోను చేసిన శివలింగము బుద్ధిని వృద్ధి పొందించును. వస్త్రమయ లింగము ఐశ్వర్యదాయకము. అది తాత్కాలిక లింగము. మృత్తికతో నిర్మించిన లింగము పక్వము, అపక్వము అని రెండు విధములు. అపక్వము కంటె పక్వము శ్రేష్ఠము. దాని కంటె కఱ్ఱతో చేసిన లింగము అధిక పుణ్యదాయకము, పవిత్రము. దాని కంటె శిలాలింగము శ్రేష్ఠము. దాని కంటె ముత్యముల శివలింగము, దాని కంటె సువర్ణ లింగము ఉత్తమములు. వెండి, రాగి, ఇత్తడి, రత్నములు, పాదరసము వీటితో నిర్మించిన శివలింగము భోగమోక్ష ప్రదము, శ్రేష్ఠము. రస లింగమును రత్నములలోగాని, సువర్ణాది లోహములలోగాని బంధించి స్థాపించవలెను. సిద్ధాదులచే స్థాపింపబడిన స్వయంభూలింగాదులకు కొలతలు మొదలగునవి చేయుట యుక్తముకాదు.

బాణ లింగ విషయమున కూడ (నర్మదోద్భవమునకు) ప్రమాణాది చింత ఉండకూడదు. అట్టి లింగములకై ఇచ్ఛానుసారముగ పీఠప్రాసాదాది నిర్మాణము చేయవచ్చును. సూర్యమండలస్థ శివలింగమును అద్దములో ప్రతిబింబింపజేసి పూజించవలెను. లింగముపై శివార్చన పరిపూర్ణము, సకల కామప్రదము. శివలింగము ఎత్తు హస్తము కంటె ఎక్కువ ఉండవలెను. కాష్ఠమయ శివ లింగముకూడ అంతయే ఉండవలెను. చల శివలింగ స్వరూపమును అంగుళమానానుసారమును, స్థిర లింగ స్వరూపమును ద్వార, గర్భ, హస్తమానముల అనుసారమును నిర్ణయింపవలెను. గృహములో పూజింపబడు చలలింగము ప్రమాణము ఒక అంగుళము మొదలు పదునైదు అంగుళముల వరకును ఉండవచ్చును.

ద్వార మానమునుబట్టి లింగము మూడు విధములగును. వీటిలో ఒక్కొక్క దానికి గర్భ మానమును బట్టి, తొమ్మిదేసి భేదములగును. హస్తమానముచే తొమ్మిది భేదములగును. వీటిని దేవాలయములలో పూజింపవలెను. ఈ విధముగ అన్నింటిని కలపగా ముప్పది యారు లింగములు. ఇది లింగముల జ్యేష్ఠ మానము. మధ్యమమాన, కనిష్ఠ మానముల చేత కూడ ముప్పదియారు, ముప్పదియారు శివలింగములగును. ఈ విధముగ అన్ని లింగములను కలుపగా నూట ఎనిమిది లింగములగును. ఒకటి మొదలు ఐదు అంగుళముల వరకు కనిష్ఠము (చిన్నది). ఆరు నుండి పది అంగుళముల వరకు చలలింగము మధ్యమము. పదకొండు నుండి పదునైదు అంగుళముల వరకు చల శివలింగము జ్యేష్ఠము. చాల మూల్యముగల రత్నములతో నిర్మించిన లింగము ఆరు అంగుళములు, సాధారణ రత్న నిర్మితము తొమ్మిది అంగుళములు, సువర్ణ నిర్మితము పండ్రెండు అంగుళములు, ఇతర పదార్థ నిర్మితము పదునైదు అంగుళములు ఉండవలెను.

లింగ శిలను పదునారు భాగములు చేసి పై నాలుగు భాగములలో ప్రక్కనున్న రెండు భాగములను తీసివేయవలెను. మరల ముప్పది రెండు భాగములు చేసి దాని రెండు కోణములందును ఉండు పదునారు భాగములు తీసివేయవలెను. మరల దానిలో నాలుగు భాగములు కలుపగా కంఠము ఏర్పడును. అనగా ఇరువది భాగములు కంఠముగా ఏర్పడును. రెండు ప్రక్కలను ఉన్న పండ్రెండు భాగములను తీసివేయుటచే జ్యేష్ఠచల లింగము ఏర్పడును. ప్రాసాద (దేవాలయ)ము ఎత్తును పదునారు భాగములుగా విభజింపగా, నాలుగు, ఆరు, ఎనిమిది భాగముల ఎత్తుచే వరుసగా కనిష్ఠ, మధ్య, జ్యేష్ఠ ద్వారములు ఏర్పడును. ద్వారము ఎత్తులో నాల్గవవంతు తగ్గించగా అది లింగము ఎత్తు అగును. లింగ శిలాగర్భము ఎత్తులో సగము ఎత్తుగల శివలింగము కనిష్ఠము. పదునైదు భాగముల ఎత్తుగలది జ్యేష్ఠము. ఈ రెండింటి మధ్య ఏడుచోట్ల సూత్ర పాతము చేయవలెను. ఈ విధముగ తొమ్మిది సూత్రములగును. ఈ తొమ్మిది సూత్రములలో ఐదు సూత్రముల ప్రమాణము గల లింగము మధ్యమము, లింగముల ఎత్తు రెండేసి భాగముల తేడాతో ఉండును. ఈ విధముగ లింగముల పొడవు పెరగగా తొమ్మిది లింగములు నిర్మాణ మగును. హస్తప్రమాణముచే లింగమును నిర్మించినచో, మొదటి లింగము ప్రమాణము ఒక హస్తము రెండవ దాని ప్రమాణము మొదటి దాని కంటే ఒక హస్తము ఎక్కువ. ఈ విధముగ తొమ్మిది హస్తముల కొలత పూర్తి అగువరకు ఒక్కొక్క హస్తము పెంచుతూ పోవలెను. పైన చెప్పిన హీన, మధ్యమ, జ్యేష్ఠ లింగములలో ఒక్కొక్క దానికి మూడేసి భేదములు ఉండును.

బుద్ధిమంతుడు ఒక్కొక్క లింగమునందు విభాగ పూర్వకముగ మూడేసి లింగములు నిర్మింపచేయవలెను. ద్వారమానము, గర్భమానము, హస్తమానము అను ఈ మూడు దీర్ఘమానానుసారము స్థిర లింగమును నిర్మింపవలెను. పై మూడు ప్రమాణములను అనుసరించి భగేశుడు, జవేశుడు, దేవేశుడు అని మూడు పేర్లు ఏర్పడును. విష్కంభ (విస్తార)మును బట్టి లింగమునకు నాలుగు రూపములు గుర్తింపవలెను. దైర్ఘ్య ప్రమాణానుసారము ఏర్పడు, మూడు రూపములలో కావలసిన లింగమునకు శుభమగు ఆయాదిక ముండునట్లు చూచుకొనవలెను. ఈ మూడు విధముల లింగముల పొడవు నాలుగు లేదా ఎనిమిది హస్తములుండుట మంచిది. ఇవి వరుసగ త్రిగుణ స్వరూపములు. లింగము పొడవు ఎన్ని హస్తములు ఉన్నదో ఆ హస్తములను అంగుళముల లోనికి మార్చి, ఎనిమిది, ఏడు, ఐదు, మూడు సంఖ్యలచే విభజించవలెను. మిగిలిన దానిని బట్టి శుభాశుభ నిర్ణయము చేయవలెను.

ధ్వజాధ్యాయములలో ధ్వజ, సింహ, గజ, వృషభాయములు మంచివి. మిగిలిన నాల్గును చెడ్డవి. స్వర సంఖ్యచే అనగా ఏడుచేత భాగించినపుడు షడ్జ, గాంధార, పంచమములు (శేషము) శుభదాయకములు. భూతములచేత, అనగా ఐదుచేత భాగించినప్పుడు శేషము పృథివి అయిన శుభము. అగ్నిచేత, అనగా మూడుచేత భాగించినప్పుడు, శేషము ఆహవనీయాగ్నియైన శుభము. లింగము పొడవును సగముచేసి, దానిని ఎనిమిదిచే భాగించగా శేషము ఏడు వచ్చినచో ఆ లింగము “ఆఢ్యము”, ఐదు కంటె అధికము శేషమైనచో “అనాఢ్యము”. ఆరు అంశల కంటె అధికము శేషమైనచో అది “దేవేజ్యము”. మూడు అంశలకంటె అధికము శేషించినచో అది “అర్కతుల్యము”. ఈ నాలుగు విధములగు లింగములును చతుష్కోణములుగ ఉండును. ఐదవది “వర్ధమాన లింగము”, దీనికి వ్యాసము కంటె అనాహము అధికము. అనాహము వ్యాసముతో సమానముగ ఉండుట, దాని కంటె పెద్దదిగా ఉండుట అను దానినిబట్టి, ఈ లింగములలో రెండు భేదములు ఉండును. విశ్వకర్మ శాస్త్రానుసారము ఈ అన్నింటి భేదము అనేకములు చెప్పబడగలవు. స్థూలత్వాదులచే ఆఢ్యాది లింగములలో మరల మూడు భేదములుండును. వాటికి ఒక్కొక్క యవ చొప్పున పెంచగా మొత్తము ఎనిమిది విధముల లింగములు ఏర్పడును. హస్తమానమును బట్టి ‘జిన’మను లింగమునకుగూడ మూడు భేదములగును. దానిని సర్వసమ లింగమున కలిపి వేయవలెను.

 అనాఢ్యము, దేవార్చితము, అర్కతుల్యము అను లింగములకుగూడ ఐదేసి భేదము లగుటచే ఇరువదియైదు అగును. ఏక, జిన, భక్త భేదములచే డెబ్బదియైదు భేదములు అగును. అన్నియు కలుపగా పదునైదువేల, నాలుగు వందల శివలింగములగును. ఎనిమిది అంగుళముల విస్తారముగల లింగముకూడ ఏకాంగుళ మానము, హస్తమానము, గర్భ మానము అనుమానత్రయము ననుసరించి తొమ్మిది భేదములగును. వీటి నన్నింటిని కోణ, అర్ధ కోణములందున్న సూత్రములచే వీటి కోణములను విభజింపవలెనని ఒక్కొక్క విభాగము యొక్క విస్తారము, లింగ మధ్యభాగ విస్తార తుల్యముగ భావించి మధ్య, ఊర్ధ్వ, అధో విభాగములు ఏర్పరుపవలెను. మధ్యమ విభాగముపైన ఉన్న అష్ట కోణము లేదా షోడశకోణము అగు విభాగము శివుని అంశము. మూల భాగమునుండి జానువు పర్యంతముండు లింగ అధో భాగము బ్రహ్మయొక్క అంశము. జానువు నుండి నాభి వరకును ఉన్న లింగ మధ్యభాగము విష్ణువు యొక్క అంశము.

మూర్దాంత భాగము భూతభాగేశ్వరునిది. వ్యక్త, అవ్యక్త లింగములు అన్నింటికిని ఇదే పద్దతి. ఐదు లింగముల ఏర్పాటున్న శివలింగమునకు శిరోభాగమును గుండ్రముగ చేయవలెను. ఈ గోళాకారము ఛత్రమువలె నుండవచ్చును. కోడిగుడ్డువలె నుండవచ్చును, లేదా సవోదిత చంద్రునివలె ఉండవచ్చును. కామ్య భేదమును బట్టి నాలుగు విధములగు ఫల భేదములను చెప్పుచున్నాను. లింగము శిరోవిస్తారము ఎన్ని అంగుళములుండునో ఆ సంఖ్యను ఎనిమిదిచే భాగించవలెను. ఈ విధముగ శిరస్సును ఎనిమిది భాగములుగ విభజించి మొదటి నాలుగు భాగములను విస్తార ఔన్నత్యములను అనుసరించి గ్రహింపవలెను. ఒక భాగమును తీసివేయగా “పుండరీకము” అను లింగము, రెండు భాగములను తీసివేయగా, ‘విశాలము’ అను లింగము, మూడు భాగములను తీసివేయగా “శ్రీవత్సము” అను లింగము, నాలుగు భాగములను తీసివేయగా “శత్రుకారక లింగము” ఏర్పడును. అన్ని ప్రక్కలనుండియు శిరోభాగము సమముగనున్నది శ్రేష్ఠము. దేవపూజ్య లింగము నందు లింగశిరోభాగము కుక్కుటాండము(కోడిగ్రుడ్డు) వలె గోళాకారమున నుండవలెను.

చతుర్భాగాత్మక లింగమునందు పై రెండు భాగములను తొలగించగా “త్రపుష” మను లింగము ఏర్పడును. ఇది అనాఢ్యమను శివలింగముయొక్క శిరస్సుగా చెప్పబడుచున్నది. ఇపుడు అర్ధ చంద్రాకార శిరస్సు గూర్చి వినుము. శివలింగ ప్రాంతభాగమునందు ఒక అంశమును నాలుగు అంశములుగ చేసి ఒక అంశమును విడచినచో దానికి “అమృతాక్షరము” అని పేరు. రెండవ, మూడవ, నాల్గవ అంశములను తొలగింపగా క్రమముగ వాటికి “పూర్ణేందు” “బాలేందు” “కుముద”ములు అని పేర్లు. ఇవి క్రమముగ చతుర్ముఖ, త్రిముఖ, ఏక ముఖములు. ఈ మూడింటికి “ముఖ లింగము”లని కూడ పేర్లు. ఇపుడు ముఖలింగమును గూర్చి వినుము. పూజాభాగమును, మూర్తిపూజ, అగ్నిపూజ, పదపూజ అని మూడు విధములుగ కల్పించుకొనవలెను. వెనుకటివలె ద్వాదశాంశమును విడచి, ఆరు భాగములద్వారా ఆరు స్థానములను అభివ్యక్తము చేయవలెను. శిరస్సు ఎత్తుగా నుండునట్లు, లలాట, నాసికా, ముఖ, చిబుక, కంఠములు స్పష్టముగ కనబడునట్లు చేయవలెను. నాలుగు అంశములచే రెండు భుజములను, నేత్రములను ఏర్పరుపవలెను. ప్రతిమా ప్రమాణానుసారము హస్తము ముకుళాకారముగ ఏర్పరచి, విస్తారములోని ఎనిమిదవ అంశముచే నాలుగు ముఖములను ఏర్పరుపవలెను. అన్ని ప్రక్కల నుండియు సమముగ ఉండవలెను. ఇంతవరకు చతుర్ముఖ లింగమును గూర్చి చెప్పితిని; ఇప్పుడు త్రిముఖ లింగమును గూర్చి చెప్పెదను వినుము.

చతుర్ముఖ లింగముకంటె త్రిముఖ లింగమునకు చెవులు, పాదములు అధికము. లలాటాదులను వెనుకటివలెనే ఏర్పరుపవలెను. నాలుగు అంశలతో రెండు భుజములను నిర్మింపవలెను. వాటి వెనుక భాగము దృఢముగా ఉండవలెను. విస్తారము యొక్క ఎనిమిదవ అంశమునందు మూడు ముఖములును స్పష్టముగ కనబడవలెను. (ఏక ముఖ లింగము): ఏక ముఖమును తూర్పు వైపున నిర్మింపవలెను. దాని నేత్రములు సౌమ్యముగా ఉండవలెను. దాని లలాట, నాసికా, ముఖ, కంఠములు పైకి ఉబికి ఉండవలెను. బాహు విస్తారములో ఐదవ అంశముచే పైన చెప్పిన అవయవముల నిర్మాణము జరుగవలెను. దానిని బాహురహితముగ నిర్మింపవలెను. ఈ ఏకముఖ లింగము నందు విస్తారములో ఆరవ అంశమునందు ముఖ నిర్మాణము హితకరమని చెప్పబడినది. ముఖయుక్తములగు అన్ని లింగముల శిరోభాగములును త్రపుషాకారములో గాని, కుక్కుటాండాకారములో గాని ఉండవలెను. (54)