అగ్ని మహా పురాణము

Table of Contents

జగత్సర్గ వర్ణనము

మొదటిది మహత్తు యొక్క సృష్టి. అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూతసర్గము (సృష్టి) అని చెప్పబడును. మూడవ సృష్టి వైకారికము. అదియే ఐంద్రియక సృష్టి అని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్తత్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి. నాల్గవది ముఖ్య సర్గము. స్థావరములు ముఖ్యములని చెప్పబడుచున్నవి. తిర్యక్ర్సోతస్సు అని చెప్పబడిన సృష్టికి “తైర్యగ్యోన్యము” (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు. ఊర్ధ్వ స్రోతస్సుల సృష్టి ఆరవది అదియే దేవసర్గము. పిమ్మట అర్వా క్ర్సోతసుల సృష్టి. అది ఏడవదైన మానుష సర్గము. ఎనిమిదవ సర్గము అనుగ్రహకరము. సాత్త్వికము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును వైకృత సర్గములు. మొదటి మూడును కృతసర్గములు. ప్రాకృత సర్గములు మూడును, వైకృత సర్గములు ఐదును, తొమ్మిదవదైన కౌమార సర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గములును జగత్తు యొక్క మూల కారణములు.

సృష్టి నిత్యము, నైమిత్తికము ప్రాకృతము అని రెండు విధములైనదిగా కొందరిచే చెప్పబడినది. అవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్య సర్గము, అది దైనందిన సర్గము. ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.

భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్షకన్యలను వివాహమాడిరి. ఖ్యాతి భృగువువలన ధార, విధాత అను దేవతలను లక్ష్మిని కనెను. విష్ణుపత్నియైన ఈ లక్ష్మిని ఇంద్రుడు వృద్దికొరకై స్తుతించెను. ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రులు జనించిరి. మృకండునకు మార్కండేయుడును, అతనికి వేదశిరస్సు జనించిరి.

అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను.

పులస్త్యుని భార్యయైన ప్రీతికి దత్తోలియను కుమారుడు పుట్టెను. క్షమకు పులహుని వలన సమిష్ణువు, క్రముడు, పాదికుడు అను పుత్రులు జనించిరి.

క్రతువునకు సన్నతి యందు గొప్ప తేజస్సు గలవారును, బొటనవేలు కణుపు ప్రమాణము కలవారును అగు అరవై వేలమంది వాలఖిల్యులు పుట్టిరి.

వసిష్ఠుని వలన ఉర్జయందు రాజు, గాతుడు, ఊర్ధ్వబాహుడు, సవనుడు, అలఘుడు, శుక్రుడు, సుతపుడు అను ఏడుగురు ఋషులు నించిరి. స్వాహా-అగ్నులకు పావకుడు, పవమానుడు, శుచి అను కుమారులు పుట్టిరి. అజుని నుండి అగ్నిష్వాత్తుడు, బర్హిషత్, అనగ్ని, సాగ్ని అనుకుమారులు జనించిరి.

పితృ దేవతలకు స్వధయందు మేన, వైధారిణి అను కుమార్తెలు పుట్టిరి. అధర్ముని భార్య హింస, వారిరువురికిని అనృతము పుట్టెను.

అధర్మ, హింసలకు నికృతి అను కన్యయు పుట్టినది. ఈ అనృతము నికృతియు మిథునమయ్యెను. వారివలన భయము, నరకము పుట్టెను. వారికి వరసగా మాయయు, వేదనయు భార్యలైరి. వారిలో మాయ భూతములను నశింపచేయు మృత్యువును కనెను. వేదన నరకమువలన దుఃఖమనే కుమారుని కనెను. మృత్యువునకు వ్యాధి జర, శోకము, తృష్ణ, క్రోధము సంతానముగా జనించిరి. బ్రహ్మదేవుని నుంచి రోదించుచు (ఏడ్చుచు) పుట్టుటచే రుద్రుడను పేరుగల కుమారుడు పుట్టెను. ఆతనికే పితా మహుడుభవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అను పేర్లు పెట్టెను.

ఆతని భార్యయైన సతీదేవి దక్షునిపై కోపముచే దేహమును విడచి, హిమవంతుని కుమార్తెగా జనించి మరల ఆతని (రుద్రుని) భార్య ఆయెను.

స్వాయంభువాదులు నారదాదులచే ఋషులకు చెప్పబడినవియు, భుక్తి ముక్తి ప్రదములును అగు విష్ణ్వాదులకు చేయదగిన స్నానాది పూజలను చేసి చరితార్థులైరి. (20)