అగ్ని మహా పురాణము

Table of Contents

లక్ష్మ్యాది పూజా కథనము

అగ్నిదేవుడు పలికెను:

వాంత(శ్), వహ్ని(ర్), వామనేత్ర(ఈ), దండ(o)ముల యోగముచే ఏర్పడిన శ్రీం అను బీజము శ్రీదేవీ మంత్రము. సర్వసిద్ధిప్రదము. ‘మహాశ్రియే మహాసిద్ధే మహా విద్యుత్ర్పభే శ్రియేదేవి విజయేగౌరి మహాబలే బంధ నమః హుం మహాకాయే పద్మ హస్తే హుంఫట్ శ్రియై నమః హ్రూం శ్రియైఫట్ శ్రియైనమః శ్రీయే శ్రీద నమః స్వాహా శ్రీఫట్’ ఇవి శ్రీ మంత్రమునకు తొమ్మిది అంగన్యాసములుగా చెప్పబడినవి. వీటిలో ఒక దానిని గ్రహించ వలెను. పద్మాక్షమాలతో ఈ మంత్రమును మూడు లక్షలుగాని, ఒక లక్షగాని జపించినచో ఐశ్వర్యము లభించును. లక్ష్మీ ఆలయమునందు గాని విష్ణ్వాలయము నందుగాని శ్రీదేవిని పూజించినచో ధనము లభించును. ఖదిర కాష్ఠముతో ప్రజ్వలించుచున్న అగ్నిలో ఘృత మిశ్ర తండులములతో నూరు హోమములు చేసినచో రాజు వశుడు అగును. లక్ష్మికి ఉత్తరోత్తర వృద్ధి కలుగును. శ్రీమంత్రముతో అభిమంత్రించిన సర్షప జలముతో స్నానము చేయగ సకలవిధ గ్రహబాధలు నశించును. ఒక లక్ష బిల్వ ఫలములు హోమము చేసిన లక్ష్మి లభించును. ధనవృద్ధి కలుగును. నాలుగు ద్వారములు గల ఒక శక్ర వేశ్మను భావన చేయవలయును. పూర్వ ద్వారముపై క్రీడించుచున్నదియు, రెండు భుజములు పైకి ఎత్తి వున్నదియు, శ్వేతకమలమును ధరించినదియు, శ్యామ వర్ణయు వామనాకృతి కలదియుఅగు బలాకీని ధ్యానము చేయవలయును. దక్షిణ ద్వారమున పైకి ఎత్తిన ఒక హస్తమున రక్త కమలము ధరించియున్న శ్వేత శరీరయగు వనమాలిని ధ్యానించవలెను. పశ్చిమ ద్వారమున పైకి ఎత్తిన రెండు చేతులలో శ్వేత పుండరీకమును ధరించినదియు, హరిత వర్ణయు, విభీషిక అను పేరు కలది అగు శ్రీ దూతిని ధ్యానించవలెను. ఉత్తర ద్వారమున శాంకరిని ధ్యానించవలెను. శక్ర వేశ్మ మధ్యమున అష్టదళ కమలము నిర్మించి దాని దళములపై వరుసగా శంఖ చక్ర గదా పద్మములను ధరించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నుని అనిరుద్ధులను ధ్యానించవలెను. వారి శరీర కాంతి వరసగా అంజన దుగ్ధ కేసర సువర్ణములతో సమానము. వీరు సుందర వస్త్రాలంకృతులు, ఆగ్నేయాది దళము లందు గుగ్గులు కురంటజ దమక, సలిలులు అను దిగ్గజములను భావన చేయవలెను. ఈ దిగ్గజములు స్వర్ణ కలశములను ధరించి యుండును. కమల కర్ణిక యందు శ్రీదేవిని స్మరించవలెను. చతుర్భుజయగు ఆమె శరీరము సువర్ణ కాంతి కలది. పైకి ఎత్తిన రెండు హస్తములందును కమలములును దక్షిణహస్తమున అభయ ముద్రయు వామహస్తమున వరముద్రయు ఉండును. శుభ్రమైన సుగంధములైన వస్త్రములను తెల్లని మాలను ధరించి యుండును. అట్టి శ్రీదేవిని ధ్యానించి సపరివారముగా ఆమెను పూజించిన వాడు సకల ఫలములను పొందును.

పూజా సమయమున ద్రోణపుష్పమును కమలమును బిల్వ పత్రమును శిరస్సున ధరించకూడదు. పంచమీ సప్తములయందు వరుసగా లవణమును ఆమలకమును త్యజించవలెను. పాయసమును మాత్రము భుజించుచు శ్రీ సూక్తము జపించి ఆ సూక్తముతోనే అభిషేకము చేయవలెను. ఆవాహనాది విసర్జన పర్యంతము అన్ని ఉపచారములను శ్రీ సూక్త ఋక్కులతో చేసి ధ్యాన పూర్వకముగ శ్రీదేవిని పూజించవలెను. బిల్వ ఘృత కమల పాయసములు కలిపి గాని వేర్వేరుగా కాని లక్ష్మిని ఉద్దేశించి హోమమును చేయవచ్చును. ఈ హోమము లక్ష్మి ప్రాప్తికిని మంచిది. విష(మ) హి మజ్జా (ష) కాల(మ) అగ్ని(ర) అతి(న) నిష్ఠ(ఇ) ని స్వాహా (మహిష మర్దిని స్వాహా). ఇది మహిష మర్దిని అష్టాక్షర మంత్రము. ‘ఓం హ్రీం మహా మహిష మర్దిని స్వాహా’ ఇది మూలమంత్రము. మహిష మర్దిని మహిష శత్రుంభ్రామయ. ‘ఓం హ్రూం ఫట్’ మహిషం హేషయ హేషయ మహిషం హ్రేషయ హ్రేషయ హ్రూం మహిషం హనహన దేవి హ్రూం మహిషనిషూదని ఫట్’. ఇది అంగసహితమగు దుర్గా హృదయము. సర్వకార్య సాధకము, పీఠముపై అష్ట దళ కమలముపై దుర్గాదేవిని ఈ క్రింది విధముగా పూజించవలెను. ఓం హ్రీం దుర్లే రక్షణి స్వాహా. ఇది దుర్గా మంత్రము. అష్ట దళ పద్మముపై దుర్గా వర వర్ణినీ ఆర్యా, కనకప్రభా, కృత్తికా, అభయప్రదా కన్యకా, సురూప అను శక్తుల ఆద్యక్షరములకు బిందువు చేర్చి ఆ బీజ మంత్రములతో కూడి నామమంత్రములతో పూజించవలెను. చక్ర, శంఖ, గదా, ఖడ్గ, బాణ, ధనుష్, అంకుశ ఖేటములను కూడ పూజించవలెను. అష్టమ్యాది తిథులందు లోకేశ్వరీ దుర్గను పూజించవలెను. ఈ దుర్గోపాసన పూర్ణాయుర్దాయమును లక్ష్మిని యుద్ధమునందు జయమును ఇచ్చును. వశము చేసుకొనవలసిన వాని నామము చేర్చి ఈ మంత్రముతో తిలహోమము చేయువాడు వశము చేసుకొనును. కమల హోమముచే విజయము లభించును. శాంతి కోరువాడు దూర్వాహోమము చేయవలయును. పలాశ సమిధలచే పుష్టి కలుగును. కాకపక్షములు హోమము చేసినచో మారణ విద్వేషణ కర్మలు సిద్ధించును. ఈ మంత్రము సకల గ్రహ క్షుద్ర భయ ఆపదలను నశింపచేయును. ‘ఓం దుర్గే దుర్గే రక్షణి స్వాహా’. ఇది అంగసహితమగు రక్షణ ఇచ్చు జయ దుర్గా మంత్రము. శ్యామాంగియు త్రినేత్రియు చతుర్భుజయు శంఖ, చక్ర, శూల, ఖడ్గ ధారిణియు రౌద్ర రూపిణియు అగు రణచండి నేనే అని ధ్యానము చేయవలెను. యుద్ధ ప్రారంభమున ఈ జయదుర్గా మంత్రము జపించవలెను. ఖడ్గాదులపై దుర్గా పూజను చేసినచో విజయము లభించును. యుద్ధము నందు ఓం నమో భగవతి జ్వాలా మాలిని! గృధ్రగణ పరివృతే చరాచర రక్షిణి స్వాహా అను మంత్రమును జపించవలెను. విజయము లభించును. (308)