అగ్ని మహా పురాణము

Table of Contents

కుమ్భాధివాస విధి

హయగ్రీవుడు చెప్పెను: దేవతా ప్రతిష్ఠా పూజల కొరకై గ్రహించిన భూమిపై నారసింహ మంత్రము చదువుచు రాక్షసులను తొలగించు అక్షతలు, ఆవాలు, పంచ గవ్యములు చల్లవలెను. రత్నయుక్తమగు కలశపై అంగదేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను. అస్త్ర మంత్రముతో నూట ఎనిమిది పాత్రలను పూజింపవలెను. అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశమును ప్రదక్షిణా క్రమమున త్రిప్పి చిమ్మిన అన్నముపై ఉంచవలెను. కలశమునకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. “యోగే యోగే” ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్థాపింపవలెను. స్నానమండపమున కుశలపై శయ్య దానిపై పరుపు పరిచి, దిక్కుల యందును, విదిక్కుల యందును విద్యాధిపతులను (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను. పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామనులను, ఆగ్నేయాది విదిక్కులందు క్రమముగ శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదరులను పూజింపవలెను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశములలో స్నానము నకు ఉపయోగించు అన్ని ద్రవ్యములను ఉంచవలెను. ఆ కలశములను నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నిమిత్తమై ఏర్పరచిన ఆ కలశములను చాల గౌరవ భావముతో ఉంచవలెను. తూర్పున నున్న కలశముపై వట, ఉదుంబర, అశ్వత్థ, చంపక, అశోక, బిల్వ, పలాశ, అర్జున, ప్లక్ష, కదంబ, వకుల, చూత పల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కునందున్న కలశములో కమల, రోచనా, దూర్వాదర్భ, జాతీపుష్ప, కుంద, చందన, రక్త చందన, సిద్ధార్థ, తగర తండులములను ఉంచవలెను. పశ్చిమ దిక్కునందున్న కలశములో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందలి మట్టి, విశేషముగ గంగామృత్తు, గోమయము, యవలు, వరిబియ్యము, తిలలు ఉంచవలెను.

ఉత్తర దిక్కునందున్న కలశములో విష్ణుపర్ణి, శాలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంహి, బల, వ్యాఘ్రి, లక్ష్మణ అను ఓషధులను ఉంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశములో మాంగలిక వస్తువులను ఉంచవలెను. అగ్ని కోణమునందును రెండవ కలశలో ఏడు స్థానముల నుండి గ్రహింపబడిన మట్టిని, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశములో గంగ ఇసుకను, గంగాజలమును ఉంచవలెను. వాయవ్య కోణమునందున్న మరొక కలశము నందు సూకర, వృషభ, గజముల దంతములచేతను, కొమ్ముల చేతను పెకలించిన మట్టిని, పద్మము మొదట్లోనున్న మట్టిని, ఇతర కలశమునందు దర్భల మొదట్లో ఉన్న మట్టిని ఉంచవలెను. మరొక కలశమునందు పర్వతమృత్తికతో కూడిన జలము ఉంచవలెను. మరొక కలశము నందు నాగకేసర పుష్ప కేసరములను ఉంచవలెను. మరొక కలశమునందు చందనము, అగరు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైఢూర్య, విద్రుమ, ముక్తా, స్ఫటిక, వజ్రములను ఉంచవలెను.

వీటిని అన్నింటిని ఒక కలశములో ఉంచి, దానిపై ఇష్టదేవతను స్థాపింపవలెను. ఇతర కలశములయందు, నదులు, కొండ, కాలువలు, చెరువులు వీటి నీటితో కూడిన జలమును ఉంచవలెను. ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందు ఇతర కలశములను స్థాపింపవలెను. ఈ కలశములను గంధోదకాదులతో నింపవలెను. వాటిని అన్నిటిని శ్రీ సూక్తముతో అభిమంత్రించ వలెను. ఒక పాత్రలో, అర్ఘ్యముకొరకై, ఆవాలు, గంధము, కుశాగ్రములు, అక్షతలు, ఫలములు, పుష్పములు ఉంచి తూర్పున ఉంచవలెను. కమలములను, శ్యామాలతను, దూర్వాదలములను, విష్ణుక్రాంతను, కుశములను పాద్యముకొరకై దక్షిణమునందు ఉంచవలెను. మధుపర్కము పశ్చిమమునందు ఉంచవలెను. కక్కోల, లవంగ, జాతీఫలములను ఆచమనీయార్థమై ఉత్తరమునందు ఉంచవలెను. దూర్వాక్షతలతో కూడిన ఒక పాత్రను నీరాజనమునకై ఆగ్నేయమునందు ఉంచవలెను. ఉద్వర్తన పాత్రను వాయవ్యమునందును, ఈశాన్యమున గంధపిష్ట పాత్రను ఉంచవలెను. కలశములో సూరా మాంసి, ఉసిరికాయ, సహదేవి, పసుపు మొదలైనవి వేయవలెను. నీరాజనము కొరకై అరువది ఎనిమిది దీపములు ఉంచవలెను. శంఖము, చక్రము, శ్రీవత్సము, వజ్రము, కమలములు మొదలైన వివిధ వర్ణములుగల పుష్పము సువర్ణాది పాత్రలలో సమకూర్చు కొనవలెను. (57)