అగ్ని మహా పురాణము

Table of Contents

ద్వాదశ సంగ్రామములు

అగ్నిదేవుడు పలికెను:

కశ్యప మహర్షి వసుదేవుడుగను, స్త్రీలలో శ్రేష్ఠురాలగు అదితి, దేవకిగను అవతరించిరి. వారికి శ్రీకృష్ణుడు కుమారుడుగ అవతరించెను. మహాతపశ్శాలియగు శ్రీకృష్ణుడు ధర్మమును రక్షించుటకు అధర్మమును అంతము చేయుటకు దేవతాదులను పాలించుటకు దైత్యాదులను మర్ధించుటకు అవతరించెను. రుక్మిణి సత్యభామ, నాగ్నచిత్ కుమార్తెయగు సత్య వీరు కృష్ణునకు ప్రియమైన భార్యలు. సత్యభామ ఆయనకు ఆరాధ్యదేవి. గాంధారి, లక్ష్మణ, మిత్రవింద, కాళింది, జాంబవతి, సుశీల, మాద్రి, కౌసల్య, విజయ, జయ మొదలగు పరహారువేలమంది స్త్రీలు శ్రీకృష్ణుని భార్యలు. రుక్మిణియందు ప్రద్యుమ్నుడు మొదలగువారును, జాంబవతి యందు సాంబుడు మొదలగువారును జన్మించిరి. శ్రీకృష్ణునకు మొత్తం ఒక కోటి ఎనభైవేల మంది పుత్రులుండిరి. సకల యాదవులును శ్రీకృష్ణునిచే రక్షింపబడిరి. ప్రద్యుమ్నునకు విదర్భ రాజకుమారి యందు యుద్ధ ప్రియుడగు అనిరుద్ధుడు పుట్టెను. అనిరుద్ధునకు వజ్రాదులు కుమారులుగ పుట్టిరి. యాదవులందరును మహా బలవంతులు, మొత్తము వారి సంఖ్య మూడు కోట్లు. ఆ సమయమున అరువది లక్షల దానవులు మనుష్యులుగా పుట్టి లోకులను హింసించు చుండిరి. వారిని నశింప చేయుటకే శ్రీకృష్ణుడు అవతరించెను. కర్మమర్యాద పాటించు వారి రక్షణకై కూడ అవతరించెను.

దేవాసురుల మధ్య దాయ భాగముకొరకై పండ్రెండు యుద్ధములు జరిగెను. నారసింహము వామనము వారాహ సంగ్రామము, అమృత మంథనము, తారకామయ సంగ్రామము, ఆజీవకము, జిత్ హాలహలము, ఘోర కోలాహలము అను పేర్లతో ప్రసిద్ధ మైనవి. పూర్వము నరసింహుడు హిరణ్యకశిపు వక్షమును చీల్చి ప్రహ్లాదుని రాజుగా చేసెను. మరల దేవాసురుల యుద్ధ సమయమున వామనుడుగా అవతరించి కాశ్యప అదితి పుత్రుడై, బలిని వంచించి ఇంద్రునకు రాజ్యమును ఇచ్చెను. వరాహమూర్తియై హిరణ్యాక్షుని చంపి దేవతలను రక్షించి మునిగిపోయిన భూమిని ఉద్ధరించి దేవాది దేవులచే స్తుతింపబడెను. దేవాసురులు కలసి మంథరాచలమును కవ్వముగను, వాసుకిని, త్రాడు గనుచేసి సముద్రము మథించి అమృతమును తీసిరి. అపుడు శ్రీమహావిష్ణువు అమృతమును దేవతలకు ఇచ్చివేసెను. తారకామయ సంగ్రామము నందు బ్రహ్మదేవుడు ఇంద్ర బృహస్పతులు దేవతాదానవులను యుద్ధమునుండి నివారించి దేవతలను రక్షించి సోమ వంశమును స్థాపించెను. ఆజీవక యుద్ధమున విశ్వామిత్ర, వశిష్ట ఇత్యాది ఋషులు, రాగద్వేషాది దానవులను నివారించి దేవతలను పాలించిరి. శివుడు పృథ్వి రథముగా రథమునకు వేదరూపములగు అశ్వములను కట్టి దానిని అధిష్ఠించెను. అపుడు శ్రీమహా విష్ణువు బ్రహ్మను సారథిగ తీసుకొనిన ఈశ్వరునకు శరణ మొసగి తాను బాణమై త్రిపుర దాహమును చేసెను. అంధకాసురుడు గౌరిని అపహరించుటకై రుద్రునకు కష్టమును కలిగించగ, రేవత్యనురక్తుడగు శ్రీహరి ఆ అసురుని సంహరించెను. దేవాసుర యుద్ధము నందు విష్ణువు వృత్ర సంహారమునకై నీటి నురుగుగా ఏర్పడి ఇంద్రుని వజ్రమున లగ్నమయ్యెను. ఈ విధముగ ఇంద్రుని దేవ ధర్మమును పాలించి దేవతలను కష్టముల నుండి విడిపించెను. విష్ణువు పరశురామావతారమును ధరించి శాల్వాది దానవులను జయించి క్షత్రియులను నశింపచేసి దేవతాదులను రక్షించెను. మధుసూదనుడు హాలాహల విషరూపమున ఆవిర్భవించిన దైత్యుని శంకరునిచే నశింపచేసి దేవతా భయమును శమింపచేసెను. దేవాసుర సంగ్రామమున కోలాహలుడను దైత్యుని జయించి మహావిష్ణువు ధర్మమును పాలించి సకలదేవతలను రక్షించెను. రాజులు కుమారులు మునులు దేవతలు ఎల్లరును మహావిష్ణు స్వరూపులే. నేను ఇక్కడ పేర్లు చెప్పినవారును చెప్పనివారును కూడ మహావిష్ణు అవతారములే. (276)