అగ్ని మహా పురాణము
శకున వర్ణనము -3
పుష్కరుడు చెప్పెను:
శత్రు నగరములోనికి చాలకాకులు ఏ మార్గము ద్వారా ప్రవేశించునో ఆ మార్గము నుండి చుట్టుముట్టినచో ఆ నగరము తన వశమగును. ఏదైన సేనకు లేదా సముదాయమునకు ఎడమ ప్రక్కనుండి భయభీతమగు కాకి ఏడ్చుచు ప్రవేశించినచో అది రాబోవు భయమునకు సూచకము. శామియానా, అవయవములు, వాహనములు, పాదుకలు, ఛత్రము, వస్త్రము మొదలగు వాటిచే కాకి నలగకొట్టబడినచో అది తనకు మృత్యు సూచకము. దానిని పూజించినచో తనకు కూడ పూజ లభించును. అన్నాదులచే దానికి ఇష్టము చేకూర్చినచో తనకుగూడ ఇష్టము చేకూరును. కాకి మాటిమాటికి ఇంటి ద్వారము వద్దకు వచ్చుచు పోవుచు ఉన్నచో అది ఎవరో పరదేశీయుడు వచ్చుటకు సూచకము. అది ఏదైన ఎఱ్ఱని వస్తువునుగాని, కాలిన వస్తువునుగాని ఇంటి మీద పెట్టినచో అది గృహదహనమునకు సూచకము.
భృగు నందనా! కాకి మనుష్యుని ఎదుట ఏదైన ఎఱ్ఱని వస్తువు పడవేసినచో ఆతనికి కైదు శిక్ష వచ్చునని సూచింపబడును. పచ్చని రంగుగల వస్తువును పడవేసినచో బంగారము, వెండి లభించునని సూచన. ఏ వస్తువును తన వద్దకు తెచ్చి విడచునో అది లభించును. దేనిని తన దగ్గర నుండి తీసికొని పోవునో అది నష్టమగును. పచ్చి మాంసము తీసికొనివచ్చి ఎదుట పడవేసినచో ధనము, మట్టి పడవేసినచో భూమి, రత్నమును పడవేసినచో మహా సామ్రాజ్యము లభించును. యాత్ర చేయువానికి అనుకూల దిశయందు కాకి వెళ్ళినచో అది కల్యాణకరము, కార్యసాధకము. ప్రతికూల దిశయందు వెళ్ళినచో అది కార్య విఘాతకము; భయంకరము. కాకి ‘కావ్ కావ్’ అనుచు ఎదుటికి వచ్చినచో యాత్రా భంగము కలుగును. కాకి ఎడమవైపున ఉన్నచో శుభము, కుడివైపున ఉన్నచో అశుభము. వామ భాగమునందు ఉండి అనుకూలమైన దిక్కు వైపు ఎగిరినచో శ్రేష్ఠము, కుడి ప్రక్కన ఉండి అనుకూలమగు దిక్కు వైపు ఎగిరినచో మధ్యమ ఫలము. వామ భాగము నందుండి ప్రతి కూలమగు దిక్కువైపు వెళ్ళినచో అది యాత్రను నిషేధించుచున్నది. యాత్రా కాలమున కాకి వచ్చి ఇంటిపై వాలినచో అది అభీష్టసిద్ధి సూచకము. ఒక కాలు ఎత్తి, ఒక కంటితో సూర్యుని వైపు చూచినచో భయము కలుగును. ఏదైన చెట్టు తొఱ్ఱలో కూర్చుండి అరచినచో గొప్ప అనర్థము కలుగును. ఊషర భూమి మీద కూర్చున్నచో అశుభము. కాని దానికి బురద అంటుకొన్నచో మంచిది. మలము మొదలగు అపవిత్ర వస్తువులను ముక్కున పెట్టుకొని కాకి కనబడినచో అన్ని కార్యములు సాధింపబడును. ఇతర పక్షులకు గూడ కాకికి వలెనే ఫలితము తెలియవలెను.
సేవా నివేశమునకు దక్షిణమున కుక్కలు వచ్చినచో అది బ్రాహ్మణ వినాశక సూచకము. ఇంద్రధ్వజ స్థానమునకు వచ్చినచో రాజునకును, నగర ద్వారమునకు వచ్చినచో నగరాధీశునకును మృత్యువు కలుగును. కుక్క మొరుగుచు ఇంటిలోనికి చొరబడినచో గృహ స్వామికి మృత్యువు కలుగును. కుక్క ఎవరిని ఎడమ అవయవములను నాకునో వానికి కార్యసిద్ధి కలుగును. కుడి అవయవములను ఎడమ భుజమును వాసన చూచినచో భయము వచ్చును. యాత్రకు వెళ్ళు వానికి ఎదురుగా వచ్చినచో యాత్రావిఘ్నము కలుగును. భృగునందనా! కుక్కదారికి అడ్డముగా నిలబడినచో మార్గమున చోర భయము సూచితము. ముఖమునందు ఎముకను గ్రహించి కనబడినచో యాత్ర చేయువానికి లాభమేదియు కలగదు. త్రాడుచింకిరి గుడ్డ ముఖమునందు పెట్టుకొని యున్న కుక్కకూడ అశుభ సూచకము. చెప్పుకాని, మాంసముకాని నోటిలో కరచికొని ఎదురైనచో శుభము కలుగును. దానినోటిలో ఏదైన అమాంగలికమగు వస్తువుగాని, కేశముగాని ఉన్నచో అశుభ సూచకము. కుక్క ఎవని ఎదుట మూత్రము విడచి పోవునో వానికి భయము వచ్చును. మూత్ర త్యాగానంతరము కుక్క ఏదైన శుభ స్థానమునకుగాని, శుభకరమగు వృక్షము వద్దకుగాని, శుభకరమగు వస్తువు దగ్గరకుగాని వెళ్ళినచో కార్యము సిద్ధించును. పరశురామా! గ్రద్ద మొదలగువాటి విషయముగూడ ఉక్త విషయము నందు వలెనే గ్రహించవలెను.
గోవులు అకారణముగా త్రేన్చుట ప్రారంభించినచో స్వామికి భయము కలుగును. అది రాత్రి అరచినచో చోరభయము, వికృత స్వరూప స్వరముతో అరచినచో మృత్యు భయము. వృషభము రాత్రి గర్జించినచో స్వామికి కల్యాణమగును. ఆబోతు రంకెలు వేసినచో రాజుకు విజయము లభించును. తాను ఇచ్చిన గోవులుగాని, తన ఇంటిలోనున్న గోవులుగాని అభక్ష్య భక్షణము చేసినచో లేదా తమ దూడలపై ప్రేమ చూపకున్నచో అది గర్భస్రావసూచకము. పాదములతో నేలనుగీయు గోవులు దీనము భయభీతములు అయిన గోవులును భయమును కలిగించును. తడిసిన శరీరము గలవి, ఆనందముచే వికసించిన రోమములు గలవి, కొమ్ములకు మట్టి అంటుకొన్నవి అయిన గోవులు శుభసూచకములు. బుద్ధిమంతులు గేదె మొదలగువాటి విషయమున గూడ ఈ విధముగనే శకునములు చెప్పవలెను.
జీను వేసిన తన గుఱ్ఱముపై ఇతరులు ఎక్కుట, ఆ గుఱ్ఱము నీటిలో కూర్చుండిపోవుట, ఒకే చోట గుండ్రముగా తిరుగుట ఇవి అనిష్ట సూచకములు. ఏ కారణము లేకుండ గుఱ్ఱము నిద్రపోవుట ఆపదను కలిగించును. యవలపైనను బెల్లము పైనను గుఱ్ఱమునకు అరుచి కలిగినను, దాని ముఖమునుండి రక్తము కారుచున్నను, దాని శరీరమంతయు వణకుచున్నను ఇవి అశుభ సూచకములగు దుర్లక్షణములు. గుఱ్ఱము కొంగలతోను, పావురములతోను సారికలతోసు ఆటలు ప్రారంభించినచో అది మృత్యు సూచకము. దాని నేత్రముల నుండి కన్నీళ్లు కారినను అది నాలుకతో పాదము నాకికొనినను వినాశ సూచకము. అది ఎడమ డెక్కతో నేల త్రవ్వినను, ఎడమప్రక్క పండుకొనినను, పగలు నిద్రించినను శుభకరముకాదు. ఒకమాటు కొంచెము మూత్రము విడచునది, నిద్రచే మలిన ముఖముకలది అగు గుఱ్ఱము భయమును సూచించును, గుఱ్ఱము తనపైకి ఎక్కనీ యకున్నను ఎక్కునపుడు వెనుకకు తిరిగి ఇంటిలోనికి వెళ్ళిపోయినను, సవారిచేయు వాని ఎడమ పార్శ్వమునందలి ఎముకలు స్పృశించినను యాత్రలో విఘ్నము కలుగును. శత్రుయోధులను చూచి సకిలించినను, తన యజమాని పాదములను స్పృశించినను విజయము లభించును.
ఏనుగ గ్రామములో మైథునము చేసినచో అది దేశోపద్రవకారకము. ఆడ ఏనుగు గ్రామములో ఈనినను, పిచ్చిదైనను రాజవినాశ సూచకము. ఏనుగ తనపై ఎక్కనీయకున్నను, హస్తిశాలలోనికి వెళ్ళిపోయినను, మదధార స్రవించినను రాజుకు మరణము కలుగును. కుడిపాదము ఎడమకాలిపై ఉంచి, తుండముతో దంతములను తుడిచినచో అది శుభకరము.
తన వృషభము గాని, గుఱ్ఱముగాని, ఏనుగగాని శత్రు సైన్యములోనికి వెళ్ళి పోయినచో అశుభము కలుగును. కొద్ది దూరమునందే మేఘము అంతటను వ్యాపించి పెద్ద వర్షము కురిసినచో సేన నశించును. యాత్రా సమయమునందుగాని, యుద్ధ సమయమునందు గాని, గ్రహ నక్షత్రములు ప్రతికూలమైనను, గాలి ఎదురుగా వీచినను, ఛత్రాదులు విరిగి పడిపోయినను భయము కలుగును. యుద్ధము చేయు హర్షోత్సాహ భరితులై, గ్రహములు కూడ అనుకూలముగా నున్నచో విజయము కలుగును. కాకులు, మాంసాహారి జంతువులును యోధులను తిరస్కరించినచో మండలము నశించును. పూర్వ పశ్చిమ, ఈశాన్య దిక్కులు ప్రసన్నము శాంతములుగా ఉన్నచో ప్రియము, శుభము అగు ఫలము లభించును. (282)
