అగ్ని మహా పురాణము
త్వరితా మూలమంత్రాది వర్ణనము-2
అగ్నిదేవుడు చెప్పెను:
సింహాసనము నందున్న వజ్ర వ్యాప్త కమలమునందు మంత్రన్యాస పూర్వక దీక్షాది విధానమును చెప్పెదను. “హేహే హుతి వజ్ర దంత పురుపురు, లు, లు, గర్జ, గర్జ, ఇహ సింహాసనాయ నమః”. ఇది సింహాసన పూజా మంత్రము. నాలుగు నిలువు రేఖలు, నాలుగు అడ్డరేఖలు గీయగా తొమ్మిది కోష్ఠములు ఏర్పడును. నాలుగు దిక్కులందును వున్న కోష్టములను ఉంచి విదిక్కులందున్న కోష్ఠములను చెరిపి వేయవలెను. మిగిలిన కోష్ఠముల కోణములవరకు వచ్చు రేఖలు ఎనిమిది ఉండును. బాహ్మ కోష్ఠము యొక్క బాహ్య భాగమునకు సరిగా మధ్యయందు వజ్ర మధ్య శృంగమగును. బాహ్య రేఖను రెండు భాగములు చేయగా ఎంత రేఖార్ధమగునో అంత శృంగము మాత్రమే ఉండవలెను. బాహ్య రేఖ వక్రముగా ఉండవలెను. దానిని రెండుగా విభజించవలెను. మధ్య కోష్ఠమును కమలాకారముగ మార్చి పీతవర్ణమగు కర్ణిక ఏర్పరుపవలయును. నల్లటి చూర్ణముతో కులిశ చక్రమును ఏర్పరచి దానిపై శృంగము ఆకారము ఖడ్గాకారములో ఉండునట్లు చేయవలెను. చక్రబాహ్య భాగమున చతురస్ర చక్రము వ్రాసి వజ్రసంపుటముతో చిహ్నితము చేయవలెను. భూపుర ద్వారమున నాల్గు వజ్ర సంపుటములు ఏర్పరుపవలయును. పద్మము వామ వీతియు సమముగా ఉండ వలయును. కమలము లోపలి భాగము కేసరములు ఎర్రగా నుండవలెను. మండలమునందు స్త్రీలకు దీక్ష ఇచ్చి మంత్ర జపానుష్ఠానము చేయించినచో రాజు శీఘ్రముగా ఇతర రాజ్యములను జయించును. తాను తన రాజ్యమును కోల్పోయినచో దానిని మరల పొందును. ఓంకారముచే సందీప్తమగుమూర్తిని హుంకారముతో నియుక్తముచేసి వాయ్వాదశ బీజములతో సంపుటితమగు మూల విద్యనుచ్చరించి ఆద్యంతము లందు కర్ణికయందు పూజించవలెను. ప్రదక్షిణ క్రమమున ఒక్కొక్క అక్షర రూపమగు బీజములను ఉచ్చరించుచు కమల దళములపై పూజ చేయవలయును.
దళములపై విద్యాంగములను పూజించవలెను. ఆగ్నేయము నుండి నామ క్రమమున నైఋతి దిక్కు వరకు హృదయ శిరః శిఖా కవచ, నేత్రములను అన్ని దిక్కులందును అస్త్రమును పూజించవలెను. గుహ్యాంగమున రక్షాపూజను కేసరములపై వామ దక్షిణ పార్శ్వములందును ఐదేసి హుతులను వాటి వాటి నామమంత్రములతో పూజించవలెను. గర్భమండలము వెలుపల ఎనమండుగురు లోకపాలకుల న్యాసము చేయవలెను. వర్ణాంతమును (క్ష హ) అగ్ని పై(ర) ఎక్కించి దానిని ఆరవ స్వరముతో(ఊ) భిన్నముచేసి పదునైదవ స్వరమును(౦) దానిని శిరస్సుపై చేర్చి (క్షూం) లేదా (హూం) ఆ బీజమును ఆది యందుంచి దిక్పాలకులను తమ తమ నామ మంత్రములతో పూజించవలెను. పిదప శీఘ్రముగా సింహాసనముపై కమల కర్ణికయందు గంధాద్యుపచారములతో పూజచేయ వలయును. దీనిచే ఐశ్వర్యము లభించును. పిదప నూట యెనిమిది మంత్రములతో అభిమంత్రితములగు ఎనిమిది కలశలను కమలము చుట్టూవుంచి వెయ్యి పర్యాయములు జపముచేసి దశాంశము హోమము చేయవలయును. ముందు అగ్ని మంత్రముతో (రం) కుండము దగ్గరకు అగ్నిని తీసుకొని పోయి హృదయమంత్రముతో (నమః) దానిని ఉంచవలెను. కుండమునందు అగ్ని యుక్తమగు శక్తిని భావన చేయవలెను. ఆ శక్తియందు గర్భాధాన, పుంసవన జాతకర్మ సంస్కారములను ఉద్దేశించి హృదయ మంత్రముతో కూడ ఎనిమిది పర్యాయములు హోమము చేయవలెను. గుహ్యాంగము నుండి నూతనాగ్ని జన్మించినట్లు భావనచేసి మూలవిద్యను ఉచ్చరించుచు పూర్ణాహుతి నివ్వవలెను. దీనితో శివాగ్ని జన్మ సిద్ధించును. పిదప మూల మంత్రముతో దానిలో నూరు హోమములు చేసి అంగములను ఉద్దేశించి దశాంశ హోమముచేసి శిష్యుని దేవి చేతిలో సమర్పించి వానిని మండపమునందు ప్రవేశపెట్టవలెను. అస్త్ర మంత్రముతో తాడనముచేసి గుహ్యాంగముల న్యాసము చేయవలెను. విద్యాంగములచే సన్నద్ధులగు శిష్యుని విద్యాంగములందు నియోగించవలెను. వానిచే ఒక పుష్పము విసిరినట్లుచేసి వానిని అగ్నికుండ సమీపమునకు తీసుకొనివెళ్లి మూలవిద్యను ఉచ్చరించుచు యవధాన్య తిల ఘృతములతో నూరు హోమములు చేయవలెను.
ప్రథమ హోమము స్థావర జన్మమునిచ్చి వానికి ముక్తి నిచ్చును. రెండవది సరిస్రుప జన్మమును పిదప వరసగా పక్షి, మృగ, పశు, మానవ జన్మమును ఇచ్చి దాని యందు విముక్తి నిచ్చును. పిదప క్రమముగ బ్రహ్మ, పరవిష్ణుపద, రుద్రపదము లభించును. అంతమున పూర్ణాహుతి ఇవ్వవలెను. ఒక ఆహుతిచే శిష్యుడు మోక్షాధికారి అగును. మోక్షమనగా ఎట్లుండునో వినుము.
మంత్రోపాసకుడు సుమేరువుపై సదాశివ పదమునందున్నచో, రెండవ దినమున స్వస్థచిత్తుడై కర్మ క్షయ నిమిత్తమై వేయిహోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చిన మంత్రయోగి ధర్మాధర్మ సంబంధ శూన్యుడై మోక్షమును పొందును. అచ్చటికి వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు. జలములో పోసిన జలము దానితో కలసి ఏకరూపమైనట్లు జీవుడు శివునితో కలసి శివరూపుడగును. కలశములతో అభిషేకము చేసినవాడు విజయ రాజ్యాదులను పొందును. బ్రాహ్మణ కన్యకను పూజించి గుర్వాదులకు దక్షిణ ఇవ్వవలెను. ప్రతి దినము పూజచేసి వెయ్యి హోమములు చేయవలెను. తిల ఘృతములతో హోమము చేసినచో దేవి లక్ష్మిని, సమస్త కామములను ఇచ్చును, అనేకమైన భోగములను ఇచ్చి కోరిన కోరికలు అన్నియు తీర్చును. మంత్రములో ఎన్ని అక్షరములున్నవో అన్ని లక్షల జపము చేయుటచే నిధులకు అధిపతి అగును. రెట్టింపు జపము చేసినవాడు రాజ్యమును పొందును. మూడు రెట్లు జపము చేసినవానికి యక్షిణి సిద్ధించును. నాలుగు రెట్లు జపము బ్రహ్మపదము, ఐదు రెట్లు ఎక్కువ చేసిన విష్ణు పదము, ఆరురెట్లు ఎక్కువ చేసిన మహాసిద్ధియు లభించును. ఈ మంత్రమును లక్ష పర్యాయము జపించినచో పాపము నశించును. పది పర్యాయములు జపించినచో దేహశుద్ధి కలుగును. నూరు పర్యాయములు జపించినచో తీర్థస్నాన ఫలము లభించును. వేదికపై పటమునుగాని, ప్రతిమనుగాని ఉంచి దాని మొదట లక్ష లేదా పదివేల జపముచేసి హోమము చేయవలెను. ఈ విధముగా జపముచేసి లక్షహోమములు చేయవలెను. తిల యవ, లాజు, వ్రీహి, గోధూమ, ఆమ్ర, ఫలబిల్వ, ఫలములను కలిపి వాటిపై నెయ్యిపోసి వాటితో హోమముచేసి వ్రతమును అవలంబించవలెను. రాత్రి కవచాదులు ధరించి ఖడ్గ ధనుర్బాణాదులు గ్రహించి ఏకవస్త్ర ధారియై పైనచెప్పిన వస్తువులతో దేవుని పూజించవలెను. వస్త్రము రంగు రక్తముగాని పీతముగాని కృష్ణముగాని నీలముగాని ఉండవలెను. దక్షిణ దిశకువెళ్ళి మండప ద్వారముపై దూతి మంత్రముతో బలి సమర్పించవలెను. ఈ బలి ద్వారాదులందుగాని, ఒక వృక్షము వున్న శ్మశానము నందుగాని ఇవ్వవచ్చును. ఇట్లు చేసిన సాధకుడు రాజ్యము పొంది సమస్త కామములను అనుభవించుచు సకల పృథ్విని ఏలును. (311)
