అగ్ని మహా పురాణము

Table of Contents

ఆదిమూర్త్యాది పూజా విధి

నారదుడు పలికెను: విప్రులారా! ఏపూజావిధిచే సర్వకార్య కామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని ఆచమనము చేసి, మౌనము అవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తిక ఆసనమునందు కాని, పద్మాసనమునందుగాని, మరొక ఆసనము నందు కాని కూర్చుండి, నాభి మధ్యలో ఉన్నదియు, ధూమ్రవర్ణము కలదియు, తీవ్ర వాయురూపమైనదియు అగు “యం” బీజమును ధ్యానించుచు శరీరము నుండి సకల కల్మషములను శోషింప చేయవలెను.

హృదయపద్మ మధ్యము నందున్న తేజో నిధియగు “క్షౌం” అను బీజమును స్మరించుచు, క్రిందికిని, పైకిని, అడ్డముగను ప్రసరించే జ్వాలలచే కల్మషమును దహించవలెను.

ఆకాశమునందు చంద్రుని ఆకారము వంటి ఆకారమును ధ్యానము చేయవలెను. దాని నుండి స్రవించుచున్నదియు, సుషుమ్నా నాడిద్వారా సమస్త నాడులందును వ్యాపించు చున్నదియు, హృదయ పద్మమును వ్యాపించుచున్నవియు అగు అమృత ధారలచేత తన దేహమును నింపవలెను.

శోధనము చేసి తత్త్వనాసనము చేయవలెను. పిమ్మట కరశుద్ధి కొరకు అస్త్ర వ్యాపక ముద్రలను చేయవలెను. కుడిచేతి అంగుష్ఠము నుండి కరతలము వరకు న్యాసము చేయవలెను. దేహమునందు పన్నెండు అక్షరముల మూలమంత్రముతో హృదయము, శిరస్సు, శిఖ, వర్మ, అస్త్రము, నేత్రములు, ఉదరము, శరీరము వెనుకభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్లు, పాదములు అను ద్వాదశాంగములపై న్యాసము చేయవలెను. ముద్రనిచ్చి విష్ణువును స్మరించి, అష్టోత్తర శత జపము చేసి పూజింపవలెను.

జల కుంభమును ఎడమ వైపునను, పూజా ద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధ పుష్పాన్వితములైన అర్ఘ్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిః స్వరూపము అయిన చైతన్యములను “అస్త్రాయఫట్” అని అభి మంత్రించిన, ఉదరముచే యోగ బీజమునడిపి, హరిని ధ్యానించి, పూర్వాది యోగ పీఠమునందు ధర్మమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, అధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసర స్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములను ముందు తన హృదయమునందు ధ్యానము చేసి పిమ్మట మండలముపై ఆవాహనము చేసి అర్చించవలెను. వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, అలంకార, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములను సమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మంతుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమ వైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను. దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును, ఎడమవైపున డాలును ఉంచవలెను. కుడివైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను.

వనమాలను, శ్రీవత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతలను అందరిని వారివారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తియైన పిమ్మట అంగ దేవతలను వ్యస్త రూపమునను, సమస్త రూపమునను బీజాక్షర యుక్త మంత్రములతో పూజింపవలెను. జపించి, ప్రదక్షిణముచేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి “నేనే బ్రహ్మను. నేనే హరిని”అని ధ్యానముచేసి హృదయమునందు ఉంచుకొనవలెను. ఆవాహనము చేయునపుడు ‘అగచ్ఛ’ అనియు, ఉద్వాసనము చెప్పునపుడు ‘క్షమస్వ’ అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజచేసి ముక్తిని పొందును.

ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవవ్యూహార్చనమును వినుము. అంగుష్ట ద్వయము నందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యాసము చేయవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మధ్యయందు పూర్వాది దిక్ పూజ చేయవలెను. ఏకపీఠముపై, క్రమముగ, నవవ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తులను ఆవాహనము చేసి నవవ్యూహ పూజ వెనుకటివలెనే చేయవలెను. పద్మమధ్యమునందు వాటియందున్న దేవతలను, వాసుదేవుని పూజించవలెను. (23)