అగ్ని మహా పురాణము

Table of Contents

ఒక రోజు వ్రతములు

అగ్ని దేవుడు చెప్పెను:

ఇపుడు దివసములకు సంబంధించిన వ్రతములు చెప్పెదను. మొదట ధేను  వ్రతమును గూర్చి చెప్పెదను. సువర్ణ రాశితో కూడ ఉభయ ముఖ గోదానముచేసి ఒక దినమున పయోవ్రతము చేయువాడు పరమ పదమును పొందును. స్వర్ణమయ కల్ప వృక్ష దానముచేసి మూడు దినములు పయోవ్రతము చేయువాడు బ్రహ్మపదమును పొందును. దీనికి కల్ప వృక్ష వ్రతమని పేరు. పది ఫలములకంటె అధికమగు స్వర్ణముతో పృథివి నిర్మించి దానముచేసి రెండు దినములు పయోవ్రతము చేయవలెను. దినమునందు మాత్రము వ్రతమవలంబించువాడు రుద్రలోకమును చేరును. ప్రతిపక్షము నందును మూడు రాత్రులు ఏకభుక్త వ్రతము చేయువాడును, పగలు నిరాహారుడై త్రిరాత్ర వ్రతము చేయువాడును అధికమగు ధనము పొందును, ప్రతి మాసమునందును మూడు ఏకభుక్త నక్త వ్రతములు చేయువాడు గణపతి సాయుజ్యమును పొందును. జనార్దనుని ఉద్దేశించి త్రిరాత్ర వ్రతము ఆచరించువాడు తన నూరు కులములతో వైకుంఠము చేరును. మార్గశీర్ష శుక్ల నవమినుండి త్రిరాత్ర వ్రత ప్రారంభము చేయవలెను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును వేయి పర్యాయములు లేదా నూరు పర్యాయములు జపము చేయవలెను. అష్టమి నాడు ఏకభుక్త వ్రతము, నవమి, దశమి, ఏకాదశులందు ఉపవాసము చేయవలెను. ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఈ వ్రతము కార్తిక మాసమందు చేయవలెను. వ్రత సమాప్తియందు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి వస్త్ర, శయ్యా, ఆసన, ఛత్ర, యజ్ఞోపవీత, పాత్రలు దానము చేయవలెను. దాన సమయమున బ్రాహ్మణులతో ఇట్లు చెప్పవలెను. దుష్కరమగు ఈ వ్రతము నాచరించునపుడు నావలన కలిగిన లోపములు అన్నియు మీ అనుగ్రహముచే తొలగిపోవుగాక. ఈ త్రిరాత్ర వ్రతము చేయువాడు ఇహలోకమున భోగములు అనుభవించి మరణానంతరము శ్రీమహావిష్ణు సానిధ్యమును పొందును. ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు కార్తికవ్రతమును గూర్చి చెప్పెదను. దశమినాడు పంచగవ్య ప్రాశనచేసి ఏకాదశినాడు ఉపవాసము ఉండవలెను. ఈ వ్రతము నందు కార్తికశుక్ల ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించినవాడు విమానముపై సంచరించు దేవత అగును. చైత్రమున త్రిరాత్ర వ్రతము ఆచరించి, రాత్రి మాత్రము భోజనము చేయువాడు వ్రత సమాప్తియందు ఐదు మేకలు దానము చేసినచో సుఖవంతుడగును. కార్తిక శుక్ల షష్టి మొదలు మూడు దినములు పాలు మాత్రము త్రాగి తరువాత, మూడు దినములు ఉపవాసము చేసినచో దానికి మాహేంద్ర కృచ్ఛ్రమని పేరు. కార్తిక శుక్లైకాదశినాడు ప్రారంభించి పాంచరాత్ర వ్రతము చేయవలెను. మొదటి దినమున క్షీరము, రెండవ దినమున పెరుగు తీసికొని మూడవ దినము నుండి మూడు నాళ్ళు ఉపవాసము చేయవలెను. ఇది ‘భాస్కర కృచ్ఛ్రము’ శుక్ల పంచమి నుండి ప్రారంభించి ఆరు దినములు వరుసగయవల గంజి, శాకములు, పెరుగు, క్షీరము, నెయ్యి, జలము, ఆహారముగా గ్రహించవలెను. దీనికి ‘సాంతపన కృచ్ఛ్రము’ అని పేరు. (197)