అగ్ని మహా పురాణము

Table of Contents

వ్రతపరిభాష

అగ్ని దేవుడు పలికెను:

వసిష్ఠా! తిథి, వారము, నక్షత్రము, దివసము, మాసము, ఋతువు, సంవత్సరము, సూర్య సంక్రమణము-వీటి యందు పురుషులు స్త్రీలు ఆచరించదగిన వ్రతములను క్రమముగా చెప్పెదను వినుము. శాస్త్రములలో చెప్పిన నియమమే ‘వ్రతము’. అదియే తపస్సు. దమము మొదలగునవి వ్రతమునకే విశిష్టమైన నియమములు. కర్తను తపింప చేయుటచే వ్రతమే ‘తపస్సు’ అని చెప్పబడును. ఇంద్రియ సముదాయమును వశములో ఉంచుకొనుట నియమము. అగ్నిరహితులగు విప్రులకు ఇది శ్రేయస్కరమని చెప్పబడినది. వ్రతోపవాస నియమములచేతను, నానా విధములగు దానముల చేతను దేవాదులు సంతసించినవారై భుక్తి ముక్తులను ప్రసాదింతురు. పాపములనుండి మరలినవాడై గుణములతో నివసించుటయే సకల భోగములు విడనాడిన ఉపవాసము. ఉపవాసము చేయువాడు కంచుపాత్రలు, మాంసము, మసూరము (చిరుశనగలు), శనగ, కొఱ్ఱలు, శాకము, మధువు, పరాన్నము, స్త్రీ-వీటిని విడువవలెను. ఉపవాస సమయమున పుష్పాలంకార వస్త్రములు, ధూప గంధాను లేపనములు, దంతష్టముతో దంతధావనము, అంజనము-ఇవి నిషిద్ధములు. ప్రాతః కాలమునందే పంచగవ్యముచేసి వ్రతము ప్రారంభింపవలెను. మాటి మాటికి నీరు త్రాగినను, తాంబూలము భక్షించినను, పగలు నిద్రించినను, మైథునము చేసినను ఉపవాసము చెడిపోవును. ఓర్పు, సత్యము, దయ, దానము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, దేవపూజ, అగ్ని హరణము, సంతోషము, అస్తేయము ఈ పదియు సర్వవ్రతములందును అనుసరించవలసిన సామాన్య ధర్మములు. పవిత్ర మంత్రములను జపించవలెను. యథాశక్తిగా హోమము చేయవలెను. నిత్య స్నానము చేయుచు, మితముగా భుజించుచు, గురు, దేవ, బ్రాహ్మణులను పూజించుచు, క్షారము, తేనె, లవణము మధువు, మాంసము విడువవలెను. తిలలు, పెసలు, తప్ప మిగిలిన పప్పుదినుసులు, సస్యములతో గోధుమలు, కొఱ్ఱలు, చీనకము, దేవధాన్యము, శమీధాన్యము, చెరకు నుండి తయారైనవి, శితధాన్యము, పణ్యము, మూలము ఇవి క్షారగణమునకు చెందినవి గాన త్యాజ్యములు. షష్టికవ్రీహి, పెసలు, కలాయములు, తిలలు, యవలు, శ్యామాకములు, గోధూమాదులు, వ్రతము నందు హితమైనవి. గుమ్మడి, ఆనపకాయ, వంకాయ, పాలంకి, పూతిక త్యజించవలెను. వ్రతమునందును, నక్తాదులందును, అగ్ని కార్యములందును, భిక్షా లబ్ధమగు చరువు, సక్తు కణములు, శాకము, పెరుగు, నెయ్యి, పాలు, శ్యామాక, శాలి, నీవారములు, యవలు, మూల తండులములు, హవిష్యములు, హితములు లేదా వ్రతమునందు మధుమాంసములు తప్ప మిగిలిన వన్నియు హితములే.

ప్రాజాపత్యము నాచరించు ద్విజుడు మూడు దినములు ప్రాతః కాలము, మూడు దినములు సాయంకాలము అయాచితాహారము భుజింపవలెను. పిదప మూడుదినములు ఏమియు తినగూడదు. అతి కృచ్ఛ్రము చేయు ద్విజుడు వెనుక చెప్పినట్లుగనే మూడు దివసములు ఒక్కొక్క గ్రాసమును తినవలెను. చివర మూడు దివసములు ఉపవాసము చేయవలెను. గోమూత్రము, గోమయము, క్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము భుజించుట ఒకరాత్రి ఉపవాసము-ఇది కృచ్ఛ్ర సాంతపనము. సాంతపనమునకు చెప్పిన ద్రవ్యములు వేరువేరుగా ఒక్కొక్కరోజు చొప్పున ఆరురోజులు భుజించి ఏడవరోజున ఉపవాసము చేసినచో ఇది పాపములను నశింపచేయు మహాసాంతపనము. పండ్రెండు రోజులు ఉపవాసము చేసినచో అది సర్వపాపములను తొలగించు పరాకము. ఇదే మూడు రెట్లు చేసినచో ‘మహాపరాకము’. పూర్ణిమనాడు పదునైదు గ్రాసములు భుజించి పిదప ప్రతిదినము ఒక్కొక్క గ్రాసము తగ్గించుచు అమావాస్యనాడు ఉపవాసము చేయవలెను. పిదప ప్రతిపత్తున ఒక గ్రాసము తినుటతో ప్రారంభించి ప్రతి దినము ఒక్కొక్క గ్రాసమును పెంచుతూ తినవలెను. ఇది ‘చాంద్రాయణము. ఈ వ్రతము పైన చెప్పిన క్రమమునకు విపరీతముగా కూడ చేయవచ్చును, ఒక పలము కపిల గోమూత్రము, అర్ధాంగుష్ఠ ప్రమాణమగు గోమయము, ఏడు పలముల క్షీరము, రెండు పలముల పెరుగు, ఒక పలము ఘృతము, కుశోదకము ఒక పలము-వీటిలో గోమూత్రమును గాయత్రీ మంత్రముచేతను, గోమయమును ‘గంధధ్వారా’ ఇత్యాది మంత్రము చేతను, క్షీరమును ‘ఆప్యాయస్వ’ ఇత్యాది మంత్రము చేతను, పెరుగును ‘దధిక్రావ్ణః’ అను మంత్రముచేతను, ఆజ్యమును ‘తేజోఽసి’ ఇత్యాది మంత్రముచేతను, కుశోదకమును ‘దేవస్య’ ఇత్యాది మంత్రము చేతను ఈ విధముగ గ్రహించినచో అది ‘బ్రహ్మ కూర్చము’ అఘమర్షణ సూక్తముతో గాని, ప్రణవముతో గాని చేర్చి ‘ఆపో హిష్ఠామ’ ఇత్యాది మంత్రమును జపించవలెను. ఈ విధముగా త్రాగి పిదప ఉపవాసము ఉన్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణు లోకము చేరగల్గును. పగలు ఉపవాస ముండి సాయంకాలము భుజించువాడును, దివసము ఎనిమిది భాగములలో కేవలము ఆరవ భాగమునందు మాత్రము భుజించు సన్యాసియు, అశ్వమేధయాజియు, సత్యము పలుకువాడును స్వర్గమునకు వెళ్లును. అగ్న్యాధానము, ప్రతిష్ఠ యజ్ఞము, దానము, వ్రతము, దేవవ్రతము, వృషోత్సర్గము, చూడా కరణము, మేఖలా బంధము, వివాహము మొదలగు మంగళకార్యములను, అభిషేకము మల మాసములో చేయగూడదు.

అమావాస్య నుండి అమావాస్యకు ‘చాంద్ర మాసము’ ముప్పది దినములు ‘సావన మాసము’. సంక్రాంతి నుండి సంక్రాంతికి ‘సౌర మాసము’, అన్ని నక్షత్రములును ఒక పర్యాయము తిరిగి వచ్చినచో నక్షత్ర మాసము. వివాహాదులకు సౌరమాసము, యజ్ఞాదులకు సావన మాసము, శ్రాద్ధాది పితృ కార్యములకు చాంద్రమాసము ఉత్తమమైనవి. ఆషాఢ పూర్ణిమ తరువాత వచ్చు ఐదవ పక్షమునందు పితరులకు తప్పక శ్రాద్ధము చేయవలెను. అప్పటికి సూర్యుడు కన్యారాశీ చేరినాడా లేదా అను విచారము అనావశ్యకము. మాసిక-వార్షిక వ్రతములకు ఏదైన ఒక తిథి దినద్వయ వ్యాప్తమైనచో రెండవ దినము నందలి తిథి ఉత్తమమైనది. మొదటిది మలినము. నక్షత్ర వ్రతము నందు, సూర్యుడు ఏ నక్షత్రమునందు అస్తమించునో ఆ నక్షత్రమునందే ఉపవాసము చేయవలెను. దివస వ్రతములకు దినవ్యాపి తిథులును, నక్త వ్రతములకు రాత్రి వ్యాపి తిథులును పుణ్యప్రదములు, శుభకరములు. ద్వితీయతో, తృతీయ, చతుర్దశితో పూర్ణిమ, అమావాస్యతో ప్రతిపత్తు కలియుట మంచిది. ఇది గొప్పఫలము నిచ్చును. ఇందుకు విపరీతమగు కలయిక ప్రతి పత్తుతో ద్వితీయ ఇత్యాది విధమున భయానకము. పూర్వము చేసిన పుణ్యములను గూడ నశింపజేయును. రాజు, మంత్రి, వ్రతమధ్యము నందున్నవాడు-వీరికి వివాహము, ఉపద్రవాదులు, దుర్గమ స్థానము, సంకట సమయము యుద్ధము-వీటి యందు తత్కాలశుద్ధి చెప్పబడినది. దీర్ఘకాలిక వ్రతము నారంభించిన స్త్రీ మధ్యలో రజస్వలయైనను వ్రతభంగముకాదు. గర్భవతి, ప్రసవగృహము నందున్న స్త్రీ, రజస్వలయగు కన్యశుద్ధులై వ్రతము చేయుటకు అయోగ్యులుగా ఉన్నపుడు ఆ శుభకార్యమును ఇతరులచే చేయించవలెను. క్రోధముచేతగాని, పొరబాటుచేతగాని, లోభముచేతగాని వ్రత భంగమైనచో మూడు దినములు ఉపవాసము ఉండవలెను. లేదా శిరోముండనము చేయించుకొనవలెను. స్వయముగా వ్రతము నాచరించుటకు సామర్థ్యము లేనిచో భార్యచేత గాని, పుత్రునిచేత గాని చేయించవలెను. ప్రారంభించిన వ్రతమును జననాశౌచ, మరణాశౌచములందు కూడ నడిపింప వలెను; పూజాకార్యము మాత్రము చేయగూడదు. వ్రతము నవలంబించిన వాడు ఉపవాసము చేయుటచే మూర్ఛితుడైనచో గురువు ఆతనిని పాలుత్రాగించి గాని, మరియేదైన ఉపాయముచేత గాని మరల స్పృహలోనికి వచ్చునట్లు చేయవలెను. జలము, ఫలము, మూలము, పాలు, హవిష్యము (నెయ్యి) బ్రాహ్మణేచ్ఛా పూర్తి, గురు వచనము, ఔషధము-ఇవి వ్రత భంగకరములు కావు (వ్రతము చేయువాడు ఆ దేవతను ఈ విధముగా ప్రార్థించవలెను); ‘వ్రతపతే! కీర్తి, సంతాన, విద్యాదుల కొరకును, సౌభాగ్య, ఆరోగ్య, అభివృద్ధి, నిర్మలతా, భోగ, మోక్షముల కొరకును నేను ఈ వ్రతము నాచరించుచున్నాను. ఈ శ్రేష్ఠ వ్రతమును నీ ఎదుటనే గ్రహించినాను, జగత్పతీ! నీ అనుగ్రహముచే ఇది నిర్విఘ్నముగ కొనసాగు గాక. ఓ వ్రత పాలకా! ఈ వ్రతమును గ్రహించిన తరువాత ఇది పూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ అనుగ్రహముచే ఇది పూర్ణమగు గాక!

కేశవా! వ్రత స్వరూపుడవును, జగత్కారణ భూతుడవును అగు నిన్ను సర్వసిద్ధి నిమిత్తమై మండలములపై ఆవాహనము చేయుచున్నాను. నీకు నమస్కారము. సన్నిహితుడవై ఉండుము. మనస్సుచే కల్పితములగు పంచగవ్యములతోను, శుభములైన జలముల తోడను. పంచామృతముల తోడను భక్తి పూర్వకముగ అభిషేకము చేయుచున్నాను. నీవు నా పాపములను తొలగించుము. ఓ! అర్ఘ్యపతీ! గంధపుష్ప-ఉదయుక్తమగు శుభమైన అర్ఘ్యమును స్వీకరించి నన్ను సర్వదా అర్ఘ్య యోగ్యునిగా చేయుము. ఓ! వస్త్రపతీ! పుణ్యమైన వస్త్రములను గ్రహింపుము. ఓ వ్రత సత్పతీ! నన్ను భూషణ సువస్త్రాదులచే ఆచ్ఛాదింపబడిన వానినిగా చేయుము. ఓ గంధమూర్తీ! విమలమైన సుగంధియగు గంధమును స్వీకరింపుము. నన్ను పాప గంధవిహీనునిగాను మంచి గంధము కలవానినిగాను చేయుము. పుష్పమును గ్రహింపుము. నన్ను పుష్ప పూర్ణునిగాను, పుష్పగంధముగల వానినిగాను, ఆయురారోగ్య వృద్ధి కొరకై చాల విమలునిగాను చేయుము. దశాంగములు గలదియు గుగ్గులు ఘృతయుక్తమునగు ధూపమును గ్రహింపుము. ధూపితుడవై ఓ సత్పతీ! నన్ను ధూప ధూపితునిగా చేయుము, ఊర్ధ్వ శిఖగలదియు సర్వమును ప్రకాశింపచేయునదియు అగు దీపించుచున్న దీపమును గ్రహింపుము. ఓ! దీపమూర్తీ! నన్ను సర్వదా ప్రకాశముతో నిండిన వానినిగాను, ఊర్ధ్వ గమనము కలవానినిగాను చేయుము. అన్నాదులకు ప్రభువైన వాడా! అన్నాదికమగు నైవేద్యమును స్వీకరింపుము. నన్ను అన్నాదులతో పూర్ణునిగాను అన్నదానము చేయువానిని గాను, సర్వదాతగాను చేయుము. ఓ! ప్రభూ! వ్రతపతీ! మంత్ర హీనముగా గాని, క్రియా హీనముగా గాని, భక్తి హీనముగాగాని నేను చేసిన పూజ పరిపూర్ణము అగుగాక. నాకు ధర్మమును ఇమ్ము. ధనమును సౌభాగ్యమును, గుణ సముదాయమును, కీర్తిని, విద్యను, ఆయుర్దాయమును, స్వర్గమును, మోక్షమును ఇమ్ము. ఓ! వ్రతపతీ! ఈ పూజను స్వీకరించి పునరాగమనార్థమును వరములను ఇచ్చుటకును ఇపుడు వెళ్ళుము. అన్ని వ్రతములందును వ్రతధారి యగువాడు భూమిపై శయనించుచు సువర్ణ మయములగు ఆ వ్రత మూర్తులను యథాశక్తిగా పూజించవలెను. వ్రతాంతమునందు జపము హోమము దానము ఇవి సామాన్య కర్తవ్యములు. పూజ్యులగు విప్రులకు ఇరువది నలుగురికి గాని, పండ్రెండుగురికి గాని, ఐదుగురికి గాని, ఒకరికి గాని భోజనము పెట్టవలెను. శక్త్యానుసారము దక్షిణలుగా వారికి వేరువేరుగా గోవులను, సువర్ణాదులను, జల పాత్రమును, అన్న పాత్రమును, మృత్తికను, ఛత్రమును, ఆసనమును, శయ్యను, వస్త్రయుగమును, కుంభములను ఇవ్వవలెను. ఇట్లు వ్రతపరిభాష చెప్పబడినది. (175)