అగ్ని మహా పురాణము
గవాయుర్వేద కథనము
ధన్వంతరి చెప్పెను:
రాజు గోవులను బ్రాహ్మణులను పాలించవలెను. ఇప్పుడు గోశాంతిని చెప్పెదను. గోవులు పవిత్రమైనవి, మంగళప్రదమైనవి. లోకములన్నియు గోవులలో ప్రతిష్ఠితములై ఉన్నవి. గోమయము, గోమూత్రము, అలక్ష్మీ నాశకములు. వాటి శరీరమును గోకుట, కొమ్ముల మర్ధించుట, నీళ్ళు త్రాగించుట ఇవి కూడ అలక్ష్మీ నివారకములు. గోమూత్రము గోమయము, క్షీరము, దధి, ఘృతము, గోరోచన-ఇవి ఆరును సేవించుటకు ఉత్తమమైనవి. దుస్స్వప్నాదులను తొలగించును. గోరోచన విషమును రాక్షసులను నశింపచేయును. గోవునకు గ్రాసమిచ్చు వాడు స్వర్గమును పొందును. ఎవని యింటిలో గోవులు దుఃఖించు చుండునో, ఆతడు నరకమునకు పోవును. ఇతరుల గోవుకు గ్రాసము నిచ్చువాడు స్వర్గమును పొందును. గోహితము కోరువాడు బ్రహ్మ లోకమును పొందును. గోదానము, గోమాహాత్మ్య కీర్తనము, గోరక్షణము చేసిన వాడు తన కులమును ఉద్దరించును. గోవుల శ్వాస తగిలి భూమి పవిత్రమగును. వాటి స్పర్శచే పాపములు నశించును. ఒక దినమున గోమూత్ర గోమయ, క్షీర, దధి, ఘృత, కుశోదకములను, ఉపవాసము చేసినచో చండాలుడు కూడ పరిశుద్దుడగును. పూర్వము దేవతలు కూడ అశుభములు అన్నింటిని తొలగించుకొనుటకు ఈ విధముగ చేసిరి. పైన వస్తువులను వేరువేరుగా మూడేసి రోజులు భక్షించినచో దానికి ‘మహాసాంతపన వ్రతముయని పేరు. ఇది సర్వకామములను సిద్ధింపచేసి పాపములను తొలగిం చును. పాలు మాత్రము త్రాగి ఇరువది యొక్క దినములు ఉన్నచో అది కృచ్ఛవ్రతము. దీనినా చరించిన నరోత్తములు పాపరహితులై సర్వకామములను పొంది స్వర్గమునకు పోవుదురు. మూడు దినములు ఉష్ణ గోమూత్రమును, మూడు దినములు ఉష్ణ ఘృతమును, మూడు దినములు ఉష్ణ క్షీరమును, పిదప మూడు దినములు వాయువును మాత్రము భక్షించుటకు తప్త కృఛ్చ్ర వ్రతమని పేరు. ఇది సమస్త పాపములను తొలగించి బ్రహ్మ లోకమును ఇచ్చును. ఈ వస్తువులను చల్లగా చేసి, భుజించినచో దానికి శీతకృచ్ఛమని పేరు. బ్రహ్మ చెప్పిన ఈ వ్రతము బ్రహ్మలోక ప్రదము.
ఒక మాసము గోమూత్రముతో స్నానము చేయుచు గోరసముపై జీవించుచు, గోవులను అనుసరించుచు, అవి భుజించిన పిమ్మట భుజించవలయును. ఇట్లు గోవ్రతము చేసినవాడు పాపరహితుడై గో లోకమును చేరును. గోమతీ విద్యా జపముచేత కూడ గోలోకము లభించును. ఆ లోకమునందు మానవుడు విమానమున అప్సరసలతో కలసి నృత్య గీతములతో సేవింపబడుచు ఆనందించును. గోవులు సురభి స్వరూపములు. గుగ్గులు గంధము కలవి. అవి సమస్త ప్రాణులకు ఆధారభూతములు, పరమ మంగళమయములు, గోవులే శ్రేష్టమైన అన్నముగను ఉత్తమ హవిస్సుగను దేవతలకు ఉపకరించును. అవి సకల ప్రాణులను పవిత్రింపచేయు మూత్ర క్షీరాదికమును గ్రహించి వాటిని స్రవించుచుండును. మంత్రపూతమగు హవిస్సుతో స్వర్గమునందున్న దేవతలను తృప్తిపర చును. ఋషులు తమ అగ్ని హోత్రములందు గోవులను హోమమునందు ఉపయోగింతురు. సమస్త భూతములకును గోవులు ఉత్తమశరణము. గోవులు చాల పవిత్రమైనవి, మంగళకరమైనవి. స్వర్గ సోపానములు, ధన్యములు, సనాతనములు. సురభి కుమార్తెలగు లక్ష్మీ ప్రదములైన గోవులకు నమస్కారము. బ్రహ్మ సుతులకు నమస్కారము. ఒకే కులము బ్రాహ్మణులు, గోవులు యని రెండు విధములుగా చేయబడినది. ఒక దాని యందు మంత్రములు, మరియొక దాని యందు హవిస్సు ఆధారపడి ఉన్నవి. ఈ జగత్తంతయు దేవ, బ్రాహ్మణ, గోసాదు, పతివ్రతలపై నిలిచి యున్నది. అందుచే వారందరును పూజ్యతములు. గోవులు నీరుత్రాగు స్థానము తీర్థము. గంగాది నదులు గో స్వరూపములు. గోమాహాత్మ్యమును చెప్పితిని. ఇప్పుడు వాటి చికిత్సను వినుము.
కొమ్ములకు రోగము వచ్చునపుడు శృంగవేరబలా మాంసి, కల్కముతో సిద్ధము చేయబడిన సైంధవము చేర్చిన తైలమును తేనె కలిపి ఉపయోగించవలయును. కర్ణ రోగమునందు మంజిష్టా హింగు, సైంధవములతో సిద్ధమగు తైలమును ఉపయోగించవలయును లేదా వెల్లుల్లి వేసి కాచిన తైలము ఉపయోగించవలయును. దంతశూలము నందు బిల్వమూల అపామార్గ ధాతకీ, పాటల, కుటజముల లేపము చేయవలయును. ఇవి దంతశూలమును పోగొట్టును. దంతశూలమును హరించు ద్రవ్యములను ఘృతము నందు ఉడికించి ఇచ్చినచో ముఖ రోగమును తొలగించును. జిహ్వారోగములందు సైంధవము ప్రశస్తముగల గ్రహ రోగమున శుంఠి ద్వివిధ హరిద్ర, త్రిఫల, మంచిది. హృద్రోగవస్తిరోగ, పాతరోగ, క్షయరోగములందు, గోవులకు ఘృతమిశ్ర త్రిఫలాను పానము ప్రశస్తము. అతిసారమున ద్వివిధ హరిద్ర పాఠ ఇవ్వవలెను. అన్ని విధముల కోష్ట రోగములందును, ఇతరావయవ రోగములందును కాసశ్వాసాది సాధారణ రోగములందును, శుంఠి బారంగీలను ఇవ్వవలెను. విరిగిన ఎముక అతుకుటకు లవణ యుక్తమగు ప్రియంగువును పూయవలయును. తైలము వాతరోగము హరించు పిత్త రోగమున తైలపక్వమగు మధు యష్టిని, కఫరోగమున మధు సహిత యోషమును, రక్తవికారమున దృఢమైన నఖ మూల భస్మము హితకరములు. భగ్న క్షతమునందు తైల ఘృతములందు వేయించిన హరితాళము ఇవ్వవలెను. మాషములు తిలలు, గోధుమలు, పాలు, ఘృతము, వీటిని లవణము కలిపి పిండముగా చేసి, లేగదూడలకు ఇచ్చినచో, పుష్టికలుగును. విషాణి బలప్రదము, గ్రహబాధ నివృత్తికి ధూపమును ప్రయోగించవలయును. గ్రహజనిత రోగ నివృత్తికి, దేవదారు వచా, మాంసీ, గుగ్గులు, హింగు, సర్షపముల ధూపము హితకరము. ఈ ధూపమువేసిన ఘంట గోవుల కంఠమునందు కట్టవలయును. అశ్వగంధ తిలలతో నవనీత భక్షణము చేయించుటచే ఆవు పాలను ఇచ్చును. ఇంటిలో మదమత్తమగు వృషభమునకు తెలకపిండి ఉత్తమమైన రసాయనము.
శాంతికొఱకై పంచమినాడు గోపురీషముపై లక్ష్మిని వాసుదేవుని గంధాదులతో పూజించవలయును. దీనికి అపరాశాంతియని పేరు. ఆశ్వీయుజ, శుక్ల పూర్ణిమనాడు శ్రీహరిని పూజించ వలయును. హరి రుద్ర బ్రహ్మ సూర్య అగ్ని లక్ష్ములను ఘృతముతో పూజించ వలయును. దధితిని గోవులను పూజించి అగ్ని ప్రదక్షిణము చేయవలయును. గృహ బహిర్భాగమున గీతవాద్య ధ్వనులతో వృషభ యుద్ధమును ఏర్పరచవలయును.
గోవులకు లవణమును బ్రాహ్మణులకు దక్షిణలను ఇవ్వవలెను. మకర సంక్రాంత్యాది పర్వములందు లక్ష్మీసహితుడగు శ్రీమహావిష్ణువును స్థండిలముపై నిర్మించిన పద్మ మధ్యమున పూజించ వలయును. దిక్కులందు కమల కేసరములపై దేవతలను పూజించవలయును. కమల బహిర్భాగమున మంగళమయులగు బ్రహ్మ, సూర్య, బహురూప, బలిఆకాశ, విశ్వరూపులను రుద్ధసిద్ధిశాంతి, రోహిణ్యాది దిగ్గేనువులను చంద్రశివులను, పులగముతో పూజించ వలయును. కలశస్థ పద్మ పత్రములపై దిక్పాలురను పూజించవలయును.
అగ్నియందు సర్షప, అక్షత, తండుల, క్షీరవృక్ష సమిధలను హోమముచేసి బ్రాహ్మణులకు నూరేసి సువర్ణములను కంచు మొదలగు దానిని దానము చేయవలయును. పిదప క్షీరాదులతో గూడిన గోవులను పూజించి శాంతి నిమిత్తమై వాటిని విడువవలయును. అగ్నిదేవుడు పలికెను. శాలిహోత్రుడు సుశ్రుతునకు అశ్వ ఆయుర్వేదమును పాలకాప్యుడు అంగరాజునకు గజాయుర్వేదమును ఉపదేశించెను. (292)
