అగ్ని మహా పురాణము

Table of Contents

కావ్యదోష వివేక వర్ణనము

అగ్నిదేవుడు పలికెను:

దోషము సభ్యులకు ఉద్వేగమును కల్గించును. వక్తృ-వాచక-వాచ్యములలో ఏక, ద్వితి, యోగముచే ఇది ఏడు విధములు. వక్త అనగా కవి. సందిహానులు, అవినీతుడు, అజ్ఞుడు, జ్ఞాత అని వక్త నాలుగు విధములు. నిమిత్తమును సంకేతమును అనుసరించి అర్థమును బోధించు శబ్దము వాచకము; పదము వాక్యము అను దీని రెండు భేదములు వెనుకచెప్పబడినవి. అసాధుత్వము, అప్రయుక్తత్వము అని పదదోషములు రెండు; వ్యాకరణ శాస్త్రమునకు విరుద్ధముగ నుండుట అసాధుత్వము. అప్రసిద్ధమగు పదమును ప్రయోగించుట అప్రయుక్తత్వము. ఛాందసత్వము, అవిస్పష్టత్వము, కష్టత్వము, అసామయికత్వము, గ్రామ్యత్వము అని అది ఐదు విధములు. లోకములో ప్రయోగించని వైదిక పదములు ప్రయోగించుట ఛాందసత్వము. అర్థము స్పష్టము కాకుండుట అవి స్పష్టత్వము. దీనిలో గూఢార్థత్వము, విపర్యసార్థత్వము, సంశయితార్థత్వము యని మూడు భేదములు. అర్థము శ్రమచే తెలిసినచో అది గూఢార్థత్వము. వివక్షితార్థమునకు విపరీతమగు అర్థమును బోధించుట విపర్యసార్థత్వము. అన్యార్థత్వము, అసమర్థత్వము అను దోషములు కూడ విపర్యస్తార్థత్వములో అంతర్గతమగును. అర్థము సందిగ్ధముగా ఉన్నచో అది సంశయితార్థత్వము. ఇది సహృదయులకు ఉద్వేగకరము కానిచో దోషముకాదు. ఉచ్చారణకు కష్టముగా ఉండుట కష్టత్వము. కవిసమయ విరుద్ధత్వము అసామయికత్వము. దీనికి నేయ అనికూడ పేరు. నీచార్థమును బోధించుట గ్రామ్యతా దోషము. నింద్యమగు గ్రామ్యార్థమును చెప్పుట, తత్స్మరణ, తద్వాచక పద సామ్యము ఇవి గ్రామ్యతా దోషములో మూడు భేదములు. సాధారణముగ ప్రాతిస్వికము, అర్థదోషము, అని రెండు విధములు. అనేక గత దోషము సాధారణము. క్రియాభ్రంశము, కారకభ్రంశము, విసంధి, పునరుక్తత, వ్యస్తసంబంధత అని ఇది ఐదు విధములు. క్రియ లేకపోవుట క్రియ భ్రంశము. కర్తాది కారకములు లేకుండుట కారక భ్రంశము. సంధి దోషము విసంధి.

సంధ్య భావము విరుద్ద సంధి అని విసంధి రెండు విధములు. విరుద్ధములగు పదార్థాంతరమును బోధించుటచే విరుద్ధ సంధి దుష్టమైనది. మాటిమాటికి చెప్పుట పునరుక్తత్వము, అర్థావృత్తి పదావృత్తి అని అది రెండు విధములు. అర్థావృత్తి రెండు విధములు. కావ్య ప్రయుక్తమగు శబ్దముచేతను, శబ్దాంతరము చేతను ఏర్పడు పదావృత్తిచే అర్థావృత్తి కలుగదు. పదమాత్రమునకే ఆ వృత్తి ఏర్పడును. దూరముగ ఉన్న పదముల అన్వయము వ్యస్త సంబంధత. సంబంధాంతర ప్రతీతి, సంబంధాంతర జన్యత్వము ఏతదుభయ అభావము వీటిచే వ్యక్తసంబంధిత్వమునకు మూడు భేదములుండును. పై మూడింటియందును పద వ్యవధాన వాక్య వ్యవధానములచే మూడేసి భేదములు ఏర్పడును. పదవాక్యములందు అర్థ అర్థ్యమాన భేదముచే వాచ్యార్థము రెండు విధములగును. వ్యుత్పాదితము వ్యుత్పాద్యముయని పద వాచ్యార్థము రెండు విధములు, హేతువు అభీష్టసిద్ధికి వ్యాఘాతము అయినచో అది దుష్టము, అసమర్థత్వ-అసిద్ధిత్వ-విరుద్ధత్వ-అనైకాంతికతా-సత్ప్రతిపక్షత్వ కాలాతీతత్వ-సంకర-పక్షాభావ-సపక్షాభావ విపక్షాస్థిత్వ-నిరర్థత్వములు పండ్రెండు హేతు దోషములు. ఇష్టవ్యాఘాత కారిత్వదోషము సహృదయులకును సభాసదులకును మార్మిక పీడ కల్గించును. దుష్కరములగు చిత్రబంధాది కావ్యములలో నిరర్థత్వము దోషముకాదు. గూఢార్థత్వము కూడ దోషము కాదు. లోక, శాస్త్రములందు ప్రసిద్ధమైనచో గ్రామ్యత్వము దోషము కాదు. క్రియను అధ్యాహారమును చేసుకొనుటకు అవకాశము ఉన్నచో క్రియాభ్రంశము; కారకమును ఆధ్యాహారము చేసుకొనుటకు వీలున్నచో కారక భ్రంశము దోషములు కావు-ప్రగృహ్య సంజ్ఞను బట్టి ప్రకృతిభావము వచ్చినచోట విసంధిత్వము దోషముకాదు. సంధి చేసినచో ఉచ్చరించుట కష్టమైనపుడు విసంధిత్వము దోషముకాదు.

అనుప్రాసలో పదావృత్తి ఉన్నపుడు వ్యస్త సంబంధత్వము దోషముకాదు. అర్థ సంగ్రహమున అర్థావృత్తి దోషము కాదు. కాని వ్యుత్క్రమాదులు మాత్రము దోషము. ఉపమానోపమేయముల విభక్తి, సంజ్ఞా, లింగ, వచనములలో భేదమున్నను బుద్ధిమంతులకు ఉద్వేగము కలుగనంతవరకు అవి దోషములు కావు. ఉద్వేగమును కల్గించని దోషములు దోషకరములు కావు. అనేక వస్తువులకు ఒక వస్తువుతోను, అనేక వస్తువులకు అనేక వస్తువులతోను ఔపమ్యము చెప్పినను దోషములేదు. కవిజన పరంపరా అంగీకృతమగు సదాచారమునకు సమయమని పేరు. దానిని సకల సిద్ధాంత వాదులను నిస్సంశయముగా అనుసరింతురు. కొన్ని సమయములను కొంతమందియే అనుసరింతురు. ఈ విధముగా సమయములు రెండు విధములు; ఏదైనా ఒక సిద్ధాంతమును అనురించుటచేతను భ్రాంతిచేతను ఈ మత భేదము ఏర్పడును. కొంతమంది మునుల సిద్ధాంతమునకు తర్కము ఆధారము; కొంతమందికి క్షణభంగవాదము ఆధారము; పంచభూత సంఘాతముచే శరీరమున చైతన్యము వచ్చునని కొందరందురు. స్వతః ప్రకాశమగు జ్ఞానమే చైతన్యమని కొందరు అందురు. కొందరు, ప్రజ్ఞాత స్థూలతావాదులు కొందరు శబ్దానేకాంతతావాదులు ఈ జగత్తుకు బ్రహ్మ కారణమని, శైవ, వైష్ణవ, శాక్త, సౌర సిద్ధాంతవాదులు అంగీకరింతురు. కాని సాంఖ్యులు దృశ్య జగత్తునకు ప్రధానమే కారణమని చెప్పుదురు. ఈ విధముగా సరస్వతీ లోకమున సంచరించు విచారకులు పరస్పర విపర్యస్త దృష్టితో చూచుచు యుక్తులతో పరస్పర ఖండనము చేసుకొనుచున్నారు. వీరు చెప్పు విభిన్న మార్గములు విశిష్టసమయము. అసత్తునే గ్రహించుట, సత్తును పరిత్యజించుట, దీనిచే ఈ విశిష్ట సమయము రెండు విధములు. ప్రత్యక్షాది ప్రమాణములచే బాధితమైనది అసత్తు. దేనియందు జ్ఞాన ప్రకాశముండునో ఆ మతమునే కవులు గ్రహించవలెను. ఏది అర్థక్రియాకారియో అదియే పరమార్థసత్; అజ్ఞాన జ్ఞానాతీతమై ఉన్న ఏక మాత్ర బ్రహ్మయే పరమార్థ సత్. అది జ్ఞేయము. అదియే సృష్టిపాలన సంహారహేతువగు విష్ణువు. అదియే శబ్ద అలంకార రూపము. అదియే పరాపర విద్యలు. దానిని తెలిసినవాడే సంసార బంధ ముక్తుడగును. (347)