అగ్ని మహా పురాణము
గ్రహ మంత్రాదికములు-ఉపసంహరణ
అగ్నిదేవుడు పలికెను:
ఇపుడు గ్రహోపహార మంత్రాదులను చెప్పెదను. ఇవి గ్రహ శాంతినిచ్చును. హర్ష ఇచ్చా భయశోకాదుల చేతను, ప్రకృతి విరుద్దము అపవిత్రమైన ఆహారము భుజించుట చేతను, గురు గ్రహాది కోపముచేతను మానవునకు ఐదు విధములగు ఉన్మాదములు కలుగును. వాటికి త్రిదోషజములు, సన్నిపాతజములు, ఆగంతుకములు అని పేర్లు, రుద్రుని క్రోధముచే అనేక విధములగు దేవాది గ్రహములు కలుగును. ఈ గ్రహములు నదులు, చెరువులు, తటాకములు, శైలములు, ఉపవనములు, సేతువులు, నదీ సంగమము, శూన్య గృహము, బిలద్వారము, ఏకైక వృక్షము, వీటి యందుండి అక్కడికి వెళ్ళిన వారిని ఆవహించును. నిద్రపోవుచున్న గర్భిణి స్త్రీని, ఆసన్న ఋతుకాలయగు స్త్రీని, ఋతు స్నానము చేయుచున్న స్త్రీని కూడ ఆవహించును. ఇవి మానవులకు అవమానము, వైరము, విఘ్నము, భాగ్య విపర్యయము మొదలగునవి చేయించును. దేవతా గురుధర్మాది సదాచారాదులను ఉల్లంఘించిన వారిని పర్వత వృక్షాదులనుండి పడినవారిని మాటి మాటికి జుట్టు దుల్పుకొనువానిని, కండ్లు ఎర్రగా చేసి ఏడ్చుచు గంతులు వేయుచున్న వానిని ఈ లక్షణములను బట్టి రూప అనుగ్రహ విశేషముచే పీడితుడైనట్లు గ్రహించవలెను. ఉద్వేగయుక్తుడై దాహ శూల పీడితుడై ఆకలి దప్పులతో బాధపడుచు శిరోరోగముతో బాధపడుచు నాకు ఇమ్ము, నాకు ఇమ్ము అని యాచన చేయువాడు బలికామి అను గ్రహి ఆవహించినట్లు తెలుసుకొనవలెను. ఆకాశ వ్యాపియైన మహా సుదర్శనము, విటప నాశికము, పాతాళ నారసింహాది మంత్రములు, చండీ మంత్రములు గ్రహపీడను తొలగించును. గ్రహపీడ నాశనము చేయు సూర్యారాధన ఈ క్రింది విధముగా చేయవలయును. సూర్యుడు తన దక్షిణ హస్తములందు పాశాంకుశ అక్షమాలా కపాలములను వామహస్తములందు ఖట్వాంగ కమల చక్ర శక్తులను ధరించి ఉండును. నాలుగు ముఖములు ఎనిమిది హస్తములు, పన్నెండు నేత్రములు కలిగి ఉండును. సూర్యుడు సూర్య మండలము లోపల కమలాసనముపై ఆదిత్యాది దేవగణ పరివృతుడై కూర్చుండియుండును. ఈ విధముగ సూర్యుని ధ్యాన పూజాదులు చేసి ఉదయ కాలమున అర్ఘ్యము ఇవ్వవలెను. అందులకు మంత్రము శ్వాస (య), విష (ఓం), అగ్నిమాన్ రండి (ర్-ఓం), హృల్లేఖా (హ్రీం) ఇవి సంకేతాక్షరములు. వీటిని కలుపగా ‘యౌః, రౌం, ఐం, హ్రీం-కలశార్కాయ భూర్భువః స్వరోం జ్వాలి నీ కుల ముద్ధర’ అని ఏర్పడును. సూర్యుడు పద్మాసనగతుడై ఎర్రగా రక్తవస్త్రములు ధరించి యుండును. అతని మండలము జ్యోతిర్మయము. ఉదార స్వభావుడు. రెండు హస్తములందును పద్మమును ధరించి అన్ని అవయవములందును అలంకారములు ధరించి సౌమ్యమూర్తియై ఉండును. సూర్యాది గ్రహములన్నియు సౌమ్యములై బలా దాయకములై కమలములు ధరించియుండును. వారి వస్త్రములు విద్యుత్పుంజమువలె నుండును. బృహస్పతి పసుపు పచ్చగాను శుక్రుడు తెల్లగను శని, నల్లటి బొగ్గువలెను రాహు కేతువులు ధూమ సమాన వర్ణులుగను వుందురు. వీరందరును ఎడమ చేతులను ఎడమ తొడలపై నుంచి దక్షిణ హస్తములందు అభయ ముద్రను ధరించి ఉందురు. గ్రహముల పేర్ల ఆద్యక్షరములకు బిందువులు చేర్చినచో అవి బీజ మంత్రములగును. “ఫట్” అని ఉచ్చరించుచు, హస్తములను శోధించి అంగుష్ఠము మొదలు కరతల పర్యంతము, కరన్యాసము నేత్రములు తప్ప హృదయాది పంచాంగ న్యాసముచేసి సూర్యుని మూల బీజరూపములగు మూడు అక్షరములతో (హ్రాం, హ్రీం, సహ) వ్యాపక న్యాసము చేయ వలయును. పిదప అర్ఘ్య పాత్రమును హస్త మంత్రముతో ప్రక్షాళనచేసి పూర్వోక్త మూల మంత్రమును ఉచ్చరించుచు ఉదకము నింపి గంధపుష్ప అక్షత దూర్వములు వేసి మరల అభిమంత్రించి ఆ జలముతో తనను పూజా ద్రవ్యములను ప్రోక్షణ చేసికొనవలెను.
పిదప యోగ పీఠమును కల్పించి, దాని పాదములుగా, ప్రభూత విమల, సార, ఆరాధ్య పరమ సుఖములను కల్పించవలెను. ఆగ్నేయాది దిక్కులు నాల్గింటి యందును మధ్య భాగము నందును వీటిపేర్లకు చివర నమః చేర్చి వాటికి ఆవాహన పూజలు చేయవలయును. యోగ పీఠముపైనను, హృదయ కమలమునందును, దిక్కునందును, విదిక్కునందును, దీప్త మొదలగు శక్తులను స్థాపించవలెను. పీఠముపై హృదయ కమలము స్థాపించి దాని కేసరములపై ఎనిమిది శక్తులను పూజించవలెను. “వాం దీప్తాం’, “వీం సూక్ష్మాం”, “వూం జయాం “, “వ్రూం భద్రి కాం”, “వేం విభూతీం”, “వైం విమలాం”, “వోం అసిఘాత విద్యుతాం”, “వౌం సర్వతో ముఖీం”, “వం పీఠమ్’. ఈ విధముగ శక్తులను పూజించి పిదప రవిని పూజించవలెను. ఆవాహనముచేసి పాద్యా దులు సమర్పించి హృదయాది షడంగన్యాస పూర్వకముగ పూజ చేయవలయును. “ఖ కారము మొదలు” జర ద్వాయుహృదా” వరకు సంకేతములచే సూచించిన రవి మంత్రము సర్వ ఫల ప్రదము. ఆగ్నేయ నైఋతి ఈశాన వాయవ్య దిక్కులందును, మధ్యయందును హృదాది పంచాంగ ములతో వాటి మంత్రములతో పూజించవలెను. కర్ణికామధ్యమునందే పూజించవలెను. తన యెదురుగా నున్న దిక్కునందు అస్త్రపూజ చేయవలెను. పూర్వాది దిక్కులందు క్రమముగా చంద్ర, బుధ, గురు, శుక్రులను, ఆగ్నేయాది విదిక్కులందు మంగళ, శనైశ్చర, రాహు, కేతువులను పూజించవలెను. పుష్టిహింగు వచా చక్ర శిరీష ఆమయములను మేకమూత్రమునందు నూరి, అంజనము, నశ్యము తయారు చేయవలయును. ఈ ఓషధులను ఈ విధముగ ఉపయోగించినచో గ్రహబాధ తొలగును. పాఠాపథ్యావచా, శిగ్రుసింధు వ్యోషములును ఒక్కొక్క పలము చొప్పున గ్రహించి ఒక కుంచెడు మేక పాలతో ఉడకపెట్టి, ఆ పాలనుండి తీసిన నెయ్యి సమస్త గ్రహబాధలను తొలగించును. వృశ్చికాళి, ఫలకుష్ఠ, లవణా శార్ఙ్గకములను నీటిలో ఉడికించి ఇచ్చినచో అపస్మార రోగము తొలగును. విదారి కుశకాశ, ఇక్షు క్వాథములతో చేసిన పాలను రోగికి త్రాగించవలెను. యష్టి కూష్మాండ రసమునందు సంస్కృతమైన ఘృతమును కాని పంచగవ్యమును గాని, ఇచ్చినచో జ్వరము తొలగును. “ఓం భస్మాస్త్రాయ విద్మహే! ఏక దంష్ట్రాయ ధీమహి తన్నో జ్వరః ప్రచోదయాత్”. ఈ మంత్రమును జపించుటచే జ్వరము తొలగును. శ్వాస రోగి కృష్ణాశన, నిశా, రాస్నా, ద్రాక్ష, తైల గుడములను సేవించవలెను. లేదా మధుఘృతములతో బార్ఞిని సేవించవలెను. లేదా పాఠా, తిక్త, కణ బార్ఞీలను తేనెతో నాకవలెను. ధాత్రీ విశ్వ సితా, కృష్ణాముస్తా, ఖర్జూర మాగధీ, పీవరా, ఇవి ఎక్కిళ్ళను తగ్గించును. పై మూడు యోగములను తేనెతో సేవించవలెను. కామల రోగము కలవాడు జీరమాండూకి నిశా, ధాత్రీరసములను త్రాగవలెను. త్రికటు పద్మకాష్ఠ, త్రిఫలా విడంగ దేవదారు రాస్నలను సమమైన పాళ్ళతో గ్రహించి చూర్ణముచేసి పటిక బెల్లముతో సేవించినచో కాసరోగము తప్పక నశించును. (300)
