అగ్ని మహా పురాణము

Table of Contents

రాముడు బోధించిన రాజనీతి - 2

శ్రీరాముడు పలికెను: లక్ష్మణా! స్వామి, అమాత్య, రాష్ట్ర, దుర్గ, కోశ, బల, సుహృత్తుల నునవి పరస్పర ఉపకారములగు ఆరు అంగములు. వీటిలో రాజ-అమాత్యుల తరువాత ప్రధానమైనది రాష్ట్రము. అర్థసాధకము. అందుచే సర్వదా దానిని పాలించవలెను. కులీనత్వము, సత్త్వము, యౌవనము, శీలము, దాక్షిణ్యము, శీఘ్రకారిత్వము, పూర్వపర విరుద్ధముగ మాటలాడకుండుట, సత్యము, వృద్ధసేవ, కృతజ్ఞత్వము, దైవానుకూల్య సంపాదనము, బుద్ధి, నీచపరివారము లేకుండుట, సమర్థులగు సామంతులు కలిగియుండుట, దృఢ భక్తిత్వము, ముందుచూపు, ఉత్సాహము, చిత్తశుద్ధి, ఔదార్యము, వినయము, ధార్మికత్వము-ఇవి అభిగామిక గుణములు. అభివృద్ధి కోరు రాజు-సుప్రసిద్ధమగు కాలమునందు జనించినవారు, క్రౌర్యము లేనివారు, గుణవంతులు, పవిత్రులు అగు పురుషులను చేరదీసి తన పరివారమునందు ఉంచుకొనవలెను.

వాగ్మి, ప్రగల్భుడు స్మరణశక్తి కలవాడు, ఎత్తైనవాడు, బలవంతుడు, జితేంద్రియుడు, సేనను నడపగలవాడు విద్యానిష్ణాతుడు, స్వరగ్రహుడు (పొరబాటున ప్రారంభించిన చెడుపని నుండి వెనుకకు మరలువాడు). పరాక్రమణము సహించగలవాడు, అన్నింటికిని ప్రతిక్రియ ఆలోచించ సమర్థుడు, శత్రువుల లోపములను కనిపెట్టువాడు, సంధి విగ్రహ తత్త్వజ్ఞుడు, మంత్రణము గూఢముగా నుంచువాడు, దేశకాలవిభాగము ఎరిగినవాడు, ధనమును రాబట్టుకొనువాడు, తగు వ్యయము చేయువాడు, సత్పాత్రలను ఎరిగినవాడు, క్రోధ, లోభ, భయ, ద్రోహ, స్తంభ (మొండితనము), చాపల్యములను, దోషములు లేనివాడు, పరపీడన-పైశున్య (చాడీలు చెప్పుట), మాత్సర్య, ఈర్ష్యా, అనృతములను దుర్గుణములు లేనివాడు, వృద్ధజనోపదేశానుసారము ప్రవర్తించువాడు, మధురభాషి, మధురదర్శనుడు, గుణానురాగి, మితభాషి, అయిన రాజుశ్రేష్ఠుడు. ఇవి రాజునకు ఉండవలసిన ఆత్మసంపత్తికి సంబంధించిన గుణములు. ఉత్తమ కులసంజాతులు, బాహ్యాంతః శుద్ధులు, శౌర్య సంపన్నులు, ఆన్వీక్షక్యాది విద్యానిపులు, స్వామిభక్తులు, దండనీతి ప్రయోగకుశలులు అగు వారు రాజామాత్యులుగా ఉండుటకు యోగ్యులు.

అన్యాయ మార్గమునుండి సులభముగ మరల్చుటకు శక్యమైనవాడు, అదే జనపదము నందు పుట్టినవాడు, సత్కుల సంజాతుడు, సుశీలుడు, శారీర బలసంపన్నుడు, వక్తృత్వము కలవాడు, సభా సంభాషణ ప్రగల్భుడు, శాస్త్రమను నేత్రము కలవాడు, ఉత్సాహవంతుడు, సమయస్ఫూర్తి కలవాడు స్తబ్దత్వ (మొండితనము) చాపల్యములు లేనివాడు, స్నేహశీలుడు, శీతోష్ణాది క్లేశసహన సమర్థుడు, శుచి (లంచము మొదలగువాటికి దూరముగా నుండు వాడు), సత్య, సత్త్వ, ధైర్య, స్థైర్య, ప్రభావ, ఆరోగ్యాది గుణసంపన్నుడు, శిల్పనిపుణుడు, దక్షుడు, ప్రజ్ఞావంతుడు, ధారణాశక్తి కలవాడు, దృఢభక్తి, ఎవ్వరితోను వైరము లేనివాడు. ఇతరులు కల్పించిన విరోధమును శాంతింప చేయువాడు అగు పురుషుడు రాజునకు బుద్ధి సచివుడుగను, కర్మ సచివుడుగను ఉండుటకు తగినవాడు. స్మరణశక్తి, కార్వవ్యగ్రత, ఊహశక్తి జ్ఞాననిశ్చయము, దృఢత్వము, మంత్రగుప్తి ఇవి మంత్రి సంపద. పురోహితుడు వేదత్రయ నిష్ణాతుడై, దండనీతి ప్రయోగకుశలుడై, అడ్వర్వ వేదోక్త విధానమున రాజు కొరకు శాంతి కర్మ-పుష్టి కర్మలను సంపాదించుచుండవలెను. బుద్ధిమంతుడైన రాజు ఆయా విద్యలయందు నైపుణ్యముగల పండితులచే అమాత్యుల శిల్పాశాస్త్రాది జ్ఞానమును పరీక్షించవలెను. ఇది పరోక్ష పరీక్ష. కులీనత్వము, జన్మస్థానము, అవగ్రహము (అతడు ఎవరి చెప్పుచేతలలో ఉండును అను విషయము) ఈ మూడింటిని అతని ఆత్మీయులనుండి తెలుసు కొనవలెను. పరికర్మ (దుర్గాది నిర్మాణ) దక్షత్వము, విజ్ఞానము, ధారయిష్టుత అను మూడు గుణములను కూడ పరీక్షించవలెను. ప్రగల్భత్వము, ప్రతిభ, వాగ్మిత్వము, సత్యవాదిత్వము అను నాలుగు గుణములను మాటలలోనే తానే స్వయముగా పరీక్షించవలెను. ఉత్సాహము ప్రభావము, క్లేశసహన సామర్థ్యము, ధైర్యము, స్వామిభక్తి స్థైర్యము అను గణములను ఆపత్సమయములందు పరీక్షించవలెను. రాజు విషయమున దృఢమైన భక్తి, మైత్రి, ఆచార విచారములందు పరిశుద్ధత్వము-ఈ గుణములను ఆతని వ్యవహారమును బట్టి పరీక్షించవలెను.

బలము, సత్త్వము, ఆరోగ్యము, శీలము, అస్తబ్ధత, అచాపల్యము అను గుణములను చుట్టు ప్రక్కలనున్న వారి ద్వారా పరీక్షించవలెను. వైరము పెంచుకొనకుండు స్వభావమును, భద్రత్వమును, నీచత్వమును ప్రత్యక్షముగనే చూచి గ్రహించవలెను. గుణప్రవృత్తులు ప్రత్యక్షముగా గ్రహించుటకు వీలుకాని పురుషుని గుణములను ఊహించి తెలుసు కొనవలెను. ఎక్కువ పంటలు పండునదియు, వివిధ వస్తువుల గనులు, అమ్ముటకు వీలైన అధికమైన ఖనిజ పదార్థములు ఉన్నదియు, గోవులకు హితకరమైనదియు, అధిక జలము కలదియు, చుట్టును పవిత్రమైన జనపదములు ఉన్నదియు, అందమైనదియు, అడవులలో ఏనుగులు ఉన్నదియు, జలమార్గ-స్థల మార్గములున్నదియు, పంటలకై వర్షములపై ఆధారపడనిదియు, పంటలకై అధికముగ జలము లభించునదియు అగు భూమి ఐశ్వర్య వృద్ధికి ప్రశస్తము, జలము అధికముగ లభించునది, పర్వత సాహాయ్యమున్నది. శూద్ర, శిల్పి, వైశ్యులు అధిక సంఖ్యలో ఉన్నది, ప్రయత్నశీలులు, పెద్ద పెద్ద పనులు తలబెట్టువారు, రాజానురక్తులు, రాజశత్రుద్వేషులు, పీడా-కరభారములను సహింపగలవారు, అగు వ్యవసాయదారులు కలది, అనేక దేశములనుండి వచ్చిన జనులకు నివాసస్థానమైనది. సువిస్తృతము, ధార్మికులు, పశుసంపద కలవారు, అగు ధనికుల కలదియు, మూర్ఖులును, వ్యసన గ్రస్తులును అగు నాయకులు కలదియగు జనపదము రాజుకు శ్రేష్ఠమైనది. విస్తృతమైన సరి హద్దులు కలది, నాల్గువైపులందును విశాలమైన అగడ్తలు కలది, ఉన్నతమైన ప్రాకార-గోపురములు కలది, పర్వతమును గాని, మరుభూమినిగాని, అడవిగాని ఆశ్రయముగా గ్రహించి నిర్మించినది, అగుపురము నందు రాజు నివసించవలెను. జలము, ధాన్యము, ధనము అధికముగనున్న దుర్గము చాలకాలము శత్రువుల ఆక్రమణమును తట్టుకొనుటకు సమర్థమై యుండును. జలమయము, పర్వతమయము, వృక్షమయము, ఇరిణము (నిర్జన ప్రదేశ నిర్మితము), ధాన్వనము (మరు భూ నిర్మితము) అని దుర్గము ఐదు విధములు.

విశ్వాసపాత్రుల రక్షణలో ఉన్నది, ధర్మ న్యాయానుసారముగ ఆర్జింపబడినది, ఎంత వ్యయము చేసినను తరగనిది అయిన కోశము శ్రేష్ఠము. కోశమును ధర్మాది వృద్ధి కొరకును, భృత్యాదుల పోషణము కొరకును వినియోగించవలెను. తాత ముత్తాతల నుండియు సేవచేయుచున్నవారును, లొంగి ఉండువారును, ఐకమత్యము కలవారును, జీతములు పూర్తిగ చెల్లించిన (తీసికొన్న) వారును, ప్రసిద్ధ పౌరుషవంతులును, తన జనపదమునందే జనించినవారును, యుద్ధకుశలులును, కుశలులగు సైనికులతో కలిసి ఉండువారును, నానావిధ శస్త్రాస్త్ర సంపన్నులును, అనేక యుద్ధములందు ఆరితేరినవారును, అనేకులు మహాయోధులున్న దళములకు చెందినవారును, తమ సైన్యమునందలి అశ్వములకును గజములకును హారతి ఇచ్చువారును, పరదేశ నివాసము, యుద్ధమునందలి కష్టములు, అనేక విధములగు క్లేశములు సహించసమర్థులును, యుద్ధమునందు చాల శ్రమ పడిన వారును, రెండు ఆలోచనలు లేనివారును, చాలవరకు క్షత్రియజాతికి చెందినవారును అగు సైనికులు గల సైన్యము శ్రేష్ఠమైనదని దండనీతిజ్ఞుల అభిప్రాయము. త్యాగ, విజ్ఞాన, సత్త్వములు కలవారును, చాలమంది ఆత్మీయులు కలవారును, ప్రియముగ మాటలాడు వారును. భవిష్యత్తులో ఉపయోగించు వారును రెండు ఆలోచనలు లేనివారును, ఉత్తమకుల సంజాతులును అగు పురుషులను మిత్రులనుగ చేసికొనవలెను. మిత్రుడురాగానే దూరము నుండియే ఎదురేగుట, స్పష్టములు, ప్రియములు అగు మాటలు చెప్పుట, సత్కార పూర్వకముగ మనోవాంఛిత వస్తువు ఇచ్చుట-ఇవి మూడును మిత్ర సంగ్రహణ ఉపాయములు. ధర్మార్థకామములు మిత్రుల నుండి లభించు మూడు ఫలములు. ఔరసులు (మాతృపిత్రాది సంబంధము ద్వారా ఏర్పడినవారు), మైత్రీబంధ బద్ధులు, కులక్రమాగతులు, కష్టముల నుండి రక్షింపబడినవారు అని మిత్రులు నాల్గురకములు. సత్యవచనము, అనురాగము, సుఖ దుఃఖములందు ఒకే విధముగ పాలుపంచుకొనుట. ఇవి మిత్రగుణములు.

రాజసేవకుల ప్రవృత్తిని గూర్చి చెప్పెదను; సేవకులకు తగిన గుణములు కలవాడు రాజసేవ చేయవలెను. నేర్పు, లోకప్రియత్వము, దృఢత్వము, ఓర్పు, క్లేశసహశక్తి, సంతోషము, శీలము, ఉత్సాహము-ఈ గుణములు సేవకుల అలంకారములు. సేవకుడు సమయానుసారముగను, న్యాయపూర్వకముగను రాజసేవ చేయవలెను. ఇతరుల స్థానమునకు వెళ్ళుట, క్రూరత్వము, అసభ్యత్వము, ఈర్ష్య-ఈ దోషములను త్యజించవలెను. తన పై అధికారి మాటలను ఖండించిగాని, తద్విరుద్ధముగ గాని రాజసభలో మాటలాడ గూడదు. రాజు యొక్క రహస్యకార్యములను, గుప్త మంత్రణమును ఎచ్చటను ప్రకటము చేయకూడదు. తన విషయమున స్నేహముగల స్వామివద్దనే సేవకుడుగా ఉండవలెను. రాజు తనపై విరక్తి చూపినచో లేదా అసహ్యము చూపినచో ఆతనిని విడువవలెను. సంగ్రహముగ చెప్పవలెనన్నచో రాజు అనుచిత కార్యము చేయనున్నప్పుడు నివారించుట, సత్కార్యములు చేయుచున్నప్పుడు అతనికి సాహాయ్యము చేయుట ఇది బంధువులు, మిత్రులు, సేవకులు చేయవలసిన శ్రేష్ఠాచారము. మేఘమువలె రాజు సమస్త ప్రాణులకును వృత్తి కల్పింపవలెను. ఆయా స్థానములు అన్నింటియందును, సుపరీక్షితులును, విశ్వాస యోగ్యులును అగు వారిని నియోగించవలెను. ఉద్యమశీలులను మాత్రమే కర్మా ధ్యక్షులుగ చేయవలెను. వ్యవసాయము, వర్తకులకు ఉపయోగించు స్థలజలమార్గములు, పర్వతాది దుర్గములు సేతుబంధములు, ఏనుగులను పట్టు స్థానములు సువర్ణ-రజతాది ఖనులు, వనమునందు లభించు శ్రేష్ఠమైన కఱ్ఱ మొదలైనవి శూన్య ప్రదేశములందు గ్రామాది నిర్మాణము-ఈ ఎనిమిది ఆయద్వారములు. వీటికి ‘అష్ట వర్గము’ అని పేరు. ధర్మాత్ముడైన రాజు ఈ అష్ట వర్గమును నిరంతరము రక్షించవలెను. అధికారులు, చోరులు, శత్రువులు, రాజబంధువులు, రాజు యొక్క దురాశ-ఈ ఐదును ప్రజలకు ఐదు విధములగు భయములను కలిగించుచుండును. రాజు, ఈ భయములు కలుగకుండ చేయుచు, ప్రజల నుండి తగు సమయములందు పన్ను వసూలు చేయుచుండవలెను. బాహ్యము, అభ్యన్తరము అని రాజ్యము రెండు విధములు. రాజు యొక్క శరీరమే అభ్యంతరము. రాష్ట్రము బాహ్య రాజ్యము. రాజు ఈ రెండింటిని రక్షించుకొనవలెను. రాజ్యమునకు హాని కలిగించు పాపాత్ములు రాజప్రియులైనను దండనీయులే. రాజు వారందరిని శిక్షించవలెను. విషాదుల నుండి తనను రక్షించుకొనవలెను, స్త్రీలను, పుత్రులను, శత్రువులను ఎన్నడును విశ్వసించగూడదు. (239)