అగ్ని మహా పురాణము
రాజధర్మములు-2
పుష్కరుడు చెప్పెను:
రాజు తన పుత్రుని బాగుగా రక్షించుకొనుచు ఆతనికి ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, కామశాస్త్ర, ధనుర్వేదములందు శిక్షణ ఇవ్వవలెను. వివిధ శిల్పములను గూడ నేర్పవలెను. విశ్వాస పాత్రులు, ప్రియముగా మాటలాడువారు అగువారిని శిక్షకులుగా నియమించవలెను. రాజకుమారుని శరీర రక్షార్థమై కొందరిని నియమింపవలెను. కోపము కలవారు, లుబ్ధులు, అవమానితులు అయినవారి నుండి రాజకుమారుని దూరముగా ఉంచవలెను. మంచి గుణములు నేర్పుట అంత సులభము కాదు. అందుచే రాజకుమారుని ఎక్కువగా సుఖ పెట్టరాదు. ఆతడు చక్కగా శిక్షితుడైన పిమ్మట ఆతనిని అన్ని పనులందును నియమించవలెను. వేట, జూదము, మద్యపానము-ఇవి రాజ్య వినాశకరములగు దోషములు. రాజు వీటిని పరిత్యజించవలెను. పగటినిద్ర, పనిలేకుండగ తిరుగుట, కటుభాషణము-వీటిని పరిత్యజించవలెను. ఇతరులను నిందించుట, తీక్ష్ణదండము, అర్థ దూషణము కూడ విడువవలెను.
బంగారము గనులు మొదలగునవి నశించిపోవుట, దుర్గాదులకు మరమ్మతులు చేయకుండుట ఇవి అర్థ దూషణములు. ధనమును కొంచెము కొంచెము అనేక స్థానములందు ఉంచుట, అయోగ్యములైన దేశకాలములందు అపాత్రులకు దానము చేయుట చెడ్డపనులకై ధనము వెచ్చించుట, ఇవికూడ అర్థ దూషణములు. కామ, క్రోధ, మద, మాన, లోభ, దర్పములను త్యజించవలెను. పిదప భృత్యులను వశమునందు ఉంచుకొని, పిమ్మట నగరములోని వారిని, దేశములోని వారిని వశంగతులను చేసికొనవలెను. పిదప బాహ్య శత్రువులను జయించుటకై ప్రయత్నించవలెను. బాహ్యశత్రువులు మూడు రకములు-పాత శత్రుత్వము కలవారు, రాజ్యపు సరిహద్దులలో ఉండువారు, తనతో శత్రుత్వము ఏర్పడినవారు. వీరిలో పూర్వ పూర్వులు అధిక శత్రువులు. తాత ముత్తాతల నుంచి మిత్రులు, శత్రువుల శత్రువులు, కృత్రిములు అని మిత్రులు కూడ మూడు విధములు.
ధర్మ వేత్తవైన పరశురామా! రాజ్యమునకు-రాజు, మంత్రి, జనపదము, దుర్గము, సేన, కోషము, మిత్రులు-అని ఏడు అంగములు. రాజ్యమునకు మూలము స్వామి (రాజు). అందుచే ఆతనిని ఎక్కువగా రక్షించవలెను. రాజ్యాంగ విద్రోహులను చంపివేయ వలెను. సమయాను సారముగా రాజు కఠోరముగాను మృదువుగాను కూడ ప్రవర్తించ వలెను. ఇట్లుండుటచే ఆతనికి రెండు లోకములును బాగుపడును. రాజు భృత్యులతో పరిహాసము చేయరాదు. అందరితోడను నవ్వుతూ మాటలాడే రాజును సేవకులు అవమానింతురు. లోకులతో కలిసిమెలిసి ఉండుటకై రాజు కొన్ని లేని వ్యసనములు కూడ ఉన్నట్లు ప్రవర్తించవలెను. ప్రజలు ప్రసన్నులగు విధమున చిరునవ్వు నవ్వుచూ మాటలాడవలెను. దీర్ఘసూత్రి (పనులు చేయుటలో చాలాకాలం ఆలోచించువాడు) యైన రాజు యొక్క కార్యములు అన్నియు నశించును. కాని రాగ, దర్ప, అభిమాన, ద్రోహ, పాపకర్మ, ఆప్రియ భాషణాదులలో దీర్ఘ సూత్రియైన రాజును అందరును ప్రశంసింతురు. రాజు తన మంత్రమును (ఆలోచనలను గుప్తముగా ఉంచుకొనవలెను. అట్లు ఉంచుకొన్నచో ఎన్నటికిని ఆపద రాదు.
రాజ్యకార్యములు పూర్తియైన తరువాతనే ఇతరులకు తెలియవలెను. వాటి ప్రారంభము ఎవ్వరికిని తెలియకూడదు. మనుష్యుల ఆకారము, సంజ్ఞలు, చేష్టలు, ప్రవర్తన, మాటలు, నేత్ర ముఖ వికారములు-వీటినిపట్టి వారి మనస్సులోని ఆలోచనను పసిగట్టవచ్చును. రాజు ఒంటరిగా రహస్యమైన విషయములను గూర్చి ఆలోచించగూడదు. చాల మందితో సలహా తీసికొనవచ్చును గాని ఒక్కొక్కరినే పిలిపించి తీసికొనవలెను. రాజుయొక్క రహస్య ఆలోచనలను మంత్రి ఇతర మంత్రులకు గూడ చెప్పగూడదు. మనుష్యులకు సాధారణముగా ఎవ్వరో ఒక వ్యక్తిపైననే విశ్వాసము ఏర్పడును. అందుచే రాజు విద్వాంసుడైన ఒక మంత్రితో మాత్రమే ఆలోచనలు చేయవలెను. వినయములేని రాజు నశించును. వినయవంతుడు రాజ్యము పొందగల్గును. వేదత్రయ పండితుల నుండి, వేదత్రయమును, ప్రాచీన దండనీతిని, అన్వీక్షకిని, (న్యాయ వేదాంతాదులు) అర్థశాస్త్రమును నేర్వవలెను. వార్తను (కృషి, గోరక్ష, వాణిజ్యము మొదలగు) గూర్చిన జ్ఞానమును లోకము నుండి సంపాదించుకొనవలెను. తన ఇంద్రియములను వశములో ఉంచుకొన్నవాడే ప్రజలను వశములో ఉంచుకొనగల్గును. దేవతలును, సమస్త బ్రాహ్మణులను పోషించవలెను. వారికి దానములు ఈయవలెను. బ్రాహ్మణునకు ఇచ్చిన దానము అక్షయమగును. దానిని ఎవ్వరును నశింపజేయ జాలరు. యుద్ధమునందు వీపు చూపకుండుట, ప్రజలను పాలించుట, బ్రాహ్మణులకు దానములు ఇచ్చుట ఇవి రాజునకు కల్యాణదాయకములు. దీనులు, అనాధలు, వృద్ధులు, విధవలగు స్త్రీలు మొదలగువారి యోగక్షేమములు చూచుచు, వారికి జీవనోపాధి కల్పింపవలెను. వర్ణాశ్రమధర్మ రక్షణము, మునులను సత్కరించుట ఇవి రాజుల కర్తవ్యములు. రాజు ఎవ్వరిని నమ్మకూడదు. కాని మునులను మాత్రము నమ్మవచ్చును. సరియైన ఉపాయములచే ఇతరులకు తనపై విశ్వాసము ఏర్పడునట్లు చేసికొనవలెను. రాజు స్వార్థమును గూర్చి కొంగవలె ఆలోచించవలెను. సింహమువలె పరాక్రమము చూపవలెను. తోడేలువలె శత్రువులను ఆక్రమించి చర్చించవలెను. చెవులపిల్లి వలె దుముకుచు అదృశ్యుడు కావలెను. సూకరమువలె దృఢ ప్రహారము చేయవలెను. నెమలివలె విచిత్ర వేషమును ధరించవలెను. గుఱ్ఱమువలె దృఢమైన భక్తి కలిగియుండ వలెను. కోకిలవలె మధురముగా మాటలాడవలెను. కాకివలె అందరి నుండి తప్పించుకొని యుండవలెను. ఎవరికిని తెలియని చోట నివసించవలెను. పరీక్షించకుండ భోజనము చేయరాదు. శయ్యపై పరుండరాదు. ప్రజలను పీల్చివేయువాడు రాజ్యమును, జీవితమును కూడ కోల్పోవును. పోషింపబడిన లేగదూడ బలము కలదైన పిమ్మట పనులు చేయుటకు ఉపయోగించునట్లు, బాగుగా రక్షింపబడిన రాష్ట్రము రాజునకు ఉపకరించును. కార్యములన్నియు దైవముమీదను పురుషకారము మీదను ఆధారపడి ఉండును. వీటిలో దైవము అచింత్యము. పురుషకారము కార్యమును సాధించగలుగును. ప్రజానురాగమే రాజ్యమును, పృథివిని, లక్ష్మిని ఇచ్చు ఏకైక హేతువు. (225)
