అగ్ని మహా పురాణము

Table of Contents

మహేశ్వర స్నానము - లక్ష కోటి హోమములు

పుష్కరుడు పలికెను:

రాజాదులకు జయమునిచ్చు మహేశ్వర స్నానాదుల గూర్చి చెప్పెదను. పూర్వము శుక్రాచార్యుడు దీనిని దానవేంద్రుడగు బలికి చెప్పెను. ప్రాతః కాలము, సూర్యోదయమునకు పూర్వము యాచార్యుడు రాజును భద్ర పీఠముపై కూర్చుండబెట్టి ‘జయ, జయసర్వాన్ శత్రూన్’ అని పల్కుచు, ‘లిఖి, ఖిలా స్వాహా’ వరకును ఉన్న మూలోక మంత్రమును చెప్పుచు స్నానమును చేయించవలెను. ఈ విధముగ స్నానము చేసిన పిమ్మట తండుల హోమము చేసి త్రిశూలధారియగు శివునకు పంచామృత స్నానము చేయించి పూజ చేయవలయును.

సర్వదా విజయమునిచ్చు ఇతర విధములగు స్నానములను చెప్పెదను. ఘృత స్నానము ఆయుర్వర్ధకము. గోమయస్నానము లక్ష్మీప్రదము. గోమూత్ర స్నానము పాప నాశకము. క్షీరస్నానము బలవృద్ధికరము. దధిస్నానము లక్ష్మీ వర్ధకము. కుశోదకముతో స్నానము పాపములను నశింపచేయును. పంచగవ్య స్నానముచే సర్వ కామములును లభించును. శృంగోదక స్నానము పాప వినాశకము. పలాశ, బిల్వ, కమల, కుశ, స్నానము సర్వకామ్యప్రదము. వస, రెండు విధముల పసుపు, ముస్త కలిపిన నీటితో స్నానము రాక్షస వినాశకము. ఆయుర్వృద్ధి యశస్సు ధర్మము, మేధకూడ దీనిచే లభించును. సువర్ణోదకములతో స్నానము మంగళకరము. రజత తామ్ర జల స్నానములు కూడ మంగళకరము. రత్నమిశ్ర జలముతో స్నానము విజయమును, సర్వగంధ మిశ్రిత జలముతో స్నానము సౌభాగ్యమును. ఫలోదక స్నానము ఆరోగ్యమును, ఉసిరికాయల జలముతో స్నానము లక్ష్మిని ఇచ్చును. తిలశ్వేత సర్షపములు కలిపిన జలముచే లక్ష్మియు, ప్రియంగు జల స్నానముచే సౌభాగ్యము పద్మ ఉత్పల కదంబ మిశ్ర జలస్నానములచే లక్ష్మియు బలావృక్ష జల స్నానముచే బలము లభించును. విష్ణు చరణోదక స్నానము అన్ని స్నానముల కంటెను శ్రేష్ఠమైనది.

ఏకాకియైన మనుష్యుడు ఒక కోరికతో ఒకే స్నానము చేయవలయును. ‘ఆక్రంద’ యతి ఇత్యాది సూక్తము చెప్పుచు చేతికి మణికట్టవలెను. ఈ మణి కుష్ఠ-పాఠ్యా-పచా-శుంఠీ-శంఖ-లోహాదులతో చేయబడవలెను. శ్రీ మహావిష్ణువు సర్వకామములకు అధిపతి. ఆతనిని పూజించుటచే సర్వకామములను పొందును. ఘృతమిశ్ర దుగ్ధముతో స్నానము చేయించి విష్ణువును పూజించు వానికి పిత్త రోగము నశించును. పంచముద్గ బలియిచ్చినచో అతిసారరోగము పంచగవ్య స్నానము చేయించినచో వాత వ్యాధి ద్విస్నేహ ద్రవ్యములతో స్నానము చేయించి శ్రద్ధాపూర్వకముగ పూజించుటచే శ్లేష్మ రోగములు నశించును. ఘృత-తైల, మధువులతో చేయించిన స్నానము ‘త్రిరస’ స్నానము. ఘృత జలములతో చేయించిన స్నానము. ‘ద్వి స్నేహ’ స్నానము, ఘృత, తైల, మిశ్ర జలముతో చేయించిన స్నానము సమలస్నానము. మధు ఇక్షురస క్షీరములతో చేయించిన స్నానము త్రిమధుర స్నానము, ఘృత, ఇక్షురస, మధులతో చేయించిన ‘త్రిరస’ స్నానము లక్ష్మీ ప్రదము. కర్పూర, ఉషీర చందనములతో చేసిన అనులేపము ‘త్రిశుక్లము’ చందన అగురు, కర్పూర, కస్తూరి కుంకుమములతో చేసిన అనులేపనమును విష్ణువునకు సమర్పించినచో అది సర్వకామ ఫలప్రదము. కర్పూర చందన, కుంకుమములతో కాని, కస్తూరి కర్పూర చందనములతో కాని చేసిన త్రి సుగంధ మనులేపనము సర్వ కామప్రదము. జాతిఫల కర్పూర చందనములు అనునవి ‘త్రిశీతకమని’ చెప్పబడును. పీత వర్ణములు, శుక్ల వర్ణములు, శుక్లములు, కృష్ణములు, రక్తములు, ఇవి పంచవర్ణములు. విష్ణు పూజకు, ఉత్పలములను, కమలములను, జాతీపుష్పములను త్రిశీతములకు ‘త్రిశీతమును ఉపయోగించవలెను. కుంకుమ రక్తకమల రక్తోత్పలములకు ‘త్రిరక్తము’ యని పేరు. ధూపదీపాదులతో మహావిష్ణువుకు పూజచేసినచో మానవులకు శాంతి లభించును. నాలుగు హస్తముల చతురస్ర కుండమునందు ఎనమండుగురు లేదా పదునారుగురు బ్రాహ్మణులు తిల, ఆజ్య, తండులములతో లక్షగాని, కోటి హోమము చేయవలయును. గృహ పూజచేసి గాయత్రిచే హోమము చేసినచో క్రమముగా అన్ని విధముల శాంతి కలుగును. (267)