అగ్ని మహా పురాణము
వాక్పారుష్యాది ప్రకరణము
అగ్నిదేవుడు పలికెను:
అవయవ లోపము ఇంద్రియ లోపము కలవారిని, రోగపీడితులను, సత్య వచనముల చేత గాని, అసత్య వచనములచేతగాని, విపరీత స్తోత్రములచే గాని ఆక్షేపించు వారిని పదమూడున్నర పణములచే దండించవలెను. నీ సోదరిని, తల్లిని చెరిచెదను అని తిట్టువానికి ఇరువదియైదు పణముల దండము విధించవలెను. తిట్టబడినవాడు అధముడు అయినచో సగము దండము, పరస్త్రీగాని, ఉత్తములుగాని అయినచో రెట్టింపు దండము విధించవలెను. వర్ణజాతుల ఉత్తమత్వ అధమత్వములను పరిశీలించి, దండమును నిర్ణయించవలెను. నిమ్న వర్ణమువాడు ఉచ్చవర్ణము వానిని తిట్టినపుడు రెండు రెట్లు మూడురెట్లు దండములను, ఉత్తమ వర్ణమువాడు నిమ్న వర్ణము వానిని తిట్టినపుడు సగము తగ్గించియు దండము విధించవలెను.
మాటలతో “నీ చేతులను, మెడను, నేత్రములను, తొడలను విరుగగొట్టెదను” యని తిట్టినచో నూరు పణముల దండము విధించవలెను. పాదములు, ముక్కు, చెవులు, చేతులు, విరచెదను” అని తిట్టినవానికి దానిలో సగము దండము విధించవలెను. ఇట్లు తిట్టినవాడు అసమర్థుడైనచో పది పణములు దండించవలెను. సమర్థుడైనవాడు దండము చెల్లించి తిట్టబడినవాని క్షేమము కొరకై (ప్రతిభూ) జామీను ఇవ్వవలెను. “నీవు పతితుడవు’ యని తిట్టినవానికి మధ్యమ సాహస దండము. ఉపపాతకములు చేసినావుయని తిట్టిన వానికి ప్రథమ సాహసదండము. వేదవేత్తలను రాజును దేవతలను తిట్టిన వానికి ఉత్తమ సాహస దండము. జ్ఞాతులను సంఘమును తిట్టినవానికి మధ్యమ దండము. గ్రామమును దేశమును తిట్టినవానికి ప్రథమ సాహస దండము.
ఎవరినైన కొట్టినపుడు సాక్షులు లేనిచో ఆ యభియోగమును రాజు చిహ్నము యుక్తి, శాస్త్రము - వీటినిబట్టి పరిశీలించవలెను. దెబ్బతగిలినట్లు అసత్యమగు చిహ్నములు చేసికొనెనా! అని పరిశీలించవలెను. ఇతరునిపై భస్మము పంకము పరాగము చల్లిన వానికి పదిపణముల దండము. అమేధ్యమును ఉమ్మి తగిల్చిన వానికిని మనవతో తన్నిన వానికిని రెట్టింపు దండము. ఇది సముల విషయమునను చెప్పబడినది. పరస్త్రీల విషయమునను ఉత్తముల విషయమునను ఈ అపరాధము చేసినచో రెట్టింపు దండము. తనకంటె హీనుల విషయమున చేసినచో సగము దండము. మోహము చేతగాని మదాదుల చేతగాని చేసినచో దండము లేదు. ఒక విప్రునకు ఏ అంగముచే ఆ బ్రాహ్మణుడు పీడకల్గించునో ఆ అంగమును ఛేదించవలెను. బ్రాహ్మణుని చంపుటకు ఆయుధ మెత్తినచో ప్రథమ సాహస దండము. ఆయుధమును స్పృశించినచో సగము దండము. కొట్టుటకు హస్తము గాని పాదముగాని ఎత్తిన వానికి వరుసగా పది ఇరువది పణముల దండము. ఒకరినొకరు కొట్టుకొనుటకై ప్రయత్నించినపుడు అందరికిని మధ్యమ సాహస దండము. పాదము, కేశములు, వస్త్రము, హస్తములు, పట్టి లాగినచో పదిపణముల దండము. పీడించినను లాగినను బట్టతో చుట్టబెట్టినను తన్నినను నూరుపణముల దండము. కాష్ఠాదులచే కొట్టి నపుడు రక్తము రాకున్నచో ముప్పది రెండు పణముల దండము. రక్తము కనబడినచో రెట్టింపు దండము, హస్తములను కాని పాదములను కాని దంతములను గాని విరుగగొట్టిన వానికి కర్ణములను నాసికను ఛేదించినవానికిని గాయము కలుగునట్లు కొట్టిన వానికిన్ని చచ్చెనా యన్నట్లు కొట్టిన వానికి మధ్యమ దండము. ఇతరుల చేష్టను, భోజనమును, వాక్కును అడ్డుగొనినప్పుడున్ను నేత్రాదులను, పీడించినప్పుడున్ను కంఠము బాహువులు తొడలు విరిచినపుడున్ను మధ్యమ సాహస దండము. చాలమంది కలసి ఒకనిని కొట్టినచో వారికి వెనుక చెప్పిన దండమునకు రెట్టింపు దండము ప్రత్యేకముగా విధించవలెను. కలహములో అపహరింపబడిన వస్తువును, దాని స్వామికి ఇప్పించి దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. అన్యునకు దుఃఖము కల్గించు వానిచే చికిత్సాదులకు యెంత వ్యయమగునో అంతధనము ఇప్పించవలెను. ఏకలహమునకు ఏ దండము విధింపబడినదో ఆ దండమును కూడ విధించవలెను. నావచే దాటించువాడు స్థల శుల్కమును తీసుకున్నచో పదిపణముల దండము. దేవకార్యాదులు వచ్చినపుడు సమర్థుడైయుండి కూడ చుట్టు ప్రక్కలవున్న బ్రాహ్మణులను నిమంత్రణము చేయనివానికి పది పణముల దండము. ఇతరుల గోడను కొట్టినను భేదించినను రంధ్రము చేసినను దానిని పడగొట్టినను వరసగ ఐదు, పది, ఇరువది ముప్పది ఐదు పణములు ఇప్పించవలెను. ఇతరుల గృహమునందు దుఃఖోత్పాదకములగు వస్తువులను ప్రాణహరములగు వస్తువులను పడవేయువారికి పదహారు పణముల దండము మధ్యమ సాహస దండము విధించవలెను. క్షుద్ర పశువులకు పీడ కల్గించినను వాటి శరీరమునుండి రక్తము స్రవించినట్లు చేసినను, కొమ్ములు ఛేదించినను, వరసగ రెండు నాలుగు ఎనిమిది పణముల దండము. వాటి లింగమును ఛేదించగ అవి మరణించినచో మధ్యమ సాహస దండము వీధించి వాటి మూల్యమును ఇప్పించ వలెను. మహా పశువుల విషయమున ఈ అపరాధము చేసినపుడు రెట్టింపు దండము. ప్రరోహి (కొమ్మతీసి పాతగ మొలచునది) వృక్షముల శాఖలను మ్రానును మొత్తము వృక్షమును చీల్చివేసినపుడు ఇరువది పణముల దండము, ఉప జీవ్య వృక్షము(ఫల వృక్షములు) ఇట్లుచేసినచో రెట్టింపు దండము. సాహసమును చేయించినవానికి చేసినవాని కంటె రెట్టింపు దండము. నేను నీకు ధనమును ఇచ్చెదను, సాహసమును చేయుము అని చెప్పి చేయించినవానికి నాలుగు రెట్ల దండము.
పూజ్యులను తిట్టినవానికి, వారి ఆజ్ఞను అతిక్రమించినవానికి సోదరుని భార్యను కొట్టినవానికి, ఇచ్చెదనని చెప్పి ఇవ్వనివానికి, భూగృహమును భేదించినవానికి, ఇరుగు పొరుగువారికిని, కులీనులకు అపకారము చేయువానికిని ఏబది పణముల దండము. స్వేచ్ఛా పూర్వకముగ విధవా సంగముచేసిన వానికి, కష్టములలో ఉన్నవారు అరచినపుడు పరుగెత్తని వానికి అకారణముగా తిట్టువానికి, ఉత్తములను స్పృశించు చండాలునకు, దేవ పితృకార్యములందు సన్యాసులకు భోజనము పెట్టనివానికి, అనుచితముగా ఓట్లు పెట్టువానికి, తనకు చేయు అధికారములేని పనులు చేయువానికిని, వృషభములు క్షుద్ర పశువుల పుంస్త్వమును చెడగొట్టినవానికిని, సాధారణ విషయములందు మోసముచేయు వానికిని, దాసీగర్భమును నశింప చేసినవానికిని నూరు పణముల దండము విధించవలెను. తండ్రి, కుమారుడు, సోదరి, సోదరుడు, దంపతులు, ఆచార్యుడు, శిష్యుడు, వీరిలో పతితుడుకాని వారినికూడ పరిత్యజించువారికి, నూరు పణముల దండము. ఇతరుల వస్త్రములను ధరించిన చాకలివానికి మూడు పణముల దండము. అమ్మివేసినను అద్దెకిచ్చినను కుదువపెట్టినను పది పణముల దండము. తుల (తక్కెడ) శాసనములు, కొలతలు, వీటిలో కపటము చేయువానికిని, నాణెములలో మోసముచేయువానికిని, వీటితో వ్యవహరించువానికిని ఉత్తమ సాహస దండము విధించవలెను. మంచి దానిని చెడ్డదనియు, చెడ్డ దానిని మంచిదనియు చెప్పు నాణక పరీక్షకునకు ప్రథమ సాహసదండము. జంతువుల విషయమున తప్పుడు వైద్యము చేయు వైద్యునకు ప్రథమ సాహసదండము. మనుష్యులకు చేసినచో మధ్యమ దండము. రాజ పురుషులకు చేసినచో ఉత్తమ దండము. బంధించ కూడని వానిని బంధించినను, బంధింపతగినవానిని విడిచిపెట్టినను అట్టి అధికారికి ఉత్తమ దండము. కొలతలోగాని, తూకములోగాని ఎనిమిదవ వంతు హరించినవానిచే ఇరువది రెండు పణములు ఇప్పించవలెను. అష్టమాంశము కన్న అధికము అయినను తక్కువైనను దండమును కూడ మార్చవలెను. మందులు, తైలములు, లవణము, గంధము, ధాన్యము, గుడము మొదలైన పణ్య వస్తువులలో తక్కువ రకము వస్తువు కల్పిన వానికి పదహారు పణముల దండము. కొందరు శిల్పులు కలిసి పనిచేయుచుమూల్యములో హ్రాసముగాని వృద్ధిగాని కల్పించినచో వారికి వేయిపణముల దండమును విధించవలెను. వ్యాపారులు రాజుచే ప్రతిదినము నిర్ణయింపబడిన మూల్యమునకే క్రయ విక్రయములు చేయవలెను. దానిలో వచ్చు లాభము వర్తకులకు చెందును. వర్తకులు స్వదేశమునందు లభించు పణ్యముపై (అమ్మే వస్తువు) నూటికి ఐదువంతులు విదేశీయ వస్తువులపై, నూటికి పదివంతులు లాభము తీసుకొనవచ్చును. ఇది వెంటనే అమ్ముడుబోవు వస్తువులకు వర్తించును. వర్తకము చేయుటలో కలుగు వ్యయమును పణ్యముపైవేసి అమ్మువారికి కొనువారికిని కూడ లాభము కలుగునట్లు మూల్యము నిర్ణయించవలెను.
పణ్యము మూల్యము తీసుకొని పణ్యమును గ్రాహకునకు ఇవ్వని వానిచే వృద్ధి సహితముగ ఇప్పించవలెను. గ్రాహకుడు విదేశము నుండి వచ్చినచో అతనికి ఆ దేశము నందు ఎంత లాభము వచ్చునో అంత ధనముతో ఇప్పించవలెను. గ్రాహకుడు కొన్న వస్తువును ఏకారణముచేతనైనా, తీసుకొన్నచో దానిని మరియొకనికి అమ్మవచ్చును. కాని దానిపై నష్టము వచ్చినచో అది (మొదటి) గ్రాహకుని నుండి తీసుకొనవలెను. రాజో పఘాతము చేతగాని, దైవోప ఘాతముచేతగాని పణ్యము పాడైపోయినచో ఆ నష్టమును గ్రామకుడు అడిగినను ఇవ్వని విక్రేతయే భరించవలెను. ఒకరికి అమ్మిన దానిని మరియొకనికి అమ్మినను, చెడ్డదానిని మంచిదని చెప్పి అమ్మినను దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. పణ్యముల లాభనష్టములు తెలియని వర్తకుడు ఏదైనా వస్తువును కొన్నపుడు వెనుకాడకూడదు. అట్లు చేసినచో ఆరవ వంతు దండము విధించవలెను. లాభముకోరి కొందరు వర్తకులు కలిసి వ్యాపారము చేయునపుడు వారు లాభాలాభములను, ద్రవ్యమును బట్టిగాని మొదట అనుకొనిన మాటను బట్టిగాని చేసుకొనవలెను. వారిలో ఒకరు మిగిలినవారి అనుమతి లేకుండగను, వారు నిషేధించినను లేదా తన ప్రమాదము వలనను వస్తువును పాడుచేసినచో ఆ నష్టమును అతడే భరించవలెను. వస్తువుల నిర్ణీత మూల్యములో ఇరువద భాగమును రాజు శుల్కముగా గ్రహించవలెను. రాజ నిషిద్ధమైన వస్తువుగాని, రాజయోగ్యమైన వస్తువునుగాని ఎవరైనా విక్రయించుచున్నచో, దానిని రాజు స్వాధీనము చేసుకొనవచ్చును. అసత్య పరిమాణమును చూపికాని, పన్ను తీసుకొను స్థానము నుండి తొలగిపోయిగాని, మోసముతోగాని క్రయ విక్రయములు చేయువానికి ఆ వస్తు మూల్యమునకు ఎనిమిది రెట్లు దండము విధించవలెను. కలిసి వ్యాపారము చేయువారిలో ఒకడు దేశాంతరము వెళ్ళినను మరణించినను ఆతని ద్రవ్యమును ఆతని దాయాదులు బంధువులు జ్ఞాతులు గ్రహించవలెను. వారెవ్వరులేనిచో రాజు గ్రహించవలెను. సంఘములోని ఒకడు వక్రముగ ప్రవర్తించినచో ఆతనికి లాభము పంచకుండగ పంపివేయవలెను. స్వయముగ వ్యాపారము చేయలేనివాడు ఇతరులచే చేయించవలెను. ఋత్విక్కులు, కర్షకులు, కర్మచారులు, వారి విషయములో కూడ ఇదే విధానము.
చోరుని అపహరించబడిన ధనమును బట్టిగాని, ఆతని పద చిహ్నములను బట్టిగాని రాజభటులు పట్టుకొనవలెను. పూర్వము అపరాధము చేసినవానిని, అశుద్ధమైన నివాసము కలవానిని, తమజాతి నామము, మొదలగు వాటిని కప్పిపుచ్చువారిని శంకచే బందీలుగా పట్టుకొనవచ్చును. ద్యూతము, స్త్రీ, పానము ఈ వ్యసనములు కలవారును ప్రశ్నించగ ఎండిపోయిన ముఖము గలవారును, కంఠస్వరము మారిపోయినవారును, ఇతరుల ద్రవ్యగృహాదులను గూర్చి ప్రశ్నించువారును, రహస్యముగ సంచరించువారును, ఆదాయము లేకున్నను వ్యయము చేయువారును, నష్టమైన ద్రవ్యములను అమ్మువారును చోరులుగా బంధింపబడవలెను. చౌర్యశంకచే పట్టుకొనబడిన వాడు తాను నిరపరాధియని నిరూపించు కొనజాలనిచో వానిచే అపహృత ద్రవ్యమును ఇప్పించి వానిని చీర దండముచే శిక్షించ వలెను. అపహృత ధనమును ఇప్పించి అనేక విధముల వానిని కొట్టించవలెను. చౌర్యము చేసినవాడు బ్రాహ్మణుడైనచో వాని నుదుట గుర్తువేసి రాజ్యమునుండి బహిష్కరించవలెను. గ్రామములో ఎవరినైన కొట్టినను, ధనము అపహరింపబడినను, అపరాధి జాడలు తెలియనపుడు అది గ్రామాధిపతి దోషము. ఆతడే చోరునిపట్టి రాజుకు అప్పచెప్పవలెను. చోరుడు ఏ గ్రామమునకు పారిపోయెనో అచ్చట వాని గుర్తుతెలిసి అతడు చౌర్యము చేసిన గ్రామము యొక్క అధిపతికి ఒప్పచెప్పవలెను. క్రోశుడు దూరమునకు బయటవున్న పంచ గ్రామాధి కారిగాని, దశగ్రామాధికారి గాని, అశ్వ గణాద్యపహారులకును ఇతరులను చంపినవారిని పట్టి శూలముపై గ్రుచ్చి చంపవలెను. ఏదైన వస్తువును ఎత్తుకొనిపోయిన వానికిని పెట్టెలు బ్రద్దలుకొట్టినవానికిని వరుసగ బొటనవ్రేలు, తర్జనీ ఖండించవలెను. ఆ అపరాధము రెండవసారి చేసినచో ఒక హస్తము, ఒక పాదము ఖండించవలెను. చోరునికి గాని, ఘాతకునకుగాని తెలిసికూడ భోజనము, అగ్ని, జలము, ఇతర ఉపకరణములు ఆలోచన, మార్గవ్యయము ఇచ్చినవానికి ఉత్తమ సాహస దండము విధించవలెను. ఇతరుల శరీరముపై ఆయుధము ప్రయోగించినను, గర్భపాతనము చేయించినను ఉత్తమ దండము. ఎవరినైన పురుషునిగాని, స్త్రీనిగాని చంపినపుడు వానికి ఉత్తమ సాహసదండము గాని, అధమ సాహస దండముగాని వాని శీలాచారములను బట్టి ఇవ్వవలెను. పురుషుని చంపిన స్త్రీని, విషమును ఇచ్చిన స్త్రీని మెడకు రాయికట్టి నీళ్లలో పడవేయవలెను.
విషము పెట్టిన దానికిని, దహనము చేసిన స్త్రీకిని, తనకు పూజ్యుడైనవారిని, సంతానమును చంపిన స్త్రీకిని, హస్తములు ముక్కు చెవులు ఖండించి ఎద్దులచే చంపించవలెను. పొలములను, గృహములను, వనములను, గ్రామములను వివీతములను, కళ్లములను కాల్చిన వారిని, రాజుభార్యను సంగము చేసినవారిని ఊకనిప్పుతో కాల్చి చంపవలెను. కేశగ్రహణ పూర్వకముగ పరస్త్రీని సంగ్రహించినవాడు స్వజాతియైనచో ఉత్తమ దండము, అనులోమ్యము అయినచో మధ్యమ దండము పొంద అర్హుడు. ప్రాతిలోమ్యము అయినచో పురుషుని చంపవలెను. స్త్రీకి చెవులు కోయవలెను. పరస్త్రీ యొక్క వస్త్రము కట్టుముడి స్తనములు, కంచుకం, నాభి కేశములను స్పృశించిన వానిని అనుచిత దేశకాలములందు సంభాషణము చేయువానిని, ఒకే ఆసనముపై కూర్చున్న వానిని, వ్యభిచార దోషమునకై దండించవలెను. వలదన్నను సంభాషణాదులు చేసిన స్త్రీకి నూరు పణములు, అట్టి పురుషునకు రెండు వందల పణములు దండము. నిషేధించినను వారిరువురును సంభాషణాదులు చేసినచో వ్యభిచారము చేసినచో ఎట్టి దండమో అట్టి దండము. పశు సంగమము చేసినవానికి నూరు పణముల దండము. నీచస్త్రీ సంగమము, గో సంగమము చేసినవానికి మధ్యమ సాహసదండము. కొనబడిన స్త్రీలు, దాసీ స్త్రీలు, ఉంచుకొన్న స్త్రీలు, గమ్యలగు స్త్రీలు, వీరితో సంగమము చేసిన పురుషునకు ఏబది పణముల దండము. బలాత్కరించి దాసీ సంగమము చేసినవానికి పదిపణముల దండము. అంత్యజాతి స్త్రీతోడను, సన్యాసి తోడను సంగమముచేసిన వాని లలాటమున భగచిహ్నముంచి దేశమునుండి పారద్రోల వలెను. రాజశాసనమును న్యూనముగాగాని, అధికముగాగాని వ్రాయువానికిని వ్యభిచారిని, చోరుని విడిచిపెట్టిన వానికిని ఉత్తమ సాహస దండము, బ్రాహ్మణునిచే అభక్షణములు తినుపించువానికి ఉత్తమ సాహస దండము. కల్తీ బంగారము అమ్మువానికిని చెడ్డ మాంసము అమ్మువానికిని అంగములు ఖండించి ఉత్తమ సాహస దండము విధించవలెను. సామర్థ్యమున్నను కోరలు, కొమ్ములుగల తన పశువులచే పీడింపబడుచున్నవానిని విడిపిం పని పశుస్వామికి ప్రథమ సాహసదండము. ఆక్రమించినవాడు ఏడ్చుచున్నను విడిపించనిచో రెట్టింపు దండము. చోరుడుకాని వానిని చోరుడని చెప్పినవానికి ఐదువందల పణముల దండము. రాజునకు అప్రియము పల్కువానికిని రాజనిందకులకును మరణించిన వాని శరీరమునందలి వస్తాదులను అమ్ము వానికిని గురువును కొట్టిన వానికిని రాజ మంత్రమును ప్రకటించినవానికిని నాలుకకోసి దేశమునుండి బహిష్కరించవలెను. రాజు యొక్క వాహనమున ఆసనమును కూర్చున్నవానికి మధ్యమ సాహస దండము. రెండు నేత్రములను పీకివేసిన వానికిని, రాజ శత్రువుల ఆజ్ఞను నిర్వహించువానికిని బ్రాహ్మణ వేషముతో జీవించు శూద్రునకు ఎనిమిది వందల పణముల దండము. న్యాయానుసారము పరాజితుడైనను, పరాజితుడనుకాను అని చెప్పుచు, వచ్చినచో వానిని మరల జయించి రెట్టింపు ధనము దండము విధించవలెను. రాజు అన్యాయముగ దండము విధించి, ధనము తీసుకొన్నచో దానిని వరుణునకు నివేదించి దానిని ముప్పది రెట్లుచేసి బ్రాహ్మణు లకు ఇవ్వవలెను. ధర్మ పూర్వకముగ, లోక వ్యవహారములు చూచు రాజునకు ధర్మము, అర్థము, కీర్తి లోకపంక్తి అర్థసంగ్రహము ప్రజా గౌరవము శాశ్వత స్వర్గ నివాసము అను ఏడు గుణములు లభించును. (258)
ఋగ్విధాన కథనము
అగ్నిదేవుడు పలికెను:
పుష్కరుడు పరశురామునకు చెప్పిన ఋగ్యజుః సామాథర్వ విధానమును చెప్పెదను. దీని ప్రకారము జప హోమములు చేసినచో భుక్తిముక్తులు లభించును. పుష్కరుడు పలికెను. ఒక్కొక్క వేదమునకు సంబంధించిన చేయవలసిన కర్మలను మీకు చెప్పెదను.
