అగ్ని మహా పురాణము

Table of Contents

సాధారణ ప్రతిష్ఠా విధానము

హయగ్రీవుడు పలికెను-ఇప్పుడు దేవ సముదాయ ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. ఇది కూడ వాసుదేవ ప్రతిష్ఠవలెనే చేయవలెను. ఆదిత్య, వసు, రుద్ర, సాధ్య, విశ్వేదేవ, అశ్వినీ కుమార, ఋషి, ఇతర దేవగణములకు దేవసముదాయము అని పేరు. వీరి స్థాపనలో నున్న విశేషములు చెప్పెదను. ఆయా దేవతల పేర్లలోని మొదటి అక్షరము గ్రహించి దానికి స్వరములు చేర్చవలెను. దీర్ఘ స్వరములతో కూడిన ఆ బీజాక్షరములతో అంగన్యాసము చేయవలెను. ఆ ప్రథమాక్షరమునకు బిందువు చేర్చి బీజముగ గ్రహింపవలెను. ప్రణవ నమస్కారములు చేర్చవలెను. సమస్త దేవతలను మూల మంత్రముతోడనే పూజించి స్థాపింపవలెను. ఇవికాక, స్థాపనా విషయమున అవలంబింపవలసిన నియమములను, వ్రతములను, కృచ్ఛ్రములను, మఠ, సేతు, గృహాదులను, మాసోపవాస, ద్వాదశీ వ్రతాదులను చెప్పెదను. ముందుగా శిలా, పూర్ణకుంభ, కాంస్య పాత్రలు తీసికొని వచ్చి ఉంచవలెను. పిమ్మట సాధకుడు బ్రహ్మ కూర్చ గైకొని “తద్విష్ణోః పరమం పదమ్” అను మంత్రముతో కపిలగోవుపాలతో యవచరువును వండవలెను. ఓంకారముతో దానిలో నేయిపోసి, గరిటెతో ఎనపవలెను. పిదప శ్రీవిష్ణు పూజచేసి హోమము చేయవలెను. వ్యాహృతి గాయత్రులతో కూడిన “తద్విప్రాసో” ఇత్యాది మంత్రముతో చరు హోమము చేయవలెను. “విశ్వతశ్చక్షుః” ఇత్యాది వైదిక మంత్రముతో భూమి, అగ్ని, సూర్య, ప్రజాపతి, అన్తరిక్ష, ద్యౌ, బ్రహ్మన్, పృథ్వీ, కుబేర, సోమ శబ్దములను చతుర్థ్యంతములు చేసి, వాటిని “స్వాహా” చేర్చి, ఆ దేవతలను ఉద్దేశించి ఆహుతులు ఈయవలెను. ఇంద్రాది దేవతలకు సంబంధించిన మంత్రములు చదువుచు ఆహుతులు ఇవ్వవలెను. చరు భాగములను ఈ విధముగ హోమముచేసి ఆదర పూర్వకముగ దిక్ బలులు ఈయవలెను.

పిదప నూట ఎనిమిది పలాశ సమిధలను హోమముచేసి, పురుష సూక్తముతో ఆజ్య హోమము చేయవలెను, “ఇరావతీధేనుమతీ” అను మంత్రముతో తిలాష్టక హోమము చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పార్షదులకు, గ్రహములకు, లోకపాలులకు, మరల ఆహుతులు ఈయవలెను. పర్వతనదీ సముద్రములకు కూడ హోమములుచేసి, మహా వ్యాహృతులను ఉచ్చరించుచు, స్రువముతో మూడు పూర్ణాహుతులు ఈయవలెను. పితామహా! ‘వౌషట్’ చేర్చిన వైష్ణవ మంత్రముతో పంచ గవ్యములను, చరువును ప్రాశనము చేసి, ఆచార్యునకు సువర్ణయుక్త తిలపాత్రము, వస్త్రములు, అలంకృతమగు గోవు దక్షిణగా నీయవలెను. “భగవాన్ విష్ణుః ప్రీయతామ్” అని పలుకుచు వ్రత విసర్జనము చేయవలెను.

ఇపుడు మరియొక మాసోపవాసాది విధిని చెప్పుచున్నాను. ముందుగా యజ్ఞముచే శ్రీహరిని సంతుష్టుని చేయవలెను తిల, తండుల, నీవార, శ్యామాకములతో, శ్యామాకములకు బదులు యవలతో వండిన వైష్ణవ చరువును నేతితో కలిపి మూర్తి మంత్రముతో హోమము చేయవలెను, పిమ్మట మాసాధిపతులైన విష్ణ్వాది దేవతలను ఉద్దేశించి మరల హోమము చేయవలెను. “విష్ణోరరాటమసి” అనుమంత్రముతోకూడ పండ్రెండు హోమములు చేయవలెను. “ఇరావతీ” ఇత్యాది మంత్రముతో పండ్రెండు చరు హోమములు చేయవలెను. “తద్విస్రాసః” ఇత్యాది మంత్రముతో ఘృత హోమములు చేయవలెను. పిదప శేషహోమము చేసి మూడు పూర్ణాహుతులు ఇవ్వవలెను. “యుఞ్జతే” ఇత్యాద్యనువాకమును చదువుచు, ప్రణవముతో రావి ఆకుల విస్తరిలో వడ్డించుకొని చరువును భక్షించవలెను. పిమ్మట మాసాధి పతులను ఉద్దేశించి పండ్రెండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. ఆచార్యుడు వారిలో పదమూడవవాడుగా ఉండవలెను. వారికి మధుర జలపూర్ణములగు పదమూడు కలశముల, ఉత్తమమైన ఛత్రము, పాదుకలు, వస్త్రములు, సువర్ణము, మాలలు దానము చేయవలెను. వ్రతపూర్తికి అన్ని వస్తువులు పదమూడు చొప్పున చేయవలెను. “గోవులు ప్రసన్నములగు గాక, సంతోషముతో అవిగోచరించుగాక, అని పలుకుచు గో పథమును (గోవులు మేయుటకు స్థానము) విడచి పదిహస్తముల ఎత్తైనయూప స్తంభము పాతవలెను. గృహస్తుడు ఇంటిలో హోమాది కార్యములన్నియు యథాశాస్త్రముగ జరిపి, పూర్వోక్త విధి అనుసారము గృహములో ప్రవేశించవలెను. అందరికిని, ఏ అడ్డులును లేకుండ అన్నదానము చేయవలెను. బ్రాహ్మణులకు యథాశక్తిగ దక్షిణలు ఈయవలెను. ఉద్యానమును నిర్మించువాడు చిరకాలము నందన ఉద్యానములో నివసించును. మఠ ప్రదానము చేయుటచే స్వర్గలోక ఇంద్ర లోకములు ప్రాప్తించును. ప్రపా(చలివెందలి) దానము చేసిన వాడు వరుణలోకము నందును, సేతు నిర్మాణము చేసినవాడు దేవలోకము నందును నివసించును. ఇటుకలతో సేతువు నిర్మించువాడు కూడ స్వర్గమును పొందును. గోపథమును నిర్మించువాడు గోలోకము పొందును. నియమములను వ్రతములను ఆచరించువాడు సాక్షాద్విష్ణు స్వరూపు డగును. కృచ్ఛ్ర వ్రతములు చేయువాడు సమస్త పాపములను నశింపచేసికొనును, గృహదానము చేసినవాడు మహాప్రళయము వరకును స్వర్గములో నివసించును. గృహస్థుడు శివాదిదేవతల సముదాయ ప్రతిష్ఠ చేయవలెను. (66)