అగ్ని మహా పురాణము

Table of Contents

వివిధ మంత్ర నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు వినాయక అర్చనను చెప్పెదను. ముందు ఆధారశక్తిని పూజించవలెను. ఆగ్నేయాది విదిక్కులందును పూర్వాది దిక్కులందును క్రమముగ ధర్మజ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యములను పూజించి కందనాల పద్మకర్ణికా కేసరములను సత్త్వాది గుణత్రయమును పద్మాసనమును పూజించవలెను. పిదప తీవ్రా, జ్వాలినీ, నందా, సుయశా, కామరూపిణీ, ఉగ్రా, తేజోవతీ సత్యా, విఘ్ననాశినీ యను తొమ్మిది శక్తులను పూజించవలెను. పిదప గణేశమూర్తిని, మూర్తి లభించనిచో ధ్యానోక్త గణపతిమూర్తిని పూజించి హృదయాద్యంగ పూజలు చేయవలెను. పూజా ప్రయోగ వాక్యములు ఈ విధముగా నుండును. ‘గణంజయాయ హృదయాయ నమః ఏకదంతాయ ఉత్కటాయ శిరసే స్వాహా అచల కర్ణినే శిఖాయై వషట్, గజ వక్త్రాయ హుంఫట్ కవచాయహుం, మహోదరాయ దండ హస్తాయ, అస్త్రాయ ఫట్ ఈ ఐదు అంగములలో నాల్గింటిని నాలుగు దిక్కులందును ఐదవ దానిని మధ్య భాగమునందును పూజించవలెను. పిదప గణంజయ, గణాధిప, గణనాయక, గణేశ్వర, వక్రతుండ, ఏకదంత, ఉత్కట, లంబోదర, గజవక్త్ర వికటాననులను పద్మ దళములపై పూజించవలెను. మధ్యభాగము హూం విఘ్న నాశనాయ నమః మహేంద్రాయ ధూమ్రవర్ణాయ నమః యని పలికి విఘ్ననాశన ధూమ్రవర్ణులను పూజించవలెను. బాహ్య ప్రదేశమున విఘ్నేశ్వరుని పూజించవలెను.

ఇపుడు త్రిపురాభైరవ పూజల విధిని చెప్పెదను. ఎనమండుగురు భైరవులను పూజించవలెను. అసితాంగ భైరవ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి, భీషణ సంహార భైరవులు అని వారల పేర్లు. బ్రాహ్మి మొదలగు మాతృకలనుకూడ పూజించవలెను. అకారాది హ్రస్వ స్వరముల బీజమును ఆదియందుంచి భైరవుల పూజ చేయవలెను. బ్రహ్మాది మాతృకలను అకారాది దీర్ఘాక్షరములు ఆది యందుంచి పూజించవలెను. ఆగ్నేయాది దిక్కులందు వటుకులను పూజించవలెను. సమయ పుత్రవటుక, యోగినీ పుత్రక సిద్ధపుత్ర వటుక, కులపుత్ర, వటుకులు వీరి పేర్లు. పిమ్మట హేతుక, త్రిపురాంత, అగ్నివేతాల అగ్నిజిహ్వ, కరాల కాలలోచన ఏకపాద భీమాక్షులను ఎనమండుగురు క్షేత్రపాలకులను పూజించి, త్రిపురాదేవి యొక్క ప్రేత రూప పద్మాసనమును పూజించవలెను. ఐం, క్లైం, ప్రేత పద్మాసనాయ నమః. ఓం, హైం, హ్రీం, అసౌః త్రిపురాయై ప్రేత పద్మాసన స్థితాయై నమః అను మంత్రముతో త్రిపురాభైరవిని పూజించవలెను. త్రిపురాదేవి వామహస్తములందు అభయ పుస్తకములను, దక్షిణ హస్తములందు వరముద్రా జపమాలికను ధరించి ఉండును. బాణ సమూహముతో నిండిన అంబులపొదిని ధనుస్సును ధరించి ఉండును. మూల మంత్రమును హృదయాది న్యాసము చేయవలయును. గో సమూహ మధ్యమున నిలిచి శ్మశానాది వస్త్రముపై చితిలోనే బొగ్గుతో అష్ణదళ కమల చక్రమును వ్రాయించవలెను. శత్రువు పేరును వ్రాసి మడత పెట్టి చితాభస్మముతో శత్రుమూర్తి నిర్మించి, అతడు దానియందు ఉన్నట్లు భావనచేసి పైన చెప్పిన యంత్రమును నల్లటి దారముతో చుట్టి ఆ మూర్తి పొట్టలో దూర్చవలెను. అపుడు ఆ వ్యక్తి నశించును.

‘ఓం నమో భగవతి జ్వాలామాలిని గృధ్ర గణ పరివృతే స్వాహా’ అను మంత్రమును జపించుచు యుద్ధమునకు వెళ్ళు వానికి జయము కలుగును. ఓం, శ్రీం, హ్రీం, క్లీం, శ్రియై నమః అను మంత్రముతో చతుర్దశ దళ కమలపై ఉత్తర దిక్క్రమమున గృణినీ సూర్యా, ఆదిత్యా ప్రభావతీ అను నలుగురు శ్రీదేవులను పూజించి ఈ శ్రీ మంత్రమును జపించుటచే శ్రీలభించును. ఈ శ్రీ దేవులం దరును సువర్ణగిరివలె సుందర కాంతి కలవారు. ఓం హ్రీం గౌర్యై నమః అను గౌరీ మంత్రముతో జప హోమ ధ్యాన పూజలు చేసిన వానికి సమస్తము లభించును. గౌరీదేవి శరీర కాంతి అరుణము, నాలుగు భుజములు ఉండును. దక్షిణహస్తమునందు పాశ, వరద ముద్రలను, వామహస్తములందు అంకుశ అభయ హస్తములను ధరించియుండును. శుద్ధ చిత్తముతో గౌరీదేవిని ప్రార్థించు వానికి నూరు వర్షముల ఆయుర్దాయముండును. చోరాది భయముండదు. యుద్ధ రంగమున ఈ మంత్రముతో అభిమంత్రించిన ఉదకమును త్రాగినచో వానిపై అధికకోపము కలవాడు కూడ ప్రసన్నుడగును. ఈ మంత్రముతో అంజనము తిలకము ధరించినచో వశీకరణము సిద్ధించును. జిహ్వపై దీనిని వ్రాసినచో కవిత్వ శక్తి లభించును. దీని జపముచే స్త్రీ పురుషులు వశమగుదురు. సూక్ష్మ ప్రాణులు కూడ చూడబడును. స్పర్శ మాత్రముచే మనుష్యులు వశమగుదురు. మంత్రముతో తిలలు హోమముచేసినచో సర్వ మనోరథములు సిద్ధించును. ఈ మంత్రముతో ఐదుపర్యాయములు అభిమంత్రించి అన్నమును భుజించు వాని యొద్ద సర్వ ధనముండును. దీని ప్రారంభమున లక్ష్మీ బీజమును (శ్రీం) వైష్ణవబీజమును (క్లీం) చేర్చినచో అది అర్ధనారీశ్వర మంత్రమగును. అనంగ రూపా మదనా, అనంగ మేఖలా అను శక్తుల నామ మంత్రములను జపించుటచే లక్ష్మి ప్రాప్తించును. కమల దళములపై హ్రీం, స్వరములు, కాది వ్యంజనములు వ్రాసి మధ్య అభీష్ట స్త్రీ నామధేయము వ్రాయ వలయును. షట్కోణ చక్రముపై గాని కలశముపై గాని వ్రాయవచ్చును. పిమ్మట ఆ స్త్రీని ఉద్దేశించి జపము చేసినచో వశీకరణమగును.

‘ఓం, హ్రీం, ఛూం నిత్య క్లిన్నే మదద్రవే ఓం ఓం’ అనునది ఆరు అంగముల మూల మంత్రము. ఎర్రటి త్రికోణ చక్రముపై అష్టదళ కమలమును భావించి దానిపై ద్రావిన్యాదులను పూజించవలెను. పూర్వాది దిక్కులందు, ద్రావిణి మొదలగు నలుగురు శక్తులను ఈశానాది కోణములందు అపర మొదలగు నాలుగు శక్తులను భావనచేసి పూజించవలెను. ద్రావిణీ, వామజ్యేష్ఠా ఆహ్లాదకారిణీ, అపరా, క్షోభిణీ, రౌద్రీ, గుణ శక్తి అనునవి ఈ శక్తుల పేర్లు. దేవిని ఈ విధముగా ధ్యానము చేయవలెను. రక్త వర్ణములగు వస్త్రాలంకారాదులను ధరించి రెండుహస్తములలో పాశాంకుశములను రెండు హస్తములలో కపాల కల్పవృక్షములను, రెండు హస్తములతో వీణను ధరించియుండును. నిత్యా అభయా, మంగళా, నవవీరా, సుమంగళా, దుర్భగా మనోన్మణీ ద్రాహ అను ఎనమండుగురు దేవులను మారాది దిక్కుల కమల దళములపై పూజించవలెను. వీటి బాహ్యభాగమున ఐదు దళములపై ఓం హ్రీం అనంగాయ నమః, ఓం హ్రీం స్మరాయ నమః, ఓం హ్రీం మన్మథాయ నమః, ఓం హ్రీం మారాయ నమః, ఓం హ్రీం కామాయ నమః అను ఐదుగురు కామధేవులను పూజించవలెను. వారి హస్తములలో పాశ, అంకుశ, ధనుస్సు బాణములు వున్నట్లు ధ్యానించవలెను. వీటి బాహ్య భాగమున పదిదళముల పై క్రమముగ రతి, విరతి, ప్రీతి, విప్రీతి, మతి దుర్మతి, ధృతి, విధృతి, తుష్టి, వితుష్టి యను కామ వల్ల భలను పూజించవలెను. ‘ఓం, భం నిత్య క్లిన్నే ఓం ఓం’ మొదలు ఓం భం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా వరకును మూలోక్తమైనది. నిత్యక్లిన్నా విద్యా. సింహాసనముపై ఆధార శక్తిని పద్మమును పూజించి దాని దళములపై హృదయా ద్యంగములను స్థాపించి పూజించి మధ్యకర్ణికపై దేవిని పూజించవలెను. ఓం హ్రీం, గౌరి, రుద్రదైతే యోగేశ్వరి హూం ఫట్ స్వాహా, ఇది గౌరీ మంత్రము. (313)