అగ్ని మహా పురాణము
కూపాది ప్రతిష్ఠా విధానము
హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇపుడు కూపములు, దిగుడుబావులు, చెరువులు ప్రతిష్ఠచేయు విధిని చెప్పెదను; శ్రీహరియే జలరూపముచే దేవశ్రేష్ఠుడైన సోముడుగాను, వరుణుడుగాను ఆయెను. ప్రపంచ మంతయు అగ్నీష్టోమమయము. జలరూపుడైన నారాయణుడు దానికి కారణము. బంగారముతో లేదా వెండితో లేదా రత్నములతో వరుణుని ప్రతిమ చేయించవలెను. వరుణదేవునకు రెండు భుజములతో, హంసారూఢుడై, నదుల తోడను, కాలువలతోడను కూడియుండును. ఆతని కుడి చేతిలో అభయముద్రయు, ఎడమచేతిలో నాగపాశము ప్రకాశించుచుండును. యజ్ఞ మండప మధ్య భాగమున కుండముతో ప్రకాశించు వేదిక నిర్మించి దాని తోరణమున పూర్వ ద్వారమున కమండల సహితముగా వరుణ కలశము స్థాపింపవలెను, భద్రకమున (దక్షిణ ద్వారమున)ను, అర్ధచంద్రమునను (పశ్చిమ ద్వారమునను), స్వస్తికమునను (ఉత్తర ద్వారమునను) వరుణ కలశములు స్థాపించవలెను. కుండమునందు అగ్న్యాధానముచేసి పూర్ణాహుతి ఇవ్వవలెను.
“యే తే శతం వరుణ” ఇత్యాది మంత్రముతో స్నానపీఠముపై వరుణుని స్థాపింపవలెను. మూల మంత్రమును ఉచ్చరించుచు, ఆచార్యుడు, వరుణదేవతాప్రతిమకు ఘృతము పూయవలెను. “శం నో దేవీ” ఇత్యాది మంత్రముతో ప్రక్షాళనముచేసి, “శుద్ధ వాలః”, “సర్వశుద్ధవాలః” ఇత్యాది మంత్రములతో, పవిత్ర జలముచే స్నానము చేయించవలెను. పిమ్మట స్నాన పీఠమునకు పూర్వాది దిక్కులందు కలశములను స్థాపించవలెను. తూర్పున ఉన్న కలశమున సముద్రజలము, ఆగ్నేయమున ఉన్న కలశమున గంగాజలము, దక్షిణ కలశమున వర్షాజలము, నైరృతి కలశమున సెలయేరు నీరు, పశ్చిమ కలశమున నదీజలము, వాయవ్యకలశమున కొండకాలువ నీరు, ఉత్తర కలశమున కాలువల నీరు, ఈశాన్య కలశమున తీర్థజలములను ఉంచవలెను. ఈ వివిధ జలములు లభించనిచో నదీజలమే ఉంచవలెను. ఈ అన్ని కలశములను “యాసాం రాజా” ఇత్యాది మంత్రముచే అభిమంత్రించవలెను. విద్వాంసుడైన పురోహితుడు “సుమిత్రియా” ఇత్యాది మంత్రముతో మార్జన నిర్మంథనములు చేయవలెను. “చిత్రం దేవానామ్” “తచ్చక్షుర్దేవహితమ్” అను మంత్రములతో తేనె, నెయ్యి, పంచదార అను మధురత్రయముచే నేత్రములను తెరవవలెను. ఆ సువర్ణమయ వరుణ ప్రతిమపై జ్యోతిస్సును పూజించి ఆచార్యునకు గోదానము ఈయవలెను.
“సముద్ర జ్యేష్ఠాః” ఇత్యాది మంత్రముతో పూర్వ కలశ జలముచేతను, “సముద్రం గచ్ఛ” ఇత్యాది మంత్రముతో ఆగ్నేయ కలశస్థిత గంగా జలముచేతను, “సోమో ధేనుమ్” ఇత్యాది మంత్రముతో దక్షిణ కలశ స్థితి వర్షా జలముచేతను, “దేవీరాప”, ఇత్యాది మంత్రముతో నైరృతి కలశ స్థిత నిర్ఝుర జలముచేతను, “పఞ్చ సద్యః” ఇత్యాది మంత్రముతో పశ్చిమ కలశస్థిత నదీజలము చేతను, “ఉద్భిద్భ్యః” ఇత్యాది మంత్రముతో ఉత్తర కలశ స్థితోద్భిజ్జ జలముచేతను, పావమానీ ఋక్కులతో ఈశాన్య కలశ స్థిత తీర్థ జలముచేతను వరుణునకు అభిషేకము చేయవలెను. పిమ్మట యజమానుడు “ఆపోహిష్ఠా” మంత్రముతో పంచగవ్యము లచేతను, “హిరణ్య వర్ణామ్” ఇత్యాది మంత్రముతో స్వర్ణజలముచేతను, “ఆపో అస్మాన్” అను మంత్రముచే వర్షాజలముచేతను, వ్యాహృతులతో కూపజలముచేతను, “ఆపో దేవీః” ఇత్యాది మంత్రముతో తడాగ జలముచేతను, తోరణమునందున్న వరుణ కలశ జలముచేతను వరుణునికి స్నానము చేయించవలెను. కొండ కాలువల జలము నింపిన ఎనుబది యొక్క కలశములలోని జలముచే “వరుణస్యోత్త మ్భనమసి” ఇత్యాది మంత్రము పఠించుచు స్నానము చేయించవలెను. “త్వంనో ఆగ్నే వరుణస్య” ఇత్యాది మంత్రముతో అర్ఘ్య ప్రదానము చేయవలెను. వ్యాహృతులను ఉచ్చరించుచు మధుపర్కమును, “బృహస్పతే అతి యదర్యో” ఇత్యాది మంత్రముతో, వస్త్రములను, “ఇమం మే వరుణ” ఇత్యాది మంత్రముతో పవిత్రకమును, ప్రణవ ముచ్చరించుచు, ఉత్తరీయమును సమర్పింపవలెను. వరుణసూక్తము పఠించుచు పుష్ప, చామర, దర్పణ, ఛత్ర, పతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, “ఉత్తిష్ఠ” అని పలికి లేవదీసి, ఆ రాత్రికి అధివాసము చేయించవలెను. “వరుణం వా” అను మంత్రముచే సన్నిధీకరణముచేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీకరణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. అగ్ని కుండమున సమిధలతో హోమము చేయవలెను. వైదిక మంత్రములతో గంగ మొదలగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్ని దిక్కులందునుయవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతుల చేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రము చేతను అభిమంత్రించి సూర్య, ప్రజాపతి, దివ్, అంతకనిగ్రహ, పృథ్వీ, దేహధృతి, స్వధృతి, రతి, రమతీ, ఉగ్ర, భీమ, రౌద్ర, విష్ణు, వరుణ, ధాతా, రాయస్పోష, మహేంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశ, అనంత, బ్రహ్మ, వరుణ నామములను చతుర్థీ విభక్తి అంతములుగాగల పదములను చేసి పలుకుచు అంతమున “స్వాహా” చేర్చి బలి ఇవ్వవలెను. “ఇదం విష్ణుః”, “తద్వి ప్రాసః” అను మంత్రములచే ఆహుతులను ఈయవలెను. “సోమో ధేనువు” ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతులు ఇచ్చి “ఇమం మే వరుణ” అను మంత్రముతో ఒక ఆహుతివ్వవలెను. ‘ఆపో హిష్ఠా’ ఇత్యాది మంత్రత్రయముతోను, “ఇమారుద్రా” ఇత్యాదిమంత్రముతోనుకూడ ఆహుతుల నీయవలెను.
పిమ్మట పది దిక్కులందును బలులు ఇచ్చి గంధ పుష్పాలతో పూజింపవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధ పుష్పాదులచేతను, సువర్ణ పుష్పాదుల చేతను పూజించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలెను. “వరుణస్య” ఇత్యాది మంత్రము చదువుచు, ఘృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరువేరుగ నూట ఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొనివచ్చి దానితో వరుణుని శిరస్సుపై అభిషేకముచేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్నియగు గౌరితో కూడిన వరుణుడు నదీ నదములతో పరివేష్ఠితుడై ఉన్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాన్నిధ్యకరణము చేయవలెను. పిమ్మట వరుణ దేవుని లేవదీసి మంగళద్రవ్యములతో గజ పృష్ఠాదులపై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణ మూర్తిని “అపో హి ష్ఠామ యో భువః” ఇత్యాది మంత్రము పఠించుచు మధుర త్రయయుక్తమగు కలశములో ఉంచి కలశసహితుడగు వరుణుని జలాశయ మధ్య భాగమునందు సురక్షిత రూపమున స్థాపింపవలెను.
పిమ్మట యజమానుడు స్నానముచేసి వరుణుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండ సంజ్ఞకమగు సృష్టిని అగ్ని బీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తినట్లు భావన చేయవలెను. జగమంతయు జలమయమైనది” అని భావనచేసి ఆ జలమునందు జలేశ్వరుడైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్యభాగమున వరుణదేవతా ధ్యానముచేసి అచట యూపమును స్థాపించవలెను. యూపము చతుష్కోణముగగాని, అష్ణకోణముగ గాని, గోలాకారముగ గాని ఉండుట మంచిది, పది మస్తముల పొడవు ఉండవలెను. దానిపై ఉపాస్యదేవతా చిహ్నములు ఉండవలెను. దానిని యజ్ఞమునకు ఉపయోగించు చెట్టుకఱ్ఱతో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారుఫలకము ఉంచవలెను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముల యూపము స్థాపింపవలెను. యజ్ఞ ప్రాంగణమున “యూప బ్రహ్మ’ ఇత్యాది మంత్రముతో యూపమును స్థాపించి, దానికి వస్త్రములు చుట్టబెట్టి, పై భాగమున పతాక ఏర్పరుపవలెను. దానిని గంధాదులతో పూజించి, జగత్తు కొరకై శాంతికర్మ చేయవలెను. ఆచార్యునకు భూమి, గోవు, సువర్ణము, జలపాత్రము మొదలగునవి దక్షిణగ ఇవ్వవలెను. ఇతర బ్రాహ్మణులకు గూడ దక్షిణలు ఇచ్చి, వచ్చిన వారికి భోజనము పెట్టవలెను. “బ్రహ్మ మొదలు తృణమువరకు లేదా కీటకము వరకు దప్పికొన్న వారికి అందరికిని ఈ తటాకములోనున్న జలముచే తృప్తి కలుగుగాక” అని పలుకుచు జలము విడిచిపెట్టి, జలాశయములో పంచగవ్యములు ఉంచవలెను. పిమ్మట “ఆపో హిష్ఠామ” ఇత్యాది ఋక్త్రయము పఠించుచు, బ్రాహ్మణులు సమకూర్చిన శాంతి జలమును, పవిత్ర తీర్థజలమును ఉంచి, బ్రాహ్మణులకు గోవృషభాది దానము చేయవలెను. ఎట్టి అడ్డులు చెప్పకుండగ అందరికిని అన్నదానము చేయు ఏర్పాట్లు చేయవలెను. ఒక్క జలాశయమును నిర్మించువాని పుణ్యము లక్ష అశ్వమేధయాగములు చేసిన వాని పుణ్యము కంటె వేయి రెట్లు అధికము. ఆతడు స్వర్గము చేరి విమానమునందు ఆనందించుచుండును. ఎన్నడును నరకమునకు వెళ్ళడు. జలాశయమునందు గోవులు మొదలగు పశువులు జలము త్రాగునుగాన దానిని నిర్మించినవాడు పాప వినిర్ముక్తుడగును. జలదానముచేసిన మానవుడు సకల దానములును చేసిన ఫలము పొంది స్వర్గమునకు వెళ్ళును. (64)
