అగ్ని మహా పురాణము

Table of Contents

శాలగ్రామ మూర్తి లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! సాలగ్రామాదులపై ఉండు హరిమూర్తులను గూర్చి చెప్పెదను. ఇది భోగ మోక్షములను ఇచ్చునది. ద్వారమునందు రెండు చక్రములతో నల్లని సాలగ్రామము వాసుదేవుడు. రెండు చట్రములున్న ఎఱ్ఱని సాలగ్రామము సంకర్షణుడు. చిన్న చక్రము, అనేక రంధ్రములును ఉన్న నీలవర్ణ సాలగ్రామము ప్రద్యుమ్నుడు. కమల చిహ్నము, గోళాకారము, పచ్చని రంగు, మూడు రేఖలు ఉన్నది అనిరుద్ధుడు. నాభియందు ఉన్నతమై, పెద్ద రంధ్రములతో నల్లగా ఉండునది, నారాయణుడు. కమల- చక్ర చిహ్నములు, పృష్ఠభాగమున రంధ్రము, బిందువు ఉన్న సాలగ్రామము పరమేష్ఠి. స్థూలమైన చక్రము మధ్య గదవంటి రేఖ ఉన్న శ్యామ వర్ణమగు సాలగ్రామము విష్ణువు, స్థూలచక్రము ఐదు బిందువులు ఉన్న కపిల వర్ణ సాలగ్రామము నృసింహుడు. శక్తి అను అస్త్రము గుర్తు, విషమములైన రెండు చక్రములు, మూడు స్థూల రేఖలు ఉన్న ఇంద్రనీలమణి వంటి రంగుగల సాలగ్రామము వరాహము. ఎత్తైన పృష్ఠ భాగము, గోళాకారమైన సుడి ఉన్న శ్యామవర్ణ సాలగ్రామము కూర్మము. అంకుశ రేఖలు, బిందువులు ఉన్న నీలవర్ణ సాలగ్రామము హయగ్రీవుడు. ఒక చక్రము, ఒక కమలము, పుచ్చాకారమైన రేఖలు ఉన్న, మణివలె ప్రకాశించు శాలగ్రామము వైకుంఠుడు. మూడు బిందువులతో, కంచువలె తెల్లగానుండు, పెద్ద ఆకారముగల సాలగ్రామము మత్స్యము. వనమాల, ఐదురేఖలుగల గోలాకారమైన సాలగ్రామము శ్రీధరుడు. చాల చిన్నదై, బిందువులనుండి, గోళాకారమైన నీల సాలగ్రామము వామనము. కుడి ప్రక్కహారరేఖయు, ఎడమప్రక్క బిందువులు ఉన్న శ్యామవర్ణమగు సాలగ్రామము త్రివిక్రముడు. సర్ప శరీర చిహ్నము, అనేక మూర్తులు ఉండి, చాలరంగులతో ప్రకాశించు సాలగ్రామము అనంతుడు-ఆదిశేషుడు. మధ్య భాగమున చక్రము, క్రింద సూక్ష్మ బిందువు ఉన్న స్థూలమగు సాలగ్రామము దామోదరుడు. ఒక చక్రమున్న సాలగ్రామము సుదర్శనము, రెండు చక్రములున్నది లక్ష్మీ నారాయణుడు, మూడు చక్రములున్నది అచ్యుతుడు లేదా త్రివిక్రముడు, నాలుగు చక్రములున్నది జనార్దనుడు, ఐదు చక్రములున్నది వాసుదేవుడు. ఆరు చక్రములున్నది. ప్రద్యుమ్నుడు, ఏడు చక్రములున్నది సంకర్షణుడు, ఎనిమిది చక్రములున్నది పురుషోత్తముడు, తొమ్మిది చక్రములున్నది నవవ్యూహము. పది చక్రములు ఉన్నది దశావతారమూర్తి పదకొండు చక్రములున్నది అనిర్ధుడు. పండ్రెండు చక్రములున్నది ద్వాదశాత్మ, అంతకంటె అధిక చక్రములున్నది అనంతుడు. (46)