అగ్ని మహా పురాణము
పాతాళ నృసింహ మంత్రం
ఓం క్షౌం నమో భగవతే నరసింహాయ, ప్రదీప్త సూర్యకోటి సమతేజసే వజ్రనఖదంష్ట్రాయుధాయ, స్ఫుటవికట వికీర్ణ కేసర సటాగ్ర ప్రక్షుభిత
మహార్ణవామ్భోదున్దుభినిర్ఘోషాయ, సర్వమన్త్రోత్తారణాయ, ఏహ్యేహి
భగవన్నరసింహ, పురుష, పరాపరబ్రహ్మ, సత్యేన స్ఫుర-స్ఫుర, విజృమ్బ
విజృమ్భ, ఆక్రమ-ఆక్రమ, గర్జ-గర్జ, ముఞ్చ-ముఞ్చ, సింహనాదాన్,
విదారయ-విదారయ, విద్రావయ-విద్రావయ, ఆవిశ-ఆవిశ, సర్వమన్త్ర
రూపాణి సర్వనమన్త్ర జాతీశ్చ హన-హన, ఛిన్ద, సంక్షిప-సంక్షిప,
సర-సర, (దర-దర) దారయ-దారయ, స్ఫుట-స్ఫుట, స్ఫోటయ-స్ఫోటయ, జ్వాలా
మాలాసంఘాతమయ, సర్వతోనన్త జ్వాలావజ్రాశనిచక్రేణ సర్వపా
తాలాన్ ఉత్సాదయ-ఉత్సాదయ, సర్వతోఽనన్త జ్వాల
వజ్రశరపఞ్ఞరేణ సర్వపాతాలాన్ పరివారయ-పరివారయ, సర్వపా
తాలాసుర వాసినాం హృదయాన్యాకర్షయ ఆకర్షయ, శీఘ్రం దహ
దహ, పచ-పచ, మథ-మథ, శోషయ, నికృన్తయ-నికృన్తయ,
తావద్యావన్మే వశమాగతాః పాతాళేభ్యః (ఫట్ సరేభ్యః) ఫట్ అసురేభ్యః, ఫట్
మన్త్రరూపేభ్యః ఫట్, మన్త్రజాతిభ్యః, సంశయాన్మాం భగవన్నరసిం
హరూప విష్ణో సర్వాపద్భ్యః సర్వమన్త్రరూపేభ్యో రక్ష రక్ష హుం ఫట్
నమో నమస్తే”.
(ఇది పాతాళ నృసింహ మంత్రము. దీనిని ఈ విధముగ జపించగనే సత్ఫలము లభించును. శత్రువులను, నాకు అపకారము చేయు అసురులు మొదలగువారిని, పరులు ప్రయోగించిన మంత్రములను నశింపచేయుము అని దీని తాత్పర్యము. మధ్యనున్న ‘హుం’ ‘ఫట్’ అనువాటికి ప్రత్యేకముగ అర్థమేమియు ఉండదు. కాని ఉచ్చారణ మాత్రము చేతనే అవి నశింపచేయుట అను అర్థమును సూచించును. ‘ఫట్’ అనుదానికి మారకాస్త్రమని పేరు.)
భావము: “ప్రకాశించుచున్న కోటి సహస్ర సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడును, వజ్రము వంటి నఖములు, కోరలు ఆయుధముగా కలవాడును, పైకి విడివడి లేచిన జూలుచేత క్షోభింపచేయబడిన మహాసముద్ర జలముచే ఏర్పడిన దుందుభి ధ్వని కలవాడును, సర్వమంత్ర ప్రయోగముల నుండి తరింప చేయువాడును అగు భగవంతుడైన నరసింహునకు నమస్కారము. భగవంతుడవైన నరసింహా! రమ్ము, రమ్ము. పురుషా! పరాపర బ్రహ్మరూపా! సత్యముచే ప్రకాశించుము, ప్రకాశంచుము. విజృంభించుము, విజృంభించుము. ఆక్రమించుము, ఆక్రమించుము. గర్జించుము, గర్జించుము. సింహనాదము చేయుము, చేయుము. చీల్చుము, చీల్చుము. పారద్రోలుము, పారద్రోలుము. ఆవేశించుము, ఆవేశించుము. సర్వ మంత్ర రూపములను, మంత్రజాతులను చంపుము, చంపుము. భేదించుము, భేదించుము. సంక్షేపించుము, సంక్షేపించుము. నడుపుము, నడుపుము. చీల్చుము, చీల్చుము. బ్రద్దలుకొట్టుము, బ్రద్దలుకొట్టుము. జ్వాలామాలా సముదాయ స్వరూపా! అంతటను వ్యాపించిన అనంతమైన జ్వాలలయొక్కయు, వజ్రములయొక్కయు, అశనులయొక్కయు సముదాయముచే పాతాళములు అన్నింటిని నశింపచేయుము, నశింపచేయుము. అంతటను వ్యాపించిన, అనంతమైన జ్వాలలచేతను, వజ్రములచేతను, శరపంజరముచేతను పాతాళములు అన్నింటిని చుట్టుముట్టుము. సర్వపాతాళములందు నివసించు అసురుల హృదయములను లాగుము, లాగుము. శీఘ్రముగ కాల్చివేయుము, కాల్చివేయుము. వండుము, వండుము. మథించుము, మథించుము. ఎండచేయుము, ఎండచేయుము. వారందరును నాకు వశమగునంతవరకు ఖండించుము, ఖండించుము. “పాతాలేభ్యః ఫట్, అసురేభ్యః ఫట్, మన్త్రరూపేభ్యః ఫట్, మంత్రజాతిభ్యః ఫట్” భగవంతుడవైన, నరసింహ రూపములో నున్న ఓ విష్ణూః! నన్ను సందిగ్ధ స్థితి నుండియు, సర్వాపదల నుండియు, సర్వమంత్ర రూపములనుండియు రక్షింపుము, రక్షింపుము. “హుం”, “ఫట్” నీకు నమస్కారము, నమస్కారము”.
ఇది శ్రీహరిరూపిణియగు నృసింహవిద్య, సర్వార్థములను ఒసగునది. త్రైలోక్య మోహన శ్రీ విష్ణుమూర్తి ప్రతిష్ఠ త్రైలోక్య మోహనమంత్ర సమూహముతో చేయవలెను. ద్విభుజ విగ్రహమునకు ఎడమ చేతిలో గద, కుడి చేతిలో అభయముద్ర ఉండవలెను. చతుర్భుజరూపమైనచో పై కుడిచేతిలో చక్రము, పై ఎడమచేతిలో పాంచజన్యము ఉండవలెను. ఈ విగ్రహముతో శ్రీపుష్టులను గాని, బలరామ-సుభద్రలను గాని స్థాపింపవలెను. శ్రీవిష్ణు, వామన, వైకుంఠ, హయగ్రీవ, అనిరుద్ధులను ప్రాసాదములోగాని, గృహములోగాని, మండపమునందుగాని స్థాపింపవలెను. మత్స్యాద్యవతాంములలో జలశయ్యపై స్థాపించి పరుండబెట్టవలెను. సంకర్షణ, విశ్వరూప, రుద్రమూర్తి లింగ, అర్ధనారీశ్వర, హరిహర, మాతృకాగణ, భైరవ, సూర్య, గ్రహ, వినాయకులను, ఇంద్రాదులచే సేవింపబడు గౌరిని, చిత్రజను, బలాబలవిద్యను కూడ ఈ విధముగనే స్థాపింపవలెను.
ఇపుడు నేను గ్రంథ ప్రతిష్టను దానిలేఖన విధానమును గూర్చి చెప్పెదను. ఆచార్యుడు స్వస్తిక మండలముపై శరయంత్రాసనము మీద నున్న లేఖ్యమును (వ్రాయదగిన దానిని), లిఖిత పుస్తకమును, విద్యను, శ్రీహరిని పూజించవలెను. పిదప యజమానుడు గురువును, విద్యను, శ్రీ మహావిష్ణువును, లేఖకుని పూజించవలెను. పిమ్మట పూర్వాభిముఖుడై పద్మినిని ధ్యానించి వెండి సిరాబుడ్డిలో నున్న సిరాలో ముంచి బంగారు కలముతో ఐదు శ్లోకములు దేవనాగరి లిపిలో వ్రాయవలెను. పిదప బ్రాహ్మణులకు యథాశక్తి భోజనము పెట్టి, దక్షిణ ఇవ్వవలెను, ఆచార్య, విద్యా, శ్రీ మహావిష్ణువులను పూజించి లేఖకుడు పురాణాదులను వ్రాయుట ప్రారంభింపవలెను. వెనుకటివలె మండలాదులపై ఈశాన్యము నందున్న అద్దము మీద పుస్తకము నుంచి, మొదట చెప్పినట్లుగనే కలశములచే తడపవలెను. పిదప యజమానుడు నేత్రములను తెరచి, ఆ పుస్తకమును శయ్యపై ఉంచవలెను. పిమ్మట దానిపై పురుష సూక్తవేదాదిన్యాసము చేయవలెను. ప్రాణప్రతిష్ఠా పూజా, చరుహోమములు చేసి, పూజించి, ఆచార్యుని దక్షిణాదులతో సత్కరించి బ్రాహ్మణ భోజనము ఏర్పరుపవలెను. అంతమున ఆ పుస్తకమును గృహము నందుగాని, దేవాలయము నందుగాని స్థాపించి పూజించవలెను. గ్రంథమును వస్త్రముతో ఆచ్ఛాదించి పాఠ ప్రారంభమునందును, అంతము నందును దానిని పూజించవలెను. పుస్తకమును చదువువాడు విశ్వశాంతి కలుగవలెనని సంకల్పించి ఒక అధ్యాయమును చదువవలెను. గురువు కుంభములోని జలముతో యజమానుడు మొదలగువారికి అభిషేకము చేయించవలెను. బ్రాహ్మణునకు పుస్తకదానము చేసినచో అనంతఫలము లభించును. గోదాన, భూదాన, విద్యాదానము అను మూడు దానములకును అతిదానములని పేరు. పాలు పిదుకుట, విత్తనములు చల్లుట అను పనులు చేయగనే ఆ దానములు చేసినవాడు నరకము నుండి ఉద్ధరింపబడును. సిరాతో వ్రాసిన పత్రములను దానము చేసినచో విద్యా దానఫలము లభించును. ఆ పత్రములెన్ని ఉన్నవో, అక్షరములెన్ని ఉన్నవో అన్ని వేల సంవత్సరములు దాత విష్ణులోకములో పూజింపబడును. పంచరాత్రము, పురాణములు, మహాభారతము దానముచేసినవాడు తన వంశములో ఇరువదియొక్క తరముల వారిని ఉద్ధరించి తాను పరమతత్త్వము నందు విలీనుడగును. (63)
