అగ్ని మహా పురాణము
అశ్వలక్షణ చికిత్సాకథనము
శాలిహోత్రుడు చెప్పెను:
సుశ్రుతా! అశ్వ లక్షణములను చికిత్సను చెప్పెదను. హీన దంతము, విదంతము, కరాలము, కృష్ణతాలుకము, కృష్ణజిహ్వము, యుగ్మజము, అజాతముష్కము రెండు డెక్కలుగలది. శృంగయుక్తము త్రివర్ణము, వ్యాఘ్రవర్ణము గర్దభవర్ణము, భస్మవర్ణము, సువర్ణ వర్ణము మూపు కలది శ్వేత్రము కలది, కాకులచే ఆక్రమింపబడునది ఖరసారము. వానరాక్షము కృష్ణగుహ్యము, కృష్ణసటము, కృష్ణ ప్రోథము, కఠోరరోమము తిత్తిరి తుల్యము, విషమాంగము, శ్వేతపాదము, ధృవావర్తములు లేనిది అశుభావర్తములు కలది అగు అశ్వమును త్యజించవలెను. ముక్కు మీద, ముక్కు దగ్గిర రెండేసి సుడులు శిరో వక్షస్థలము లందు రెండేసి, లలాట కంఠ దేశమునందు రెండేసి, ప్రాయణము నందు రెండు ఈ విధముగ పది సుడులు శుభకరములు. ఓష్ఠ ప్రాంతము నందును లలాటము నందును, కర్ణ మూలమునందున మెడ, ముందుకాళ్ళు కంఠము వీటి యందును సుడులు శ్రేష్ఠములు. ఇతర అంగములపై అశుభములు. చిలుక ఇంద్రగోపము, చంద్రుడు వీటితో సమానమైన కాంతి కలవియు కాక వర్ణములును, సువర్ణ వర్ణములును స్నిగ్ధములును యగు అశ్వములు సర్వదా ప్రశస్తములు. పొడవైన కంఠము లోపలికి చొచ్చుకొనిన నేత్రములు చిన్న చెవులు ఉండి చూచుటకు అందముగా ఉన్న గుర్రములుగల రాజు విజయాభి లాషను విడువవలెను. గుర్రములను గజములను పాలించుట శుభప్రదము, కాని ఉచిత పాలనము చేయనిచో దుఃఖ ప్రదమగును. లక్ష్మీ పుత్రులైన గంధర్వ అశ్వములు ఉత్తమ రత్నము. అశ్వము పవిత్రమగుటచే అశ్వమేధమున ఉపయోగ పడుచున్నది.
మధువుతో, గుడూచి, నింబ బృహతులు వీటి ముద్ద చేసి తినిపించినచో శిరః స్వేదము, నాశీ మొలము తొలగించును. హింగు పుష్కరమూలము శుంఠి ఆమ్ల వేతసము, పిప్పలి, సైంధవ లవణము వీటిని ఉష్ణ జలముతో ఇచ్చినచో శూల రోగము నశించును. శుంఠి అతి విషముస్త అనంత, బిల్వ, ములక్వాథమును త్రావించినచో అశ్వము యొక్క వివిధ అతిసార దోషములు నశించును. ప్రియంగు సారివలతో కాచిన మేక పాలు కలిపి తగినంత శర్కర వేసి త్రాగించినచో అలసట తీరును. అశ్వమునకు తొట్టి యందు తైలబస్తి ఇవ్వవలెను. లేదా కోష్టము నందు పుట్టిన శిరల వేధనము చేయవలయును. అట్లు చేసినచో దానికి సుఖము కలుగును. దాడిమ త్రిఫలా, వ్యోష గుడములను సమభాగములుగ గ్రహించి చేసిన పిండమును అశ్వమునకు తినిపించిన కాసదోషము నశించును. ప్రియంగు లోధ్ర మధువులతో కలిపిన యూష రసములుకాని, క్షీరమునుగాని, పంచ కోలాదికములు గాని ఇచ్చినచో కాసరోగ విముక్తి అగును. అన్ని విధముల ప్రస్కందములకును మొదట శోధనము మంచిది. పిమ్మట అభ్యంగ ఉద్వర్తన స్నేహ, వశ్య, వర్తికల ప్రయోగము చేయవలయును. జ్వరము వచ్చిన గుర్రమునకు పాలతో చికిత్స చేయవలయును. లోధ్రమూల కరంజమూల, మాతులుంగ, అగ్ని, నాగర, కుష్ఠ హింగు, వచా, రాస్నలతో చేసిన లేపము శోధను తొలగించును. గుర్రమును నిరాహారముగ వుంచి మంజిష్ఠామదుక, ద్రాక్ష, బృహతీ, రక్తచందన త్రపుషీ బీజమూల శృంగాటక కశేరుకములు కలిపిన కాచిన మేకపాలను చల్లార్చి శర్కర వేసి ఇచ్చినచో దానికి రక్త ప్రమేయము తొలగును.
మన్యా, హను గ్రీవలయందున్న నాడులు వాచినను గళగ్రహ రోగము వచ్చినను ఆయా స్థానములందు కటు తైలాభ్యంగము ప్రశస్తము. సాధారణముగ గళ గ్రహశోధ రోగములుగల దేశమునందే వచ్చును. పతక్పుష్పీచిత్రక సైంధవ సౌరసరస పిప్పల హింగువులతో నశ్యము ఇచ్చినచో అశ్వమునకు ఎన్నడును విషాదము కలుగదు. హరిద్రా జ్యోతిష్మతీ, పాఠా, కృష్ణా, కుష్ఠ, వచా, మధువులను గుడ గోమూత్రములతో కలిపి జిహ్వపై వ్రాసినచో జిహ్వా స్తంభము తొలగును. తిల, యజ్ఞ, హరిద్రా, నింబ పత్రములతో చేసిన ముద్దను తేనెతో ఉపయోగించిన వ్రణము శోధితమగును. ఘృతముతో ఉపయోగించినచో వ్రణము మారును. దెబ్బతగిలి తీవ్రవేదనతో కుంటు గుర్రములకు తైలముతో పరిషేక క్రియ చేసినచో ఆ బాధ తొలగును, వాత పిత్త కఫ దోషములచే కాని, కోపముచేగాని దెబ్బ తగిలి గాయపడినచో అది మానుటకు ఈ క్రింది చికిత్స చేయవలయును. అశ్వత్థ ఉదుంబర, ప్లక్ష, మధూక, వటములను అధిక జలముతో కలిపి చేసిన క్వాథము కొంచెము ఉష్ణముగవున్నచో వ్రణ శోధనము చేయవలను. శతాహ్వ, నాగర, రాస్నా, మంజిష్టా, కుష్ఠ, సైంధవ, దేవదారు వచా, ద్వివిధ హరద్ర, రక్త చందనముల స్నేహమును క్వాథముగ చేసి గుడూచి జలముతో గాని పాలతో గాని ఉద్వర్తనము బస్తి లేదా నశ్యము ఇచ్చినచో అన్ని లింగిత దోషములును పోవును నేత్ర రోగముగల అశ్వముయొక్క నేత్రాంతమున జలగను పట్టించి అభస్రావణము చేయవలయును. ఖదిర ఉదుంబర, అశ్వత్థ కషాయాలతో నేత్ర శోధము చేయవలయును.
యుక్తావలంబియగు అశ్వమునకు ధాత్రీదురాలభా, తిక్తపియంగు, కుంకుమ, గుడూచులను సమభాగముగ గ్రహించి, చేసిన కల్కము హితకరము, ఉపద్రవమునందు కర్ణ దోషమునందును శిలయందును శుష్క శోషమునందును, శీఘ్రహానికరమగు దోషము నందును వెంటనే వేధనము చేయవలయును. గోమయ మంజికాకుష్ఠ రజనీ తిల సర్భపములను, గోమూత్రమునందు నూరి మర్దనముచేసినచో దురదతగ్గును. శాలుక్వాథము చల్లబడిన పిమ్మట మధుశర్కరలు కలిపి ముక్కులో వేసి త్రాగించినచో రక్తపిత్తము నశించును. ప్రతి ఏడవ రోజునను అశ్వమునకు లవణము తినిపించవలెను. ఎక్కువ ఆహారము తిన్న అశ్వమునకు, శరదృతువునందు జీవనీయ గణమునకు చెందిన ద్రవ్యములను మధుమృద్వీకా శర్కర, పిప్పలీ, పద్మకములు కలిపి ప్రతిపానము చేయించవలెను. హేమంత ఋతువునందు వాయు విడంగ పిప్పలీధాన్య, శతాహ్వ, లోధ్ర, సైంధవ, చిత్రకముల ప్రతిపానము చేయించవలెను. వసంత ఋతువునందు లోధ్ర ప్రియంగు ముస్తా పిప్పలీ శుంఠీ మధువులతో కూడిన ప్రతిపానము కఫ నాశనము. గ్రీష్మ ఋతువు నందు ప్రియంగు పిప్పలీ లోధ్ర యష్టి శుంఠి గుడములతో కూడ మద్యము ప్రతిపానముగ ఇవ్వవలెను. వర్షఋతువునందు లోధ్ర కాష్ఠలవణ పిప్పలీ హింగు తైలములు ప్రతిపానముగ ఇవ్వవలెను. గ్రీష్మమునందు కలిగిన పిత్త ప్రకోపముచే పీడింపబడిన అశ్వమునకును శరత్కాలమున, రక్త ఘనత్వముతో బాధ పడుచున్న అశ్వమునకును వర్ష కాలమున భిన్న పురీషములుగల అశ్వమునకును ఘృతము త్రాగించ వలెను. కఫ వాతములు అధికమైనపుడు తైలము త్రాగించవలెను. స్నేహతత్వము అధికమగుటచే శరీరమునకు బాధ్య ఏర్పడిన అశ్వములకు విరూక్షణము చేయించవలెను. మజ్జిగతో భోజనము మూడు దినములు గంజి ఇచ్చినచో రూక్షణము అగును. శరత్ గ్రీష్మ ఋతువులందు ఘృతము, హేమంత వసంతములందు తైలము, వర్షాశిశిర ఋతువులందు ఘృతతైలములు రెండును ఇవ్వవలెను. స్నేహపానము చేయించిన గుర్రములకు గురువైననదియు, అభిష్యందియు అగు భోజనము వ్యాయామము స్నానము ధూపము వాయురహిత స్థానములు వర్జితము. వర్ష ఋతువునందు గుర్రమునకు ఒక పర్యాయము స్నానము పానము చేయించవలెను. దుర్దిన సమయమున కేవల పానము ప్రశస్తము. సమశీతోష్ణ ఋతువునందు రెండు పర్యాయములు పానము, ఒక పర్యాయము స్నానము మంచివి. గ్రీష్మ ఋతువునందు మూడు పర్యాయములు స్నానము ప్రతిపానము చేయించ వలయును. పూర్ణజలమునందు చాలసేపు నిలిపి స్నానము చేయించవలయును. గుర్రములకు ప్రతి దినము పొట్టులేని యవలు నాల్గు ఆఢకములు తినిపించవలెను. శనగలు, ధాన్యము, పెసలు, బటానీలు కూడ తినిపించవలెను. రాత్రింబవళ్ళు ఐదుశేర్ల పాలు త్రాగించవలయును. ఎండి పోయినచో ఎనిమిదిశేర్లు పొట్టువున్నచో నాలుగుశేర్లు ఇవ్వవలెను. దూర్వ పిత్తమును, యవలు కాసమును, పొట్టు కఫాధిక్యమును, అర్జునము శ్వాసను మానకందము బలక్షయమును తొలగించును. దూర్వలు తిను గుర్రమునకు వాతపిత్త కఫజములగు రోగములు, సన్నిహిత రోగములు కలుగవు. ఆస్తరణమువున్న ధూపధూపితమగు స్థానమున దానిని కట్టవలెను. అచట ఉపాయ పూర్వకముగ గట్టి ఉంచవలెను. అచట దీపమును ఉంచి స్థానమును సురక్షితము చేయవలయును. అశ్వశాల యందు మయూరములు మేకలు వానరములు, మొదలగు మృగములను ఉంచవలెను. (289)
