అగ్ని మహా పురాణము

Table of Contents

నక్షత్ర నిర్ణయము

పరమేశ్వరుడు పలికెను:

ప్రాణుల శుభాశుభ ఫలజ్ఞానము కొరకు నా క్షత్రిక పిండమును గూర్చి చెప్పెదను. (ఎవరి శుభాశుభ ఫలములను తెలిసికొనవలెనో ఆ మనుష్యుని బొమ్మ గీసి సూర్యుడున్న నక్షత్రము మొదలు మూడు నక్షత్రములు వాని శిరస్సుపైనను, ఒకటి ముఖముపైనను, రెండు నేత్రములందును, నాలుగు చేతులు, కాళ్ళమీదను, ఐదు హృదయము నందును, ఐదు మోకాళ్ళ మీదను వ్రాసి ఆయుర్వృద్ధి విచారము చేయవలెను. శిరస్సుపై ఉన్న నక్షత్రమున యుద్ధము చేసినచో రాజ్యము లభించును. ముఖమునందలి నక్షత్రమున సుఖము, నేత్రమునందలి నక్షత్రమున సుందర సౌభాగ్యము, హృదయము నందలి నక్షత్రమున ద్రవ్య సంగ్రహము, హస్తమునందలి నక్షత్రమున చౌర్యము, పాదమునందలి నక్షత్రములందు మార్గమందే మృత్యువు. ఈ విధముగ ఫలితములు తెలియవలెను. ఎనిమిది కుంభములను పూర్వాది దిక్కులందు ఎనిమిదింటి యందును ఉంచవలెను. ఒక్కొక్క కుంభమునందు మూడేసి చొప్పున ఎనిమిది కుంభములందును ఇరువది నాలుగు నక్షత్రములను ఉంచగా నక్షత్రములు మిగిలిపోవును. వీటికి ‘సూర్యకుంభములు’ అని పేరు. సూర్య కుంభము అశుభము. పూర్వాది దిక్కులందున్న కుంభముల మీది నక్షత్రములు శుభములు. ఇపుడు యుద్ధము నందు జయపరాజయముల వివేకము నిచ్చు సర్పాకార రాహుచక్రముల గూర్చి చెప్పెదను. ముందుగా ఇరువది ఎనిమిది చుక్కలు పెట్టవలెను. వాటిని మూడు మూడుగా విభజించగా ఎనిమిది విభాగములు వచ్చును. వాటిపై ఇరువది నాలుగు నక్షత్రములు గుర్తించగా నాలుగు నక్షత్రములు మిగిలిపోవును. వాటిపై రేఖ గీయవలెను. సర్పాకార చక్రమేర్పడును. రాహువున్న నక్షత్రమును పడగపై వ్రాయవలెను. ఆ నక్షత్రముతోడనే ప్రారంభించి క్రమముగా ఇరువదియేడు నక్షత్రములు వ్రాయవలెను. ముఖమునందున్న ఏడు నక్షత్రములలో యుద్ధము చేసినచో యుద్ధమునందు మరణము కల్గును. స్కంధము నందలి ఏడు నక్షత్రములందు యుద్ధముచేసినచో పరాజయము వచ్చును. పొట్టమీద నున్న ఏడు నక్షత్రములలో సమ్మానము, విజయము లభించును. కటి యందలి నక్షత్రములందు శత్రువుల హరణము జరుగును. పుచ్ఛమునందలి నక్షత్రములందు యుద్ధము చేయగా కీర్తి కలుగును. రాహుదృష్ట నక్షత్రమునందు మృత్యువు కలుగును. ఇపుడు సూర్యుడు మొదలు రాహువు వరకును గ్రహముల బలము వర్ణించెదను. రవివారమునందు మొదటిది మొదలు ఎనిమిదవ అర్ధప్రహరములకు వరుసగ సూర్య, శుక్ర, బుధ, సోమ, శని, గురు, కుజ, రాహువులు అధిపతులు. శని, సూర్య-రాహువులను యత్న పూర్వకముగ వృష్ఠగతులగునట్లు చేసికొని యుద్ధము చేయువాడు సైన్య సముదా యముపై విజయము సాధించును. ద్యూత, మార్గ, యుద్ధములందు జయము పొందును.

రోహిణి, ఉత్తరాత్రయము, మృగశిర-స్థిర నక్షత్రములు. అశ్విని, రేవతి, స్వాతి, ధనిష్ఠ, శతభిష క్షిప్ర నక్షత్రములు. యాత్రార్థి ఈ నక్షత్రములందు యాత్ర చేయవలెను. అనూరాధ, హస్త, మూల, మృగశిర, పుష్య, పునర్వసు నక్షత్రములు అన్ని కార్యములకు మంచిది. జ్యేష్ఠ, చిత్త, విశాఖ, పూర్వాత్రయము, కృత్తిక, భరణి, మఘ, ఆర్ద్ర, ఆశ్లేష దారుణ’ నక్షత్రములు. స్థిరకార్యములు స్థిర నక్షత్రములందు చేయవలెను. క్షిప్ర నక్షత్రములందు యాత్ర చేయవలెను. సౌభాగ్య కర్మలను మృదు నక్షత్రములందును, ఉగ్రకార్యములను ఉగ్ర నక్షత్రములందును చేయవలెను. దారుణ నక్షత్రములు భయంకర కార్యములకు ఉపయోగించును. కృత్తిక, భరణి, ఆశ్లేష, విశాఖ, మఘ, మూల, పూర్వాత్రయము అధోముఖ నక్షత్రములు, వీటిలో అధోముఖ కర్మ చేయవలెను. కూపము, తటాకము, విద్యాకర్మ, చికిత్స, స్థాపనము, నౌకానిర్మాణము, కూపవిధానము, గొయ్యి త్రవ్వుట, మొదలగు పనులు ఈ అధోముఖ నక్షత్రములందు చేయవలెను. రేవతి, అశ్విని, చిత్త, హస్త, స్వాతి, పునర్వసు, అనూరాధ, మృగశిర, జ్యేష్ఠ తిర్యఙ్ముఖ నక్షత్రములు. వీటియందు రాజ్యాభిషేకము, గజాశ్వములకు పట్ట బంధనము, తోటవేయుట, గృహ-ప్రాసాద నిర్మాణము, ప్రాకార నిర్మాణము, క్షేత్రము, తోరణ-ధ్వజ-పతాకాది స్థాపనము చేయవలెను. రవివారమున ద్వాదశి, సోమవారమున ఏకాదశి, మంగళవారమున దశమి, బుధవారమున తృతీయ, గురువారమునందు షష్ఠి, శుక్రవారము నందు ద్వితీయ, శనివారమున సప్తమి దగ్ధయోగములు. ఇపుడు త్రిపుష్కరములు చెప్పెదను.

ద్వితీయ, ద్వాదశి, సప్తములు; రవి, మంగళ, శని వారములు ఇవి త్రిపుష్కరములు. విశాఖా, కృత్తికా, ఉత్తర, ద్వయ, పునర్వసు, పూర్వభాద్రలు కూడా త్రిపుష్కరములు. అనగా పైన చెప్పిన వారములు, తిథులు, నక్షత్రములు కలిపినచో త్రిపుష్కర యోగము. ఈ యోగము నందు లాభము, హాని, విజయము, వృద్ధి, పుత్రజన్మ, వస్తు నాశము-ఇవి త్రిగుణములగును. అశ్విని, భరణి, ఆశ్లేష, పుష్యమి, స్వాతి, విశాఖ, శ్రవణము, పునర్వసు, దృఢ నేత్రములు. ఇవి దిక్కులను చూడగలవు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకు వెళ్ళిన మనుష్యుడు విశేష పుణ్యోదయము చేతనే తిరిగి వచ్చును. రెండు ఆషాఢలు, రేవతి, చిత్త, పునర్వసు ‘కేకర’ నక్షత్రములు. వీటిలో పోయిన వస్తువు ఆలస్యముగా దొరకును. కృత్తిక, మృగశిర, పూర్వాఫల్గుని, మఘ, మూల, జ్యేష్ఠ, అనూరాధ, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర చిపిటాక్షములు. వీటిలో పోయిన వస్తువు, యాత్రకై వెళ్ళిన వ్యక్తి కొలది ఆలస్యముగ తిరిగి వచ్చును. హస్త, ఉత్తరాభాద్ర, ఆర్ద్ర, పూర్వాషాఢ, అన్ధాక్షములు. వీటిలో పోయిన వస్తువు శీఘ్రముగనే లభించును. యుద్ధమేమియు చేయనవసరము ఉండదు. ఇప్పుడు నక్షత్రముల గండాంతమును చెప్పెదను. రేవతి చివరి నాలుగు దండములు గండములు, అశ్విని ప్రారంభము నందలి నాలుగు దండములు గండాంతరములు. ఈ నక్షత్రముల ఒక జాము సమయమును శుభ కార్యములందు ప్రయత్నపూర్వకముగ త్యజించవలెను. ఆశ్లేష చివర మఘ ప్రారంభమున నాలుగేసి దండములు రెండవ గండాంతము, భైరవీ! ఇప్పుడు తృతీయ గండాంతమును వినుము, జ్యేష్ఠా-మూలల మధ్య నున్న ఒక జాము చాల భయంకరమైనది. జీవించ నిచ్ఛగలవాడు. ఈ సమయమునందు ఏ శుభకార్యము చేయరాదు. ఈ సమయమున శిశువు పుట్టినచో తల్లిదండ్రులు మరణింతురు. (126)