అగ్ని మహా పురాణము

Table of Contents

ముద్రా లక్షణము

నారదుడు పలికెను:

దేవతాసాన్నిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్టబడిన అంజలి మొదటి ముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ. ఎడమచేతి పిడికిలిని బోటనవ్రేలు పైకి నిలచి ఉండునట్లును, (అంజలి) కుడిచేతి బొటన వ్రేలు వంచి బంధించినట్లును (వందని)ఉంచవలెను. అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి నిలచి ఉంచవలెను (హృదయానుగ). ఈ మూడును వ్యూహమునందు సాధారణ ముద్రలు, వరుసగా కనిష్ఠిక మొదలైన వాటిని విడువగా ఏర్పడిన ఏనిమిది ముద్రలు అసాధారణములు.

ఈ ఎనిమిది ముద్రలను పూర్వము చెప్పిన బీజములు ఎనిమిదింటికిని క్రమముగా వినియోగించవలెను. కనిష్ఠిక వరకునున్న మూడు వ్రేళ్ళను అంగుష్ఠముచేతవంచి, పైకి ఉండునట్లును, సమ్ముఖముగాను చేసి నవమ బీజమునకు వినియోగించవలెను. వామ హస్తమును తిరగదీసి మెల్లగా పైకి వంచవలెను. అది వరాహముద్ర. అంగములకు వరుసగా ఈ చెప్పబోవు ఎనిమిది ముద్రలు ఉపయోగించవలెను. వామ ముష్టియందు ఒక్కొక్క వ్రేలిని ముడిచి చూపవలెను. పూర్వముద్రను వంచవలెను. దక్షిణ హస్తమునందు కూడ ఇట్లే చేయవలెను. వామ ముష్టియందలి అంగుష్ఠము నిలచి ఉండును. ఈ విధముగా చేసినచో ముద్రాసిద్ధి కలుగును. (26)