అగ్ని మహా పురాణము

Table of Contents

యాత్రా మండల చింతా కథనము

పుష్కరుడు పలికెను: ఇప్పుడు రాజ ధర్మానుసారము అందరి యాత్రను గూర్చి చెప్పెదను. శుక్రుడు అస్తంగతుడైనపుడును, నీచస్థానములో నున్నపుడును, వికలాంగుడైనపుడును, శత్రురాశిలో సున్నపుడును, ప్రతికూల స్థానమునందున్నపుడును, యాత్ర చేయకూడదు. బుధుడు ప్రతికూల స్థానమునందున్నపుడును, దిక్కు అధిపతి గూడ ప్రతికూల స్థానమునందున్నపుడును యాత్ర చేయగూడదు. వైధృతి, వ్యతీపాత, నాగ, శకుని, చతుష్పాద, కింస్తుఘ్న యోగములందును, విపత్, మృత్యు, ప్రత్యరి, జన్మతారలందును, గండయోగము నందును, రిక్త తిథులందును యాత్ర చేయగూడదు.

ఉత్తర, పూర్వ దిక్కులును, పశ్చిమ-దక్షిణ దిక్కులను ఒక్కటేనని చెప్పబడినది. వాయవ్యము నుండి ఆగ్నేయము వరకును ఉండు పరిధి దండమును దాటి యాత్ర చేయగూడదు. భాను, సోమ, శనివారములందు యాత్ర చేయగూడదు. కృత్తిక మొదలు ఏడు నక్షత్ర సమూహములు తూర్పునందును మఘ మొదలు ఏడు నక్షత్రములు దక్షిణము నందును, అనూరాధ మొదలగు ఏడు నక్షత్రములు పశ్చిమమునందును ఉండును. ధనిష్ఠాదులగు ఏడు నక్షత్రములు ఉత్తరము నందుండును. పైన చెప్పిన నక్షత్రములు ఆయా దిక్కులకు ద్వారములు. ఆయా దిక్కులకు ఆ ద్వారములు అన్నియు ఉత్తమములు. ఇప్పుడు ఛాయా మానమును గూర్చి చెప్పెదను.

రవి వారమున ఇరువది, సోమవారమున పదునారు, మంగళవారమున పదునైదు, బుధవారమున పదమూడు, శుక్రవారమున పండ్రెండు, శనివారమున పదకొండు అంగుళముల ఛాయామానము చెప్పబడినది. ఇవి అన్ని కర్మలకును విహితములు. జన్మలగ్నము నందును ఎదుట ఇంద్రధనుస్సు ఆవిర్భవించినపుడును యాత్ర చేయగూడదు. శుభశకు నాదులు కనబడిన పిమ్మట శ్రీమహావిష్ణువును స్మరించుచు యాత్ర చేయవలెను.

పరశురామా! ఇప్పుడు మండల విచారమును గూర్చి చెప్పెదను. సర్వవిధముల రాజును రక్షించవలెను. రాజు, మంత్రి, దుర్గము, కోశము, దండము, మిత్రులు, జనపదము-ఇవి రాజ్యము యొక్క సప్తాంగములు. ఈ సప్తాంగ రాజ్యమునకు విఘాతము కలిగించు వారిని సంహరించవలెను. రాజు తన మండలములను అన్నింటిని వృద్ధి పొందించుకొనవలెను. అన్నింటికంటె తన మండలము మొదటిది. ఆ మండలమునకు సామంత రాజులే శత్రువులు. ‘విజిగీషు’ వగు రాజునకు తన మండలమునకు ఎదటి సీమ (సరిహద్దు) యందున్న సామంతుడు శత్రువు. ఆ శత్రువు రాజ్యముతో ఎవనికి సరిహద్దు ఉన్నదో అతడు ఆ శత్రువునకు శత్రువగుటచే విజిగీషువునకు మిత్రుడు, ఈ విధమున విజిగీషుని మండలమునకు ఎదుట శత్రువు, మిత్రుడు, అరిమిత్రుడు, మిత్రమిత్రుడు, అరిమిత్రమిత్రుడు అని అయిదుగురు ఉందురు. ఇపుడు వెనుకనున్న వారిని గూర్చి వినుము. వెనుకనున్న వారిలో మొదటివాడు ‘పార్జ్షిగ్రాహుడు’. వాని వెనుకనున్న వాడు ‘ఆక్రందుడు’. ఆ ఇద్దరి వెనుకనున్నవాడు ‘ఆసారులు’ వారిని వరుసగా ‘పార్జ్షిగ్రహాసారుడు’ ‘ఆక్రందాసారుడు’ అని చెప్పుదురు. విజిగీషువైన రాజు శత్రువుయొక్క ఆక్రమణము ఉన్నను, లేకపోయినను ఆతని విజయమును గూర్చి నిశ్చితముగ ఏమియు చెప్పవీలుపడదు. విజిగీషువు, శత్రువు వీరిరువురును అసంఘటితులై యున్నపుడు వారి నిగ్రహానుగ్రహములందు సమర్థుడగు తటస్థుడైన రాజు ‘మధ్యస్థుడు’. ఈ ముగ్గురి విషయమున నిగ్రహానుగ్రహ సమర్థుడగు రాజు ఉదాసీనుడు. ఎవ్వడును ఎవ్వనికిని శత్రువుకాదు; మిత్రుడు కాదు. అందరును కారణవశముచే పరస్పరము శత్రువులగుదురు, మిత్రులగుదురు. ఈ విధముగ పండ్రెండు రాజమండలములను గూర్చి చెప్పితిని.

కుల్యడు, అనంతరుడు కృత్రిముడు అని శత్రువులు మూడు విధములు. వీరిలో పూర్వ పూర్వుడు అధిక శత్రువు అనగా కృత్రిమునికంటె అనంతరుడు, అతని కంటె కుల్యుడు ప్రబలులు. కుల్యుని అణచుట చాల కష్టము. నా అభిప్రాయమున అనంతర శత్రువు కూడ కృత్రిముడే. పార్ష్ణిగ్రాహుడు శత్రువుకు మిత్రుడు. అయినను ప్రయత్నించినచో అతడు శత్రువునకు శత్రువు కూడ కావచ్చును. అందుచే వివిధోపాయములచే తన సరిహద్దులోగల రాజును తన వశములో ఉంచుకొనవలెను. మిత్రునిచే శత్రువును నశింప చేయుట మంచిదని ప్రాచీన నీతిశాస్త్రవేత్తల అభిప్రాయము. సామంతుడు (సీమానివాసి) అగుటచే మిత్రుడు కూడ మున్ముందు శత్రువు కావచ్చును. అందుచే విజయముకోరు రాజు, శక్తి ఉన్నచో స్వయముగానే శత్రువును నశింపచేయవలెను. ఎందువలన మంత్రి, అనగా మిత్రుని ప్రతాపము పెరిగిపోయినచో అతని నుండి కూడ భయము కలుగవచ్చును. ప్రతాపహీనుడైన శత్రువు నుంచి కూడ భయముండదు. విజిగీషువైన రాజు ధర్మవిజయ కావలెను. ప్రజలలో ఎవ్వరికిని ఉద్వేగము కలుగకుండునట్లు చూచుకొనుచు విశ్వాసము కలిగించి, తన వశములో నుంచుకొనవలెను. (233)