అగ్ని మహా పురాణము

Table of Contents

అష్టమీ వ్రతములు-I

అగ్ని దేవుడు పలికెను:

ఇప్పుడు అష్టమీ తిథియందు జరుపబడు వ్రతములను వర్ణింతును. వాటిలో మొదటిది రోహిణీ యుక్త అష్టమీ వ్రతము. భాద్రపద కృష్ణ పక్షమున రోహిణీ యుక్తాష్టమీ తిథియందు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు అవతరించెను. అందుచే ఈ అష్టమి జయంతిగా చెప్పబడుచున్నది. ఆ దినమున ఉపవాసము చేయువాడు సప్త జన్మ కృతపాపముల నుండి విముక్తుడగును. భాద్రపదమున, రోహిణీ యుక్తాష్టమీ తిథియందు ఉపవాస ముండి శ్రీకృష్ణుని పూజించవలెను. ఇది భుక్తి ముక్తి ప్రదము, ‘నేను శ్రీకృష్ణ, బలరామ, దేవకీ, వసుదేవ, యశోదా, గోవులను ఆవాహనచేసి పూజించుచున్నాను. మీ అందరికిని నమస్కారము. యోగస్వ రూపుడు యోగపతి, యోగీశ్వరుడు అగు శ్రీకృష్ణునకు నమస్కారము. యోగమునకు ఆదికారణ భూతుడును, ఉత్పత్తి స్థానమును అగు గోవిందునకు అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను’. ఇట్లు ఆవాహనము చేసి శ్రీకృష్ణునకు స్నానము చేయించి-‘యజ్ఞేశ్వరా! యజ్ఞరూపా! యజ్ఞాధిపతీ! యజ్ఞాది కారణభూతుడా! గోవిందా! నీకు మాటిమాటికిని నమస్కారము’ అని అర్ఘ్యదానము చేయవలెను. దేవా! నీకు ప్రియమైన సుగంధ యుక్తములగు ఈ పుష్పములను స్వీకరింపుము. దేవతలచే పూజింపబడినవాడా! నా కోరికల సన్నింటిని తీర్పుము. నీవు సదాధూపముచే ధూపితుడవు, నేను సమర్పించిన ఈ ధూపముచే నీవు ధూప సుగంధమును గ్రహింపుము. నన్ను సర్వదా ధూప సుగంధ సంపన్నుని చేయుము’ అని చెప్పుచు పుష్పధూపములు సమర్పించవలెను. ‘ఓ ప్రభూ! నీవు సర్వదా దీపమువలె దీపించుచుందువు. దీపమునకు కాంతి నిచ్చువాడవు. నేను ఇచ్చిన ఈ మహాదీపమును స్వీకరించి నన్నుకూడ దీపమువలె ఊర్ధ్వగతి కలవానిని చేయుము. విశ్వరూపా, విశ్వపతీ, విశ్వేశ్వరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారము; నమస్కారము, విశ్వమునకు ఆదికారణభూతుడైన శ్రీ గోవిందునకు నేను ఈ దీపము నిచ్చుచున్నాను’ అని చెప్పుచు దీపము సమర్పించవలెను. ‘ధర్మ స్వరూపుడును, ధర్మాధిపతియు, ధర్మమునకు ఆదిస్థాన భూతుడును అగు వాసుదేవునకు నమస్కారము. గోవిందా! నీవిపుడు శయనింపుము. సర్వరూపుడు, సర్వాధిపతి, సర్వేశ్వరుడు, సర్వాధికారణభూతుడు అగు గోవిందునకు మాటిమాటికిని నమస్కారము’ అనిచెప్పుచు శయనింపచేయవలెను. ‘క్షీర సముద్రము నుండి పుట్టినవాడవును, అత్రినేత్ర సముద్భూతుడవును, తేజః స్వరూపుడవును అగు ఓ శశాంకా! రోహిణీ సహితుడవై నేను ఇచ్చు అర్ఘ్యము గ్రహించుము’ అని చెప్పుచు చంద్రునకు అర్ఘ్య ప్రదానము చేయవలెను. పిదప భగవద్విగ్రహమును వేదికపై స్థాపించి, చంద్రసహిత రోహిణీ పూజ చేయవలెను. అర్ధరాత్రి యందు గుడ-ఘృతమిశ్ర క్షీరధారలతో వసుదేవ, దేవకీ, నంద, యశోదా, బలరాములకు అభిషేకము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారికి దక్షిణగా వస్త్ర సువర్ణాదుల నీయవలెను. జన్మాష్టమీ వ్రతము చేయువాడు పుత్రానందము పొంది విష్ణులోక నివాసియగును. పుత్ర ప్రాప్తిని కోరి ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయువాడు పున్నామనరక విముక్తుడగును. ‘హే ప్రభూ! నాకు పుత్రులను, ధనమును, ఆయుస్సును, ఆరోగ్యమును, సంతతిని ఇమ్ము, గోవిందా! నాకు ధర్మ, కామ, సౌభాగ్య, స్వర్గ, మోక్షములను ఇమ్ము’ అని ప్రార్థించవలెను. (183)