అగ్ని మహా పురాణము
సుందరకాండ
హనుమంతుడును, అంగదాదులును సంపాతి మాటలు విని, సముద్రమును చూచి “ఈ సముద్రమును దాటి ఎవరు మనలను అందరిని జీవింపచేయగలరు?” అని అనుకొనిరి.
కపులు జీవించుటకును, రామ కార్యము సిద్ధించుటకును నూరుయోజనముల విస్తారము గల సముద్రమును హనుమంతుడు లంఘించెను.
సముద్రము నుండి పైకి లేచిన మైనాక పర్వతమునుచూచి, సింహికను చంపి, లంకనుచూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురము నందును, కుంభ, కుంభకర్ణ, విభీషణ, ఇంద్రజిత్తుల గృహములందును, ఇతర రాక్షసుల గృహములందును, పానభూమి మొదలగు ప్రదేశములందును కూడ సీతను చూడజాలకపోయెను. అపుడు ఆ హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనమునకు వెళ్ళి శింశుపా వృక్షమును ఎక్కి దాని క్రింద రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న సీతను, “నా భార్యవు కమ్ము” అని పలుకుచున్న రావణుని, అందులకు నిరాకరించుచున్న సీతను, “రావణునికి భార్యవు అగుము” అని చెప్పుచున్న రాక్షస స్త్రీలను చూచెను.
రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతుడు “దశరథుడు అనెడు రాజు ఉండెను. అతని శ్రేష్ఠులైన పుత్రులు రామలక్ష్మణులు అరణ్యమునకు వెళ్ళిరి. రాముని భార్యవైన సీతయగు నిన్ను, రావణుడు బలాత్కారమున అపహరించెను. సుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పంపెను. ఆనవాలుతో కూడిన, రాముడు ఇచ్చిన ఉంగరమును గ్రహింపుము” అని చెప్పెను.
సీత వృక్షము మీద ఉన్న వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొని ఉన్న ఆతనితో “రాముడు జీవించి ఉన్నచో నన్నేల తీసికొని వెళ్ళుటలేదు?” అని ప్రశ్నించెను. ఈ విధముగ శంకించుచున్న ఆమెతో హనుమంతుడు
“ఓ సీతాదేవీ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇప్పుడు తెలిసికొని, సేనాసహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ! విచారించకుము. ఆనవాలుతో కూడినది ఏదైన నాకు ఇమ్ము.” అని పలికెను. అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చెను. “నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవునట్లు చేయుము” అని చెప్పెను. ఆతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, “ఓ శోక వినాశకుడా! తిరిగి వెళ్ళుము” అని పలికెను.
హనుమంతుడు ఆ కథ విని, మణిని తీసికొని, ఇట్లు పలికెను. “ఓ శోభన స్వభావముగల దేవీ! నీ భర్త రాగలడు. లేదా, నీకు తొందర ఉన్నచో నా వీపుపైన ఎక్కుము. ఇప్పుడే నీకు సుగ్రీవ సహితుడైన రాముని చూపించెదను. ఆ మాటలువిని సీత హనుమంతునితో- “రాముడే నన్ను తీసికొని వెళ్ళుగాక” అని పలికెను.
అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే హనుమంతుని బంధించి రావణునికి చూపెను. “నీవు ఎవ్వడవు?” అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లు అనెను. “నేను రాముని దూతను. సీతను రామునకు ఇచ్చి వేయుము. ఇవ్వకున్నచో, లంకలో ఉన్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు” రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను. ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి, సీతను చూచి నమస్కరించి, సముద్రముదాటి వచ్చి, ‘సీతను చూచితిని’ అని అంగదాదులతో చెప్పెను. అంగదారులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి “సీతను చూచితిమి” అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో
“నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్పమన్నది? మన్మథాగ్నిలో పడి ఉన్న నన్ను సీతా కథామృతముచే తడుపుము” అని అనెను. ఈ విధముగా రామ కథను నారదుడు చెప్పుచు “రామా! సముద్రము లంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన మణిని తీసికొనుము. ఆ రావణుని సంహరించి సీతను పొంద గలవు. దుఃఖింపకుము” అని హనుమంతుడు రామునితో పలికెను అని నారదుడు చెప్పెను.
అటు పిమ్మట రాముడు ఆ మణిని గ్రహించి, సీతావిరహముచే దుఃఖితుడై ఏడ్చెను. “మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సీతవద్దకు తీసికొని వెళ్ళుము, ఆమెను విడచి జీవింపజాలను’’ అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి. పిమ్మట వారందరు సముద్ర తీరముచేరిరి. రావణుని తమ్ముడైన విభీషణుడు “సీతను రామునకు ఇచ్చి వేయుము” అని రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు ఆతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రాముని వద్దకు వెళ్ళెను.
రాముడు మిత్రుడైన విభీషణుని లంకా రాజ్యమునందు అభిషిక్తుని చేసెను. మార్గమిమ్మని సముద్రుని ప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అప్పుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకు వచ్చి “నాపై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా’! అని సముద్రుడు పలికెను. వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువు పై రాముడు వానరులతో సముద్రమును దాటి సువేల పర్వతముపై నిలిచి, లంకను చూచెను. (9)
