అగ్ని మహా పురాణము

Table of Contents

దిక్పాలాది స్నాన కథనము

అగ్నిదేవుడు పలికెను:

పరశురామ ఇపుడు సకల కార్యసిద్ధిని ఇచ్చు శాంతికరమగు స్నానమును గూర్చి చెప్పెదను వినుము. గృహములకు, శ్రీమహావిష్ణువునకు నదీతీరమున స్నానము చేయించవలెను. జ్వరపీడాదులు కలుగునపుడు, వినాయక గ్రహబాధ కలిగినపుడును దేవాలయము నందు స్నానము చేయించవలెను. విద్య కోరువాడు జలాశయమునందు కాని, ఇంటిలో కాని స్నానము చేయవలెను. విజయము కోరువాడు తీర్థజలమున స్నానము చేయవలెను. గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీని పుష్కరిణిలో స్నానము చేయించవలెను. పుట్టిన వెంటనే శిశువులు మరణించు స్త్రీకి అశోకవృక్ష సమీపమున స్నానము చేయించవలెను. రజోదర్శనము కోరు స్త్రీలు పుష్పములతో నిండిన వనము నందును, పుత్రులను కోరు స్త్రీలు సముద్రమునందును, సౌభాగ్యమును గోరు స్త్రీలు, గృహమునందును స్నానము చేయవలెను. పైన చెప్పిన వారందరును విష్ణు ప్రతిమ సమీపమున స్నానము చేయవలెను. శ్రవణ, రేవతి, పుష్య నక్షత్రములందు అందరికిని స్నానము ఉత్తమము. కామ్యస్నానము చేయువారికి ఒక సప్తాహము ముందుగనే ఉత్సాదనము విధింపబడినది. పునర్నవ, గోరోచనము, శతాంగము, గురుణి, బెరడు, మధూకము, రెండు విధములగు పసుపు, తగరము, నాగకేసరము, అంబరి మంజిష్ఠ, జటామాంసి, యాసకము కర్దమము ప్రియంగువు, తెల్లఆవాలు, కుష్ఠము, బలబ్రాహ్మి కుంకుమము, సక్తువులు కలిపిన పంచగవ్యములు వీటితో శరీరము నలుచుకొని, స్నానము చేయవలెను.

పిమ్మట తామ్ర పత్రముపై పద్మమండలము నిర్మించి దాని కర్ణికయందు, విష్ణువును పూజించవలెను. దాని కుడి భాగమున బ్రహ్మను, ఎడమప్రక్క శివుని పూర్వాది దిగ్గళము లందు ఆయుధ పరివారాది సహితులగు దిక్పాలకులను ఉంచి పూర్వాది దిశలందును, ఆగ్నేయాది విదిశలందును ఎనిమిది స్నాన మండలములు నిర్మించవలెను. ఆ మండలములపై ఆయుధ సహితులగు విష్ణు, బ్రహ్మ, శివ, ఇంద్రాదులను పూజించి, వారి నుద్దేశించి హోమము చేయవలెను. ఒక్కొక్క దేవతకు నూట యెనిమిది ఆహుతులు సమిధలతోను తిలలతోను, ఘృతముతోను ఇవ్వవలెను. పిదప భద్ర, సుభద్ర, సిద్ధార్థ, పుష్టివర్ధన అమోఘ చిత్రభాను, పర్జన్య, సుదర్శనములను యెనిమిది కలశలములను స్థాపించి వాటిపై, అశ్విని, రుద్ర, మరుద్గణ, విశ్వేదేవ దైత్య, వసుదుర్గా, మునులను ఇతర దేవతలను ఆవాహన చేసి ‘మీరందరును ప్రసన్నులై ఈ కలశములపై ఉండుడు’ అని ప్రార్థించవలెను. ఆ కలశలలో జయంతి, విజయ, జయ, శతావరి, శతపుష్ప, విష్ణుక్రాంత, అపరాజిత, జ్యోతిష్మతి, అతిబల చందన, ఉశీర, కేసర, కస్తూరి, కర్పూర, వాలక, పత్రక, త్వచ జాతీఫల, లవంగములను, మృత్తికను, పంచ గవ్యములను వేయవలెను. పిమ్మట బ్రాహ్మణులు సాధ్యుడగు మనుష్యుని దేవతలకు వేరువేరుగా హోమములు చేయించవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువునకు దక్షిణ ఇవ్వవలెను. పూర్వము బృహస్పతి ఇంద్రునకు అభిషేకము చేయించగ, ఆతడు దైత్యులను చంపెను. ఇంతవరకు విజయాదికమును ఇచ్చు దిక్పాలస్నానమును చెప్పితిని. (265)