అగ్ని మహా పురాణము

Table of Contents

అథర్వవిధానము

పుష్కరుడు పలికెను:

పరశురామా! సామ విధానము చెప్పబడినది. ఇప్పుడు అథర్వ విధానమును చెప్పెదను. శాంతాతీయ గణమును ఉద్దేశించి హోమము చేసినచో మానవుడు శాంతిని పొందును. బహషజ్య గణమును ఉద్దేశించి హోమము చేసినవాడు సమస్త రోగములను తొలగించు కొనును. ఆసప్తీయ గణమును ఉద్దేశించి ఆహుతులనిచ్చువాడు సకలపాప విముక్తుడగును. అభయ గణమునకు హోమము చేసినవానికి ఎచటను భయము ఉండదు. పరశురామా! అపరాజిత గణమునకు హోమము చేసిన వానికి పరాజయము ఉండదు. ఆయుష్య గణమునకు హోమము చేసిన వానికి అపమృత్యు భయముండదు. స్వస్త్యయన గణమునకు హోమము చేసినవాడు అంతటను మంగళములు పొందును. శర్వవర్మ గణమునకై హోమము చేయువాడు శ్రేయస్సు పొందును. వాస్తోష్పత్య గణమునకు హోమము చేయువాడు వాస్తు దోషములను తొలగించును. రౌద్ర గణమునకు హోమము చేయుటచే సకల దోషములు నశించును. క్రింద చెప్పబోవు పదునెనిమిది విధములగు శాంతులతో పది గణములకు హోమము చేయవలెను. వైష్ణవీ, ఫోంది, బ్రాహ్మి, రౌద్రి, వాయవ్య, వారుణి, కౌబేరి, భార్గవి, ప్రాజాపత్య, త్వాష్ట్రి, కౌమారి, ఆగ్నేయి, మారుద్గణి, గాంధర్వి నైఋతికి, ఆంగీరసి, యామ్య ఈ పదునెనిమిది కోరికలను తీర్చు పార్థివ శాంతులు.

‘యస్తావం మృత్యుం’ అను మంత్రమును జపించినచో మృత్యువు నశించును. ‘సుపర్ణస్త్వా’ (4-63) అను మంత్రముచే హోమము చేసినవానికి సర్పబాధ వుండదు. ‘ఇంద్రేణ దత్తో’ (2-2-94) అను మంత్రము సమస్త కామసిద్ధికరము. ‘ఇంద్రేనా దత్తమ్’ అను మంత్రము సమస్త బాధా వినాశకరము. ‘ఇమాయాదేవి’ (2-10-4) అను మంత్రము సర్వశాంతికరము. ‘దేవామరుతః! అను మంత్రము సకల కామప్రదము. ‘యమస్యలోకాత్’ (19-56-1) అను మంత్రము దుస్పష్న నాశనమున శ్రేష్ఠము. ‘ఇంద్రశ్చ పంచ వణిజః’ అను మంత్రము వర్తకములో లాభము కలిగించును. ‘కామోమేవాజి’ అను మంత్రముతో హోమము చేసిన స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగును. ‘తుభ్యమేవ జవీమన్’ (2-28-1) అను మంత్రము వెయ్యిసార్లు జపించి దశాంశ హోమము చేసి పిదప ‘ఆగ్నే గోభిర్నః’ అను మంత్రముతో హోమము చేసినచో మేధాశక్తి పెంపొందును. ‘ధ్రువంధ్రువేణ’ (7-84-1) అను మంత్రముతో హోమము చేసినచో ఉత్తమ స్థానము లభించును. ‘అలక్త జీవేతిశునా’ అను మంత్రము కృషిలో లాభము కలిగించును. ‘అహంతే భగ్నః’ అను మంత్రము సౌభాగ్య వర్ధకము. ‘యేమేపాశాః’ అను మంత్రము బంధనము నుండి విముక్తి కలిగించును. ‘శపత్వహన్’ అను మంత్రముతో జప హోమములు చేసినవాడు శత్రువులను నశింపచేయ కలుగును. ‘త్వముత్తమ’ అను మంత్రము యశస్సును బుద్ధిని వృద్ధి పొందించును. ‘యదామృగాః’ ఈ మంత్రము స్త్రీల సౌభాగ్యము పెంపొందించును. ‘యేనచేహది శంచైవ’ అను మంత్రము గర్భమునిచ్చును. ‘అయంతే యోనిః’ (3-20-1) అను మంత్రము పుత్రలాభకరము. ‘శివశ్శివాభిః’ అను మంత్రము సౌభాగ్య వర్ధకము. ‘బృహస్పతిర్నః పరిపాతు’ (7-51-1) అను మంత్రమును జపించుటచే మార్గమున క్షేమము కలుగును. ‘ముంచా మిత్వా’ అను మంత్రము అపమృత్యు నివారకము. అథర్వశీర్షమును పఠించువాడు సమస్త పాప విముక్తుడగును. కొన్ని ప్రధానమంత్రములచే సాధింపతగిన కర్మలను నీకు చెప్పితిని. పరశురామ! యజ్ఞోపయుక్తములగు వృక్షములు, వృక్షములసమిధలు అన్నిటి కంటెను ముఖ్యమైన హవిస్సు. ఘృతము, ధాన్యము, తెల్లని ఆవాలు, అక్షింతలు (అక్షతలు) తిలలు, దధి, దుగ్ధము, కుశలు, దూర్వలు, బిల్వములు, ఈ ద్రవ్యములు కూడ శాంతిపుష్టి కరములు. తైలము, కణములు, రాజికలు, రక్తము, విషము, కంటక యుక్త సమిధలు వీటిని అభిచార ప్రయోగమునందు ఉపయోగించవలెను. మంత్రముల ఋషి, దేవతా, ఛందో, వినియోగములు తెలిసినవాడే ఆయా మంత్రములతో ఆయా కర్మలను చేయవలెను. (262)