అగ్ని మహా పురాణము

Table of Contents

నారసింహాది మంత్ర కథనము

అగ్నిదేవుడు చెప్పెను:

స్తంభనము, విద్వేషణము, ఉచ్ఛాటనము, ఉత్పాదనము, బ్రమణము, మారణము వ్యాధి అనునవి క్షుద్ర అభిచారిక కర్మలు. వాటిని తొలగించు ఉపాయములు చెప్పెదను వినుము. “ఓం నమో భగవతే” మొదలు “ఠఠ” వరకును వున్న మూలోక్త మంత్రమును శ్మశానమున రాత్రియందు మూడు లక్షలు జపించి చితాగ్నియందు ధూర్త సమిధలతో హోమముచేసిన, శత్రువు సర్వదా తిరిగి పోవును (భ్రాంతుడగును). హేమ బేదికతో శత్రు ప్రతిమచేసి మంత్రముతో అభిమంత్రించిన బంగారు సూదితో కంఠమునందుగాని, హృదయమునందు గాని, ఆ ప్రతిమను గుచ్చినచో శత్రువు మరణించును. లేదా గాడిద వెంట్రుకలు చితాభస్మ బ్రహ్మ దండి మర్కటి వీటిని భస్మము చేసి దానిని పై మంత్రముతో అభిమంత్రించి ఉత్పాదన ప్రయోగము చేయువాడు శత్రువు ఇంటిపై గాని, శిరస్సుపై గాని చల్లవలెను. భృగు(స), ఆకాశ(హ), దీప్త (దీర్ఘాకార యుక్త రేఫ సహిత భృగు(స) అనగా సహస్రా మరల ర వర్మ (హుం) ఫట్ వీటిని కలిపి మంత్రము “సహస్రార హుం ఫట్” యని అగును. దీని అంగన్యాసములు ఈ విధముగా చేయవలయును. ఆ చక్రాయ స్వాహా అని హృదయము విచక్రాయ శిరస్సు. శిఖా చక్రాయయని కవచము, విచక్రాయయని నేత్రము సుచక్రాయయని అస్త్రము జ్వాలా చక్రాయయని పూర్వము వలెను న్యాసము చేయవలెను. అంగన్యాస పూర్వకముగ జపించిన సుదర్శనము క్షుద్ర అభిచారములను గ్రహములను తొలగించి అన్ని మనోరథములను సఫలము చేయును. ఆ సుదర్శన మంత్రము యొక్క ఆరు అక్షరములను క్రమముగా శిరో నేత్ర ముఖ హృదయ గుహ్య చరణములందు న్యాసము చేయవలెను. చక్రస్వరూపుడగు విష్ణువును ఈ విధముగా ధ్యానించవలెను.

చక్రాకారముననున్న కమలమునందు కూర్చున్నవాడు అగ్ని సమానమగు కాంతి కలవాడు కోరలుగలవాడు చతుర్భుజుడు, శంఖ చక్ర గదా పద్మ శలా కాంకుశ చాపములు ధరించినవాడు పింగవర్ణ కేశములు నేత్రములు కలవాడు, అరములచే వ్యాపింపబడిన మూడు లోకములు కలవాడు. చక్రనాభి ఆ అగ్నిచే వ్యాప్తమై ఉన్నది. వ్యాధులు గ్రహములు నశించును. చక్రము పీతవర్ణమైనది. అరములు రక్త వర్ణములు. అరమధ్య భాగము శ్యామవర్ణము. చక్రనేమి శ్వేతవర్ణము. దానియందు బయటనుండి పార్థివమగు కృష్ణవర్ణ రేఖ ఉండును. అరయుక్త మధ్య భాగమునందు అకారాది వర్ణములుండును. ఈ విధముగా రెండు చక్ర చిహ్నములను వ్రాయవలెను.

అది చక్రముపై కలశ జలమును తీసుకొని వెళ్ళి తమ సమీపముననే ఉంచి దక్షిణమున నున్న రెండవ చక్రముపై సుదర్శనమును పూజించి అగ్నియందు వరుసగా ఆజ్య, అపామార్గ, సమిధ, అక్షత, తిల, సర్షప, పాయస, గోఘృత, మూల హోమము చేయవలయును. ఒక్కొక్క ద్రవ్యముతో వెయ్యి హోమముల చొప్పున చేయవలెను. విద్వాంసుడు ప్రత్యేక ద్రవ్యము యొక్క హోమము చేయగా మిగిలిన భాగమును కలశము నందు ఉంచి ఒక ప్రస్థము అన్నముతో చేసిన పిండమును ఆ కలశములో వేసి విష్ణ్వాది దేవతలకై ఇవ్వవలసిన వస్తువులను అచటనే దక్షిణమునందు ఉంచవలెను. పిదప సర్వశాంతి కొరకు విష్ణు జనులకు నమస్కారము. వారు శాంతికొరకై ఈ ఉపహారమును గ్రహింతురు గాక. వారికి నమస్కారము అను మంత్రమును చదివి హుత శిష్ట జలముతో బలి సమర్పించవలెను.

ఏదైనా కాష్ఠ ఫలకముపై గాని కలశమునందు గాని, పాల చెట్టు కర్రతో చేసిన దధి పూర్ణ పాత్రము నందుగాని పలు వస్తువులను ఉంచి అన్ని దిక్కులందును సమర్పించవలెను. పిదప ద్విజులచే దిక్కులయందు హోమములు చేయించవలెను. దక్షిణా సహితముగా ఇట్లు హోమద్వయము చేసినచో సకల భూతాదులు నశించును. పెరుగు పూసిన ఆకులపై వ్రాసిన మంత్రాక్షరములతో హోమము చేసినచో క్షుద్ర రోగములు నశించును. దూర్వలతో హోమము ఆయుర్దాయమును, పద్మములతో హోమము ఐశ్వర్యమును, ఉదుంబరుల హోమము పుత్రులను, గోష్ఠమునందు ఘృతముతో హోమము గోవృద్ధిని, సకల వృక్ష సమిధలచేత చేసిన హోమము బుద్ధి వృద్ధిని ఇచ్చును. “ఓం క్షౌ” మొదలు “హూంఫట్” వరకును ఉన్న మూలోక్త నారసింహ మంత్రము సకల పాపములను నివారించును. జపాదులు చేసినచో క్షుద్రాభిచారములు గ్రహములు మారి విషము, ఆమయము తొలగును. చూర్ణము చేసిన మండూకవసతో హోమము చేసినచో జలస్తంభ అగ్ని స్తంభనలు చేయును. (306)