అగ్ని మహా పురాణము

Table of Contents

ఆగ్నేయ అంశకాది వర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

రుద్రాక్ష కటకమును ధరించవలెను. రుద్రాక్షల సంఖ్య విషమముగా ఉండవలెను. అవి సమములుగను దృఢములుగను ఉండవలెను. ఏకముఖమును గాని, త్రిముఖమును గాని, పంచముఖమును గాని, యథాలాభముగా ధరించవచ్చును. ద్విముఖ చతుర్ముఖ షణ్ముఖ రుద్రాక్షలు కూడా ప్రశస్తములే. బ్రద్దలగుట కాని పురుగు తొలుచుట కాని కలుగుటచే క్షతములు కాకూడదు. వాటి పై కంటకము లుండవలెను. దక్షిణ భుజ శిఖాదులపై చతుర్ముఖ రుద్రాక్షను ధరించవలెను. అట్లు చేయుటచే ఆ బ్రహ్మచారి బ్రహ్మచారియగును. అస్నాతకుడు కూడ స్నాతకుడు అగును. లేదా శివ మంత్రముతో పూజించి సువర్ణ అంగుళీయకమును కుడిచేత ధరించవలెను. శివ శిఖాజ్యోతి సావిత్రములు ఈ నాలుగును గోచరములు. గోచరమునకు కులముయని అర్థము. దీక్షితుడు దీనిని లక్ష్యము కొనవలెను. ప్రాజాపత్య మహీపాల కపోత గ్రంథికులు శివకులమునకు చెందినవారు. కుటిల వేతాల పద్మహంసలు శిఖాకులమునకు చెందినవారు. ధృతరాష్ట్ర బక, కాక, గోపాలులు జ్యోతి కులమునకు చెందినవారు. కుటికా సాఠర, గుటికా దండులు సావిత్రీ కులమునకు చెందిన వారు. ఈ విధముగా ఒక్కొక్క కులమున నాలుగేసి భేదములున్నవి.

ఉత్తమ మంత్రసిద్ధినిచ్చు సిద్ధాది అంశములను చెప్పెదను. కూటయంత్ర రహితములగు మాతృకాక్షరములను నేలపై వ్రాయవలెను. యంత్రాక్షరములను వేరువేరుచేసి అను స్వారమును వేరుచేయవలెను. సాధకుని నామమునందలి అక్షరములను కూడా చేయవలెను. మంత్రము యొక్క ఆద్యంతాది అక్షరములందు సాధకుని నామాక్షరములు చేర్చి సిద్ధము సాధ్యము సుసిద్ధము అరియను సంజ్ఞలను అనుసరించి, అక్షరములను క్రమముగా లెక్కపెట్టవలెను. మంత్రము యొక్క ఆద్యంతములందు సిద్ధము ఉన్నచో అది నూటికి నూరుపాళ్ళు సిద్ధిదాయకము. ఆద్యంతములందు సిద్ధి కలది వెంటనే సిద్ధిని ఇచ్చును. ఆద్యంతములందు సుసిద్ధమున్నచో ఆ మంత్రమును కూడ సిద్ధముగ గ్రహించవలెను. ఆద్యంతములందు అరి ఉన్నచో ఆ మంత్రమును పరిత్యజించవలెను. సిద్ధము అనునవి కూడ తుల్యములే. మంత్రముయొక్క ఆద్యంతాక్షరము లందు సిద్ధమున్నచో మధ్య వేలకొలది అరి అక్షరములున్నను దోషకారకము కాదు. మాయ బీజము, ప్రాసాద బీజము ప్రణవము వీటి యోగముచే విఖ్యాత మంత్రమునందు క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రాంశకములు ఏర్పడును. బ్రహ్మాంశకము బ్రహ్మ విద్య యనియు, విష్ణ్యంశకము వైష్ణవమనియు రుద్రాం శకము వీరమనియు చెప్పబడును. ఇంద్రాంశక మంత్రము ఈశ్వర ప్రియము. నాగాంశ మంత్రము నాగములవలె స్తబ్ధ నేత్రము. యక్షాంశ మంత్రము భూషణప్రియము, గంధర్వాంశ మంత్రము, అతి గీతాది ప్రియము, భీమాంశ, రాక్షసాంశ, దైత్యాంశ మంత్రములు యుద్ధకారకములు. విద్యాధరాంశ మంత్రము అభిమానదము. పిశాచాంశ మంత్రము మాలాక్రాంతము. మంత్రమును పూర్తిగా పరీక్షించి ఉపదేశము చేయవలెను. ఏకాక్షర మంత్రము మొదలు అనేకాక్షర మంత్రముల వరకు చివర ఫట్ చేర్చినచో అది మంత్రమని చెప్పబడును. ఏబది అక్షరముల వరకువున్న మంత్రము ‘విద్య’. ఇరువది అక్షరముల వరకు ఉన్నది ‘బాలావిద్య’. ఇరువది అక్షరముల వరకు ఉన్న అస్త్రాంత మంత్రము ‘రుద్ర’. అంతకుమించి మూడు వందల అక్షరముల వరకు వున్న మంత్రమునకు వృద్ధయని పేరు. మంత్రములలో ‘అ’ కారము మొదలు ‘హ’ కారము వరకు వున్న అక్షరములు ఉండును. మంత్రములందు క్రమముగా శుక్ల, కృష్ణ పక్షములుండును. అనుస్వార విసర్గలు విడిచి స్వరములు పది. హ్రస్వ స్వరములు శుక్లపక్షము. దీర్ఘ స్వరము కృష్ణపక్షము. ఇవియే ప్రతిపదాది తిథులు. శాంతి కార్యములను ఉదయ కాలమునందును, వశీకరణ కర్మలను భ్రమిత కాలము నందును ద్వేషణ ఉచ్చాటన కర్మలను భ్రమిత కాలమునందు సంధ్యా ద్వయము నందును స్తంభన కర్మలను సూర్యాస్తమయ కాలమునందును చేయవలెను. ఇడానాడి చరించునపుడు శాంతికకర్మలు పింగళానాడి చలించునపుడు ఆకర్షణ కర్మలు చేయవలెను. విషమతలమున మారణ ఉచ్చాటనాది పంచకర్మలు వేరువేరుగ చేయవలెను. అధర గృహమున పృథివియు, ఊర్ధ్వ గృహమున తేజస్సు, మధ్య జలము చెప్పబడినవి. రంధ్రములు ఎచ్చట ఉండునో అచటను, బాహ్య పార్శ్వములందును వాయువు లోపటి పార్శ్వములందు ఆకాశము ఉండును. పార్థివాంశము నందు స్తంభనము జలీయాంశము నందు శాంతికర్మ తైజశాంసము నందు వశీకరణము, వాయువు నందు భ్రమణము ఆకాశము నందు పుణ్య కర్మయు చేయవలెను. (325)