అగ్ని మహా పురాణము
అథాశ్వవాహన సారము
ధన్వంతరి చెప్పెను:
ఇపుడు అశ్వవాహన సారము అను అశ్వచికిత్సను చెప్పెదను. ధర్మకర్మ అర్థముల సిద్ధికై అశ్వసంగ్రహణము చేయవలయును. తొలిసారి అశ్వారోహణము చేయుటకు, అశ్వినీ, శ్రవణ, హస్త, ఉత్తరాషాఢా, ఉత్తర భాద్రపద, ఉత్తర ఫల్గుణీ నక్షత్రములు ప్రశస్తములు. అశ్వము నెక్కుటకు హేమంత, శిశిర, వసంతములు మంచివి. గ్రీష్మ శరత్ వర్ష ఋతువులందు అశ్వముపై ఎక్కుట నిషిద్ధము. తీవ్రమైన దండములతో కాని ప్రదేశమునందు గుఱ్ఱమును కొట్టగూడదు. అశ్వము యొక్క మనస్సు తెలుసుకొన జాలక ఉపాయములు తెలియక అశ్వముపై ఎక్కి దానిని మొలలు ఎముకలతో నిండిన దుర్గమమైన కంటకయుక్త మార్గమునందును ఇసుకతో, వరదతో నిండిన మార్గము నందును, గోతులు మెరకలతో గూడిన మార్గము నందును, నడిపించుచు కటిక (జీను) లేకుండ దాని వీపుపై ఎక్కిన మూర్ఖుడు అశ్వమునకే వాహనమగును. బుద్ధిమంతుడు శ్రేష్ఠుడగు ఏ ఒక్కడో అశ్వశాస్త్రమును చదువకుండగనే, కేవలము అభ్యాసము చేతను నిశ్చయ బుద్ధిచేతను అశ్వమునకు తన అభిప్రాయము తెలుపగలుగును.
అశ్వమునకు స్నానము చేయించి పూర్వాభిముఖముగా నిలబెట్టి ప్రారంభమున ఓం, అంతమున నమః, అను శబ్దములు చేర్చి ‘స్వ’ బీజాక్షర యుక్తములగు మంత్రములు చెప్పుచు క్రమముగ దేవతాన్యాసము చేయవలయును. అశ్వము యొక్క చిత్తమున బ్రహ్మ, బలమున మహా విష్ణువు, పరాక్రమమున గరుత్మంతుడు, పార్శ్వభాగమున రుద్ర గణము, బుద్ధియందు బృహస్పతి, మర్మ స్థానమున విశ్వేదేవులు, నేత్రావర్త నేత్రములందు చంద్ర సూర్యులు, చెవులందు అశ్వినీ కుమారులు, జఠరాగ్నియందు స్వధా, జిహ్వపై సరస్వతీ, వేగమున వాయుదేవుడు, పృష్టభాగమున స్వర్గ పృష్ఠము ఖురాగ్రములందు సర్వ పర్వతములు, రోమకూపము నందు నక్షత్ర గణము, హృదయమునందు చంద్రకళ, తేజమునందు అగ్ని, పిరుదులందు రతి, లలాటమున జగత్పతి, హ్రేషితమున నవగ్రహములు. వక్ష స్థలమున వాసుకి న్యాసము చేయబడవలెను. ఆ అశ్వమును ఎక్కువాడు అశ్వమును పూజించి దాని కుడిచెవిలో ఈ క్రింది మంత్రమును చెప్పవలెను.
‘ఓ అశ్వమా! నీవు గంధర్వరాజువు. నా మాట వినుము. నీవు గంధర్వ కులమున పుట్టిన దానవు. నీవు కులమును దూషితము చేయకుము. బ్రాహ్మణుల సత్య వచనముచే సోమ, గరుడ, రుద్ర, వరుణ, పవనముల, బలము అగ్నితేజముగల నీ జాతిని స్మరించుము. నీవు రాజేంద్ర పుత్రుడవు అను సత్య వాక్యమును స్మరించుము. నీవు వారుణి కన్యను కౌస్తుభమణిని స్మరించుము, దైత్య దేవతలచే క్షీర సముద్రము మథింప బడినపుడు, నీవు దేవకులమున పుట్టితివి. నీ వాక్యమును నిలబెట్టుకొనుము. నీవు అశ్వ వంశమున పుట్టితివి. నీవు నాకు శాశ్వతముగ మిత్రుడువగుము. ఓ మిత్రమా! నా వాక్యమ్ము వినుము. నాకు వాహనము కమ్ము. నన్ను రక్షించుచు నాకు విజయమును సమకూర్పుము. పూర్వము దేవతలు నీ పృష్టమును అధిరోహించి దైత్యులను సంహరించిరి. నేడు నీపై ఎక్కి నేను శత్రు సేనను జయించెదను. ఈ విధముగ అశ్వారోహకుడు అశ్వము చెవిలో జపించి శత్రువులను మోహింపచేయుచు అశ్వమును యుద్ధ స్థలమునకు తీసుకొని వచ్చి దానిని అధిరోహించి జయము సంపాదింపవలెను. ఉత్తమ అశ్వారోహకుడు అశ్వముల శరీరము నందు ఉత్పన్నములగు దోషములను ప్రయత్న పూర్వకముగ తొలగించి గుణములను వికసింపచేయును. ఉత్తముడగు అశ్వారోహకునిచే, అశ్వమునందు సమకూర్చబడిన గుణములు వాటికి సహజములవలె కనబడును. కొందరు అశ్వారోహకులు వాటి సహజ గుణములను కూడ నశింపచేయుదురు. ఒకడు అశ్వగుణములను గ్రహించును. మరి యొకడు దోషములను గ్రహించు అశ్వరహస్యము తెలుసుకొనగల్గిన ధీమంతుడు ధన్యుడు. మందబుద్ది గుణ దోషములు రెండింటిని తెలుసుకొనజాలడు. కర్మ, ఉపాయము తెలియని వాడును అశ్వమును వేగముగ నడిపింప ప్రయత్నించు వాడును కోపవంతుడును చిన్న అపరాధమునకు కూడ కఠోర దండమును ఇచ్చు వాడును అగు అశ్వారోహకుడు కుశలు డైనను ప్రశంసనీయుడు కాదు. ఉపాయములు తెలిసినవాడును చిత్తమును గ్రహించగల్గిన వాడును విశుద్ధుడును దోషములు తొలగించువాడును గుణములను సంపాదించు వాడును అగు అశ్వారోహకుడు, నిత్యము సర్వ కర్మలందు నేర్పుకలవాడు అయివుండును. అట్టివాడు అశ్వమును కళ్లెము పట్టుకొని బాహ్య భూమికి తీసుకొని వెళ్లి దాని పృష్టముపై ఎక్కి కుడి వైపునకు ఎడమ వైపునకు నడిపించవలెను. ఉత్తమ అశ్వమును ఎక్కి వెంటనే దానిని కొరడాతో కొట్టకూడదు. అట్లు చేసినచో అది భయపడి పోవును, మోహమును కూడ పొందును. అశ్వారోహకుడు ప్రాతః కాలమున కళ్లెమును పట్టుకొని గుర్రమును లేవదీసి ప్లుత గతితో నడిపించవలెను. సంధ్యాకాలమున డెక్కలకు నాలములు లేని గుర్రమును కళ్లెము పట్టుకొని మెల్లగ నడిపించవలెను.
వెనుక చెప్పిన కర్ణ జపముచేతను అశ్వసంచాలనమున అనుసరించవలసిన పద్ధతులచేతను, అశ్వమునకు ఆశ్వాసనము ఏర్పడును. దాని విషయమున సామ నీతిని అవలంబించవలయును. కొరడా మొదలగు వాటితో దండము విధించవలెను. మరియొక అశ్వముతో కలిపి రథమునకు కట్టిన దాని విషయమున భేదము ఉపయోగించ వలయును. కాలమునకు వేచి ఉంటయే దానము. పూర్వ పూర్వ ఉపాయములు సఫలము గానప్పుడు ఉత్తరోత్తర ఉపాయములను అనుసరించవలెను. జిహ్వకు క్రింద యోగము లేకుండగ హయమునకు త్రాడు కట్టవలెను. నూరుపేటలు గల నూలుతో చేసిన కళ్లెమును చెలివిల దగ్గర కట్టవలెను. పిదప మెల్ల మెల్లగ వాహనమును విస్మరింపవేసి కళ్లెమును శిథిలము చేయవలయును. గుర్రము నాలుక అహీనావస్థ పొందినప్పుడు జిహ్వా గ్రంధిని విప్పవలెను. అశ్వము స్థిరత్వమును విడువనంత వరకు కళ్ళెమును ఎక్కువగా విడువకూడదు. అశ్వ ముఖము నుండి లాలాజలము కారునంతవరకు ఉరస్త్రాణమును బిగించి వుంచవలెను. స్వభావముచే ముఖమును పైకిఎత్తి ఉంచుచు అశ్వము యొక్క ఉరస్త్రాణమును గట్టిగా బిగించి వుంచిన ఉత్తముడగు అశ్వారోహకుడు ఆ అశ్వమును తన కంటితో అవలీలగా నడిపించగలుగును. మొదట అశ్వము యొక్క వెనుకటి కుడిపాదముతో కుడివల్గను సంయోజితము చేసి ఆ పాదమును తన వశమునందు ఉంచుకొనవలెను. ఇదే విధముగ ఎడమవల్లతో ఎడమ పాదమును కట్టవలెను. దీనితో దాని ఎడమ పాదము కూడ నియంత్రణము లభించును. ఈ విధముగ ముందు పాదములు విడువబడినచో ఆసనము సుదృఢమగును. దుష్కరమోటన కర్మయందు పాదములు అపహృతములైనను ఎడమ పాదమున హీనావస్థ వచ్చినను అట్టి స్థితికి నాటకాయనము అని పేరు. హనన గుణన కర్మలచే ఖలీ కారము కలుగును. మాటిమాటికి ముఖ వ్యావర్తనము అశ్వ స్వభావము. ఇవన్నియు అశ్వముల పాద గ్రహణమునకు కారణము కావు. అశ్వము పూర్తిగా విశ్వాసము కలదియైన పిమ్మట ఆసనమును గట్టిగా వత్తి దాని పాదమును దాని ముఖముతో నొక్కి పట్టినచో దాని గ్రాహ్యత్వము హితకారి అగును. రాగములతో గట్టిగా నొక్కి పట్టి కళ్ళెము లాగి దాని బంధనముతో అశ్వము యొక్క రెండు పాదములను గ్రహించి ఆకర్షించినచో దానికి ‘ఉద్వక్కనము’ అని పేరు. కళ్ళెము గుర్రము నాలుగు పాదములను కట్టి ఇష్టానుసారము శిథిలము చేయుచు మణవలచే గుర్రమును కొట్టినచో దానికి మోట్టనం అని పేరు.
బుద్ధిమంతుడగు అశ్వారోహకుడు ఈ విధముగ ప్రళయ అవిప్లవములను తెలుసుకొనవలెను. మరల చతుర్థ మోటనముచే ఈ విధిని సంపాదించవలెను. మోటన ఉద్వక్కనములనే లఘు మండలములందు తన పాదములను ఉంచని అశ్వము సఫలమని గ్రహించవలయును. దానికి ఈ విధముగ పాదగతి నేర్పవలెను. ఆసనమునందు గట్టిగ బిగించికట్టి శిక్షణ ఇచ్చినను మందగతితో నడచుదానిని మరల మట్టి ఇష్టమగు విధమున నడిపించవలెను. ఈ శిక్షణా పద్ధతికి సంగ్రహణము యనిపేరు. స్థానస్థితమైనను వ్యగ్రచిత్తమగు అశ్వమును పార్శ్వ భాగమున కళ్లెముతో లాగి కళ్లెము సందలి ఇనుప గొళ్లెమును నములునట్లు చేసి, ఈ విధముగా పాదప్రహారముచే ఖలీకృతమై అది నడక నేర్చుకొనునట్లు చేసినచో అట్టి శిక్షణమునకు ఖలీకారమని పేరు. త్రివిధ గతులచే కూడ ఇష్టమగు నడక నడవనిచో దానిని దండముతో కొట్టి అట్లు నడిపించు పద్ధతికి హననము అని పేరు. రెండవ కళ్లెములో నాల్గు పర్యాయములు కలీకృతముచేసి ఆ అశ్వమును మరొక చోటునకు తీసుకొనిపోయి దానిచే నిట్టూర్పులు విడ్పించినచో దానికి ఉచ్ఛ్వాసనము అని పేరు. తన ముఖమును బయటకు త్రిప్పుట అశ్వస్వభావము. దానిని ప్రయత్నపూర్వకముగ ఆ వైపునకే త్రిప్పునట్లు చేసి అట్లే నియమించి దానికి గతినేర్పినచో ముఖవ్యావర్తన మని పేరు. క్రమముగ మూడు గతులలో చాలనము నేర్పిన పిమ్మట మండలాది పంచదారలందు నడచుట నేర్పవలెను. పైకి ఎత్తిన ముఖము నుండి మోకాళ్లవరకు అశ్వము శిథిలమైనపుడు దానికి శిక్షణ ఇచ్చుటకై బుద్ధిమంతులు దానిని అధిరోహించి దాని అవయవములు తేలిక అగువరకు దానిని పరుగెత్తించవలెను. దానికి మెడ కోమలముగను, ముఖము తేలికగను, శరీరసంధులన్నియు శిథిలములు అగును. అయినపుడు అది ఆరోహమునకు వశమగును. అట్టి అవస్థలో ఆ అశ్వమును సంగ్రహించవలెను. మొదట నేర్పిన గతిని విడువని అశ్వము మంచిది. అప్పుడు రెండు చేతులతో కళ్లెములాగి గుర్రము కంఠము పైకెత్తి ఒక్క పాదముతో భూమిపై నిలబడునట్లు చేయవలయును. నేలపై ఆనివున్న వెనుకటికాళ్లు ముందరికాళ్లకు ఆశ్రయము అయినపుడు ఆ అశ్వమును ముష్టితో సంధారణము చేయవలయును. ఇట్లు లాగిన వెంటనే నిలబడక శరీరమును విక్షిప్తము చేయు గుర్రమును మండలాకారమున పరుగెత్తించి వశము చేసుకొనవలెను. మెడను ఊపు గుర్రమును కళ్ళెము లాగి నిలబెట్టవలెను.
గోమయము, ఉప్పు, గోమూత్రము వీటి తో క్వాథము చేసి దానిలో మట్టి కలిపి అశ్వ శరీరమున పూయవలయును. దాని వలన మక్షికాది పీడ కలుగదు, అలసట తొలగిపోవును, అశ్వారోహకుడు భద్రాది జాతికి చెందిన గుర్రములకు గంజి ఇవ్వవలెను. దీనివలన సూక్ష్మ కీటక దంశనము ఉత్సాహ శూన్యత్వము ఆకలి తగ్గును. అశ్వము ఎట్లు వశమగునో అంత శిక్షణమే ఇవ్వవలయును. ఎక్కువగా నడిపించిన అశ్వములు నశించును. పూర్తిగా నడిపించనిచో అవి సిద్దము గాకుండ పోవును. వాటి ముఖములను పైకి ఎత్తునట్లు చేసి వాటిపై సవారీ చేయవలెను. స్థిరముష్టి కలవాడై గుర్రమును రెండు మోకాళ్ళతో అదిమిపట్టి ముందుకు నడిపించవలెను. గోమూత్రాకృతి వక్రతవేణి పద్మ మండలము మాలికా అను చిహ్నములున్న అశ్వము పంచలూక ఖలిక అని చెప్పబడును. అట్టి గుర్రములు కార్యమునందు అగర్వితములై ఉండును. వీటికి సంక్షిప్తము, విక్షిప్తము, కుంచితము, అంచితము, వల్గితము, ఆవల్గితము అను ఆరు లక్షణములు చెప్పబడినవి. మార్గముపై నూరు ధనుస్సుల దూరము పరుగెత్తిన పిమ్మట భద్రజాతీయ అశ్వము సుసాధ్యమగును. మందాశ్వము ఎనుబది ధనుస్సుల దూరము దందైక మానసము తొంబది ధనుస్సుల దూరము నడిపించిన పిమ్మట సాధ్యము అగును. మృగజింఘ్యము సంకరజాతికి చెందిన అశ్వము. దానిని ఎనుబది లేక తొంబది ధనుస్సులదూరము నడిపించినచో సాధ్యము అగును. శర్కర మదువు, లాజలు, తిను అశ్వము బ్రాహ్మణ జాతీయము. ఇది పవిత్రము సుగంధయుక్తము అయివుండును. క్షత్రియ అశ్వము తేజశ్శాలియై ఉండును. వైశ్వ అశ్వము వినయబుద్ధి సంపన్నమై, శూద్రశ్వము, అపవిత్రము, చంచలము, మందము, కురూపము, బుద్ధిహీనము, దుష్టము అయివుండును. కళ్ళెము పట్టుకొనగనే లాలా జలమును స్రవించు గుర్రమునకు ఆ కళ్ళెము త్రాడు ఇప్పి దానిని జలధారచే స్నానము చేయించ వలయును. ఇప్పుడు శాలిహోత్రుడు చెప్పిన విధమున అశ్వ లక్షణములను చెప్పెదను. (288)
