అగ్ని మహా పురాణము

Table of Contents

అసంస్కృత అశౌచమ్

 పుష్కరుడు చెప్పెను-

మరణించినవానికి సంస్కారము జరిగినను జరుగకపోయినను, శ్రీహరినామస్మరణ చేసినచో వానికి స్వర్గమోక్షములు రెండును లభించును. మృతుని అస్థులను గంగలో పడవేయుటచే ఆతనికి అభ్యుదయము కలుగును. తన అస్థులు గంగలో ఎంత కాలము ఉండునో అంతకాలము మానవుడు స్వర్గములో ఉండును. ఆత్మహత్య చేసికొన్న వానికిని, పతితునకును పిండోదక క్రియ లేకున్నను వాని అస్థులను గంగలో పడవేసినచో వానికి మంచి కలుగును. వానికై ఇచ్చిన అన్న జలములు ఆకాశములో లీనమైపోవును. పతితుడగు వాని ప్రేతను ఉద్దేశించి మహానుగ్రహ బుద్ధితో నారాయణబలి ఇవ్వవలెను. వానికి నారాయణానుగ్రహము లభించును. కమలలోచనుడగు శ్రీహరి వినాశరహితుడు. అందుచే ఆతని కర్పించినది వినాశరహితమై యుండును. పతితులై బోవనున్న జీవులకు భోగ మోక్షముల నిచ్చు ఏకైక ప్రభువు శ్రీమహావిష్ణువు. ‘జగత్తులో ఉన్న వారందరును ఏదో ఒక రోజున మరణింపవలసిన వారే’ అను విషయమును గుర్తించి, తనకు నిజముగ సహాయముగా నిలువబోవు ధర్మమును ఆచరించవలెను. యమలోక మార్గము ప్రతి ఒక్కరికిని వేరువేరుగా నుండును. జీవుడు ఎచటికి వెళ్ళినను ఆతనితో కూడ కలిసి వెళ్ళు ఏకైక సహాయము ధర్మమే. రేపు చేయవలసిన పని ఈ రోజునే చేయవలెను. మధ్యాహ్నమున చేయవలసినపని పూర్వాహ్ణము నందే చేయవలెను. ఏలనన ఈతడు చేయవలసిన పని పూర్తియైనదా లేదా అని మృత్యువు నిరీక్షించదు. మనుష్యుడు పొలములు, ఆవణములు, గృహములు మొదలగు వాటియందు ఆసక్తుడై మనస్సంతయు మరొక వైపున ఉండి ఉండగా ఏమరి ఉన్న గొర్రెను ఆడతోడేలువచ్చి తన్నుకొని పోయినట్లు మృత్యువు తీసికొని పోవును. కాలమునకు ఇష్టుడుగాని, అనిష్టుడు గాని లేడు. ఆయుర్దాయము, ప్రారబ్ధకర్మ పూర్తియైన వెంటనే మృత్యువు హఠాత్తుగా వచ్చి జీవుని ఎత్తికొని పోవును. కాలము రాని వానిని వందల కొలది బాణములతో కొట్టినను మరణించడు. కాలము వచ్చిన వానిని కుశాగ్రముతో ముట్టిననువాడు మరణించును. మృత్యుగ్రస్తుని ఔషధములు గాని, మంత్రాదులు గాని రక్షింపజాలవు. లేగదూడ సరిగా తన తల్లి దగ్గరకే వెళ్ళినట్లు పూర్వజన్మ కృతమైన కర్మకర్తను అనుసరించును. ఈ జగత్తు యొక్క ఆది అవ్యక్తము. అంతముకూడ అవ్యక్తమే. కేవలము మధ్యయే వ్యక్తము. శరీరము నందు కౌమార, యౌవనాద్యవస్థలు వచ్చిన విధము ననే మరొక శరీరముకూడ వచ్చును. నూతన వస్త్రమును ధరించిన విధముగ జీవుడు వెనుకటి శరీరమును విడచి క్రొత్త శరీరమును పొందును. జీవుడు సర్వదా అవధ్యుడు. వాడు ఎన్నడును మరణించడు. అందుచే మృత్యువును గూర్చి శోకమును విడువవలెను. (159)