అగ్ని మహా పురాణము

Table of Contents

నవమీ వ్రతములు

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు నవమీ వ్రతములను గూర్చి చెప్పెదను. ఆశ్వయుజ శుక్ల నవమి నాడు గౌరీ నవమీ వ్రతము నాచరించి దేవీ పూజ చేయవలెను. ఈ నవమికి ‘పిష్టక నవమి’ అనిపేరు. ఈ వ్రతము చేయువాడు దేవీ పూజచేసి పిష్టాన్నమును భుజించవలెను. ఆశ్వయుజ శుక్ల నవమినాడు మూల నక్షత్రముండి, సూర్యుడు కన్యారాశి గతుడైనచో ‘మహానవమి’యని పేరు. అది సర్వపాప వినాశకము. ఆనాడు నవదుర్గలను తొమ్మిది స్థానములందుగాని, ఒక స్థానమునందు గాని స్థాపించి పూజించవలెను. మధ్య యందు అష్టాదశభుజ మహాలక్ష్మిని, రెండు పార్శ్వములందును మిగిలిన దుర్గలను పూజించవలెను. నవదుర్గలను క్రింద చెప్పిన క్రమమున, అంజన, డమరు సహితలుగా స్థాపించవలెను. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, పూజ్య, చండరూప, అతిచండిక-వీరందరి మధ్యయందు అష్టాదశభుజయగు ఉగ్రచండా మహిష మర్దనీదుర్గను పూజించవలెను. ‘ఓం దుర్గే దుర్గ రక్షణి స్వాహా’ అనునది దశాక్షర మంత్రము. ఈ విధానము ననుసరించి ఈ దశాక్షర మంత్ర జపము చేయువానికి ఎవరి నుండియు బాధలు కలుగవు. దుర్గాదేవి వామ హస్తములందు కపాల, ఖేటక, ఘంటా, దర్పణ, తర్జనీ ముద్రా, ధనుష్, ధ్వజ, డమరు, పాశములను, దక్షిణ హస్తములందు శక్తి, ముద్గర, త్రిశూల, వజ్ర, ఖడ్గ, కుంతక, శంఖ, చక్ర, శలాకలను ధరించియుండును. ఈ ఆయుధములను కూడ పూజించవలెను. ‘కాళి కాళి వజ్రేశ్వరి లోహదణ్డాయై నమః’ అను మంత్రము పఠించుచు ఖడ్గముతో బలిపశువును చంపవలెను. ఆ బలిపశువు రక్త మాంసములను ‘పూతనాయై నమః’ అని నైరృతి దిక్కునందును, ‘పాపరాక్షస్యై నమః’ అని వాయవ్యము నందును, ‘చరక్యై నమః’ అని ఈశాన్యమునందును, ‘విదారికాయై నమః’ అని ఆగ్నేయము నందును ఆ దేవతలను ఉద్దేశించి సమర్పించవలెను. రాజు దాని ఎదుట స్నానముచేసి స్కందవిశాఖుల నిమిత్తమై పిష్ట నిర్మిత శత్రుబలి ఇవ్వవలెను. రాత్రియందు బ్రాహ్మి మొదలగు శక్తుల పూజచేసి- ‘జయంతి, మంగళ, కాళి, భద్రకాళి, కపాలిని, దుర్గ, శివ, క్షమ, ధాత్రి, స్వాహా, స్వధా అను పేర్లు గల ఓ దేవీ; నమస్కారము’. ఇత్యాది మంత్రములు పఠించుచు ప్రార్థించవలెను. దేవికి పంచామృత స్నానము చేయించి వివిధోపచారములతో ఆమెను పూజించవలెను. దేవిని ఉద్దేశించి చేసిన ధ్వజదానము, రథయాత్ర, బలి దానము సకలాభీష్టములను ఒసగును. (185)