అగ్ని మహా పురాణము
రసాది లక్షణము
ధన్వంతరి పలికెను:
ఇపుడు ఓషధి రసాదుల లక్షణములు చెప్పెదను వినుము. ఓషధుల రసవీర్య విపాకములు తెలిసిన వైద్యుడే రాజాదులను రక్షించగలడు. మధుర, ఆమ్ల, లవణ రసములు, చంద్రుని నుండి పుట్టినవి. కటుతిక్త కషాయ రసములు, అగ్ని నుండి పుట్టినవి. ద్రవ్య విపాకము కటు ఆమ్ల లవణ రూపమున మూడు విధములుగా ఉండును. శీతము, ఉష్ణము- అని వీర్యము రెండు విధములు. ఓ ద్విజోత్తమా! ఓషధుల ప్రభావము చెప్పశక్యముగానిది. మధుర తిక్తకషాయ రసములు శీత వీర్యములు. మిగిలిన రసములు ఉష్ణ వీర్యములు. కాని గుడూచి తిక్తమైనను అత్యంత వీర్యప్రద మగుటచే ఉష్ణ వీర్యము. అట్లే కషాయ రసము కలదైనను పథ్య ఉష్ణ వీర్యము జటామాంసి మధుర రసయుక్త యైనను ఉష్ణ వీర్యము లవణ మధురములు విపాకమున మధురములని చెప్పబడినవి. ఆమ్లోష్ణ విపాకము కూడ మధురము మిగిలిన రసముల విపాకములు కటువులు. విశేష వీర్యయుక్త ద్రవ్యము విపాకమునందు విపరీత ఫలముకూడ ఇచ్చును అనుటలో సందేహములేదు. ఎట్లనగా తేనె మధురమైనను విపాకమున కటువు అగునని చెప్పబడినది. ఒక ద్రవ్యమునకు పదునారు రెట్లు నీరుపోసి, ఆ ద్రవ్యమునకు నాలుగురెట్లు జలము మిగులునట్లు కాచి ఆ క్వాథమును త్రాగవలెను. ఇది క్వాథ నిర్మాణపద్ధతి క్వాథవిధి చెప్పని చోట్ల ఈ పద్ధతిని అనుసరించవలెను. స్నేహ (తైలఘృతాది) పాకమునందు స్నేహమునకు నాలుగు రెట్లు కషాయముగాని, సమప్రమాణమగు తైల క్వాథములుగాని చేర్చవలెను. తైలములో వేసిన ఓషధులు ఉడికి చల్లారిన పిమ్మట చేతితో నలిపినపుడు వత్తివలె అయినచో అపుడు తైలపరిపాకము వచ్చినట్లు గ్రహించవలెను. లేహ్యములందు కూడ ఇట్లే సమాన ప్రమాణములుగల పదార్థములు వేయవలయును. నిర్మలము, అల్పౌషది యుక్తమగు క్వాథము ఉత్తమము. చూర్ణము ఒక అక్షము, క్వాథము నాలుగు పలములు ఇది సాధారణ మాత్ర, మాత్ర విషయమున ఒక నిశ్చిత ప్రమాణము లేదు. రోగి యొక్క వయోబల అగ్ని దేశకాల ద్రవ్యములను బట్టి రోగ స్వభావమును బట్టి వేర్వేరు ప్రమాణములు నిర్ణయించవలెను. సౌమ్యరసములు సాధారణముగ ధాతువర్ధకములు.
విశేషించి మధుర రసములు ధాతువర్ధకములు. దోషధాతు ద్రవ్యములు, సమాన గుణయుక్తము లైనచో శరీర వృద్ధి కల్గించును. విపరీతమైనచో క్షయకారకములు. ఓ నరశ్రేష్ఠా! ఈ శరీరమునకు ఆహారము, మైథునము, నిద్ర అను మూడు ఉపస్థంబములు ఉన్నవి. వీటి విషయమున ప్రయత్న శీలుడై వుండవలెను. వీటిని పూర్తిగా సేవింపకున్నను, ఎక్కువ సేవించినను, శరీరము క్షీణించును. కృశించిన శరీరమును పోషించవలయును. స్థూల శరీరమును తగ్గించవలయును. మధ్య శరీరమును రక్షించుకొనవలెను. మొదటి రెండు ఉపక్రమములకు తర్పణము, అతర్పణము అని రెండు భేదములు. మానవుడు హితమైనదానిని తినవలెను. మితమైన దానిని తినవలెను. మొదట తిన్నది జీర్ణమైన పిమ్మట తినవలెను. ఓ నరశ్రేష్ఠా! రసము కల్కము, క్వాథము, శీతకషాయములు, ఫాంటముయని ఓషధి నిర్మాణము ఐదు విధములు. ఓషధులను పిండుటచే రసము, మథించుటచే కల్కము, మరగబెట్టుటచే క్వాథము, రాత్రి అంతయు నీటిలో వుంచుటచే శీతకషాయము, నీటిలో వేసి తాత్కాలికముగ వేడిచేయుటచే ఫాంటము తయారగును. చికిత్సకు నూట అరువది సాధములున్నవి. ఇవన్నియు తెలిసిన వైద్యుడు అజేయుడగును. అతనికి ‘బహు శౌండికుడు’ అని పేరు. జఠరాగ్నిని సంరక్షించుటకు, వృద్ధిపొందించుటకు శుద్ధము చేయుటకును ఆహారశుద్ధి ఆవశ్యకము. మనుష్యుని బలమునకు అగ్నియే మూలాధారము. బలము కొరకై సైంధవ లవణయుక్త త్రిఫలను, కాంతి ప్రదములగు ఉత్తమ పేయములను, జాంగలరసమును సైంధవయుక్తమగు పెరుగును, పాలను పిప్పలిని సేవింపవలయును. ఏ రసములు అధికమైపోయినవో వాటిని సామ్యావస్థకు తీసుకొని రావలెను. వాత ప్రకృతి కలవాడు గ్రీష్మఋతువునందు మర్దనము చేయించుకొనవలెను. శిశిర ఋతువునందును సాధారణముగను లేక అధికముగను, వసంతమునందు మధ్యమముగను, గ్రీష్మము నందు విశేష రూపముగను మర్దనము చేయించుకొనవలెను. మొదట చర్మమును అనంతరము మజ్జను మర్దనము చేయించుకొనవలెను. స్నాయు రుధిర పూర్ణము అగు శరీరమున ఆస్తులు చాలా లావుగా ఉన్నట్లు కనిపించును. భుజములు, బాహువులు, మోకాళ్ళు, పిక్కలు కూడ మాంసములుగా నుండును. బుద్ధిమంతుడు ఈ అవయవములను శత్రువును మర్దించినట్లు మర్దించవలెను. మణవలు, వక్షస్థలము వీటిని సాధారణముగా మర్దించవలెను. అవయవ సంధులను మర్దించి వాటిని చాచవలెను. కాని హఠాత్తుగాను క్రమ విరుద్ధముగాను చాచకూడదు. అజీర్ణ సమయము నందును భోజనానంతరము జలపానా నంతరము వ్యాయామము చేయకూడదు. దినమునకు నాల్గు భాగములుండును. మొదటి జాములో సగము దాటిపోయినచో వ్యాయామము చేయకూడదు. శీతల జలముతో ఒక పర్యాయము స్నానము చేయవలయును. ఉష్ణ జలము శ్రమను తగ్గించును. శ్వాస నిరోధము చేయకూడదు. వ్యాయామము, కఫమును తొలగించును. స్నానము పిత్తాధిక్యమును తొలగించును. శ్వాస నిరోధము చేయకూడదు. వ్యాయామము, కఫమును తొలగించును. స్నానము పిత్తాధిక్యమును తొలగించును. స్నానానంతరము ఎండను సేవించుట మంచిది. వ్యాయామము చేయువాడు ఎండను ఇతర క్లేశములను సహింప సమర్థుడగును. (281)
