అగ్ని మహా పురాణము

Table of Contents

కౌముద వ్రతము

అగ్నిదేవుడు చెప్పెను:

ఇప్పుడు కౌముద వ్రతమును గూర్చి చెప్పెదను. దీనిని ఆశ్వయుజ శుక్ల పక్షము నందు ప్రారంభించవలెను. వ్రతము చేయువాడు ఏకాదశీ దివసమున ఉపవాసము చేసి ఒక మాసము శ్రీమహావిష్ణువును పూజించవలెను. ‘నేను ఆశ్వయుజ శుక్ల పక్షమునందు ఒక పూట మాత్రమే భోజనము చేయుచు, శ్రీమన్నారాయణుని మంత్రము జపించుచు, భుక్తి ముక్తి ప్రాప్తికొరకై ఒకమాసము పర్యంతము కౌముద వ్రతమును అనుష్ఠించెదను’ అని సంకల్పించవలెను. వ్రతము సమాప్తమైన పిదప ఏకాదశీ దివసమున ఉపవాసము చేసి ద్వాదశీ సమయమున శ్రీమహావిష్ణువును పూజించవలెను. శ్రీ మహావిష్ణువు విగ్రహముపై చందనము, అగరు, కేసరములు అనులేపనముచేసి, కమల, ఉత్పల, కహ్లార, మాలతీ పుష్పములతో విష్ణువును పూజించవలెను. వాక్సంయమముతో తైలపూర్ణ దీపము వెలిగించి, రెండు వేళల యందును పాయసము, అపూపములు, లడ్డులు నైవేద్యము చేయవలెను. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అను ద్వాదశాక్షర మంత్రమును నిరంతరము జపించ వలెను. పిదప బ్రాహ్మణ భోజనము చేయించి క్షమా ప్రార్థనా పూర్వకముగ వ్రత విసర్జనము చేయవలెను. దేవజాగరణీ ఏకాదశి వరకు, ఒకమాసము ఉపవాసము చేయుటచే కౌముద వ్రతము పూర్ణమగును. పూర్వోక్త మాసోపవాసముగూడ ఇన్ని దినములే జరుగును. కాని ఈ కౌముద వ్రతముచే దానికంటె అధిక ఫలము లభించును. (207)