అగ్ని మహా పురాణము

Table of Contents

యుద్ధ కాండము

అటుపై నారదుడు ఇట్లు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో “వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు.” అని చెప్పెను.

యుద్ధమునకై ఉద్ధతులైన రాక్షసులుగల రావణుడు ఆతనిని చంపుటకు ప్రయత్నించెను. ఆతడు తిరిగివచ్చి “దశగ్రీవుడు యుద్ధమును మాత్రమే కోరుచున్నాడు” అని రామునితో చెప్పెను.

ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు, మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద, ధూమ్ర, సుషేణులు, కేసరి, గజ, పనస, వినత, రంభ, శరభ క్రథనులు, బలశాలియైన గవాక్షుడు, దధివక్త్ర, గవయ, గంధమాదనులు, తదితర వానరులును వెళ్లిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతర వానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.

వానర రాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో రాక్షసులను కొట్టిరి. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలి బంటులు-ఈ రూపములో నున్న రాక్షసుల సైన్యము రామునిచేత అనాయాసముగా చంపబడెను.

హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షుని పర్వత శిఖరముతో చంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన ప్రహస్తులను చంపెను. గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధము నుండి విముక్తులైన రామ లక్ష్మణులు బాణములతో రాక్షస సైన్యమును సంహరించిరి.

రణరంగమున రాముడు బాణములచే రావణుని జర్జర శరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.

నిద్ర నుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాది మాంసము భుజించి రావణునితో “నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్నవు కాన యుద్ధమునకు వెళ్లి వానర సహితుడైన రాముని సంహరించెదను అని పలికెను.

కుంభకర్ణుడీ విధముగ పలికి వానరులందరిని మర్దించెను. ఆతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును కొరికివేసెను. చెవులు ముక్కులేని ఆతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను ఛేదించి అతని శిరస్సు నేలపై పడవేసెను.

పిమ్మట రామ లక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ, నికుంభ, మకరాక్ష, మహోదర, మహాపార్శ్వ, మత్త, ఉన్మత్త, వ్రఘన, భాసకర్ణ, విరూపాక్ష, దేవాంతక, నరాంతక, త్రిశిరస్క అతికాయులను రాక్షసులను యుద్ధము చేయుచున్న ఇతర రాక్షసులను రామలక్ష్మణులు సంహరించిరి.

మాయతో యుద్ధముచేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగ బాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొనివచ్చిన పర్వతముపై ఉన్న విశల్య అను ఓషధిచేత రామలక్ష్మణుల గాయములను మాన్పి ఆ పర్వతమును దానిచోట ఉంచెను.

నికుంభిలలో హోమాదికము చేయుచున్న ఆ ఇంద్రజిత్తును లక్ష్మణుడు బాణములతో సంహరించెను. రావణుడు శోకసంతప్తుడై సీతను చంపుటకు ఉద్యమింపగా అవింధ్య అను అతని రాణి వారించెను. అంతట రావణుడు సేనాసమేతుడై రథమును ఎక్కి యుద్ధమునకై వెళ్ళెను.

ఇంద్రుడు పంపగా మాతలి వచ్చి రాముని రథారూఢుని చేసెను. రామరావణుల యుద్ధమునకు రామరావణ యుద్ధమే సాటి. రావణుడు వానరులను కొట్టగా, హనుమదాది వానరులు రావణుని కొట్టిరి. రాముడు మేఘమువలె ఆ రావణునిపై శస్త్రాస్త్రములను కురిపించెను. ఆతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, ఆతని ధనస్సును, బాహువులను, శిరస్సులను ఛేదించెను. కాని ఆతని శిరస్సు మరల మరల మొలుచుచుండెను. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రముచే ఆతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసులను అందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చిరి.

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధురాలైన ఆమెను స్వీకరించెను. ఇంద్రాది దేవతలును, బ్రహ్మయు, దశరథుడును “నీవు రాక్షస సంహారివైన విష్ణువే” అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవీతులను చేసెను. యుద్ధము చూచి ఆ దేవతలు రామునిచే పూజితులై, స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణునకు ఇచ్చెను.

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడైన శ్రీరాముడు సీతకు వనములను, దుర్గమభూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్యవైపు తిరిగి వెళ్లెను. భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నంది గ్రామమునకు వెళ్లి, భరతునిచే నమస్కరింపబడినవాడై అయోధ్యకు వెళ్ళెను. వసిష్ఠాదులకు నమస్కరించి, కౌసల్యా, కైకేయి, సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రాహ్మణులను పూజించెను.

పిమ్మట అశ్వమేధ యాగముచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులవలె పాలించెను. దుష్టులను నిగ్రహించుట యందు ఆసక్తుడై ధర్మకామాదులను పాలించెను. రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు ఆసక్తులైరి. అకాల మరణము చెందినవాడెవ్వడును లేకుండెను.