అగ్ని మహా పురాణము

Table of Contents

జీర్ణోద్ధార విధి

హయగ్రీవుడు చెప్పెను-ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చెప్పెదను. ఆచార్యుడు మూర్తికి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగవిహీనము, భగ్నమైనది, శిలామాత్రా వశిష్టమైనది అగు ప్రతిమను పరిత్యజించవలెను. దీని స్థానము నందు వెనుకటివలెనే నవీనమైన స్థిరమూర్తిని స్థాపింపవలెను. ఆచార్యుడు భూతశుద్ధి ప్రకరణములో చెప్పినవిధమున, సంహారవిధిచే సకలతత్త్వముల సంహారము చేయవలెను. నృసింహ మంత్రముతో వేయి హోమములు చేసి మూర్తిని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తియైనచో జలములో విడువవలెను. ధాతుమయమూర్తిగాని, రత్నమయమూర్తిగాని ఐనచో సముద్రములో అగాధ జలములో పడవేయవలెను. జీర్ణ ప్రతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాద్యములతో తీసికొని వెళ్ళి నీటిలోవిడువవలెను పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. ఆ దివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణముకలదో అదే ద్రవ్యముతో, అంతే ప్రమాణముగల మూర్తిని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప, వాపీ, తటాగాదుల ఉద్ధారము చేయుటచే గొప్ప ఫలము లభించును. (67)