అగ్ని మహా పురాణము

Table of Contents

కపిలాపూజాది విధానము

ఈశ్వరుడు పలికెను: “ఇపుడు కపిలాపూజన విధానము చెప్పెదను. ఈ క్రింది మంత్రములతో గోపూజ చేయవలెను. ఓం కపిలే నమోనమః, ఓం కపిలే భద్రికే నమః, ఓం కపిలే సుశీలే నమః, ఓం కపిలే సురభిప్రభే నమః, ఓం కపిలే సుమనసే నమః, ఓం కపిలే భుక్తిముక్తి ప్రదేనమః” ఈ విధముగ పూజించిన పిమ్మట “దేవతలకు అమృతము ఇచ్చుదానా! వరములను ఇచ్చుదానా! జగన్మాతా! సౌరభేయీ! ఈ గ్రాసమును స్వీకరించి నాకు మనోవాంఛిత వస్తువులను ఇమ్ము. ఓ కపిలా! బ్రహ్మర్షియైన వసిష్ఠుడును, బుద్ధి శాలియగు విశ్వామిత్రుడును నీకు నమస్కరించినారు. నేను ఏయే దుష్కర్మలు చేసితినో ఆ పాపములను అన్నింటిని హరింపుము, గోవులు సర్వదా నీ ముందు, వెనుక, హృదయమున నివసించుగాక, నేను సర్వదా గోవుల మధ్య నివసింతునుగాక, ఓ గోమాతా! నేను ఇచ్చిన ఈ గ్రాసమును స్వీకరింపుము” అని ప్రార్థించవలెను. ఈ విధముగ గోమాతను ప్రార్థించువాడు పాపరహితుడై శివస్వరూపుడగును.

విద్యాభ్యాసము చేయువాడు ప్రతిదినము పుస్తకములకు పూజచేసి గురుచరణములకు నమస్కరించవలెను. గృహస్థుడు నిత్యము మధ్యాహ్నకాలమున స్నానముచేసి అష్టపుష్పికా విధానమున శివుని పూజించవలెను. యోగపీఠమును దానిపై స్థాపించిన శివునిమూర్తిని, శివుని మోకాళ్లను, పాదములను, హస్తములను, వక్షస్థలమును, శిరస్సును, వాక్కును, దృష్టిని, బుద్ధిని, ఈ ఎనిమిది అంగములను పూజించుటయే “అష్టపుష్పికాపూజ”. మధ్యాహ్నమున చక్కగా అలికిన భోజన గృహములోనికి వండిన భోజన పదార్థములను తీసికొని వచ్చి, ‘వౌషట్’ మంత్రము చివర చేర్చిన మృత్యుంజయ (త్ర్యమ్బకం యజామహే) ఇత్యాది మంత్రము ఏడు పర్యాయములు జపించి కుశయుక్త శంఖమునందు ఉంచిన ఉదకము ఆ అన్నముపై చల్లి, అన్ని పదార్థముల అగ్రభాగములను శివునకు నివేదన చేయవలెను.

పిమ్మట సగము అన్నమును ఛుల్లికా (పొయ్యి) హోమము కొరకు తీసి ఉంచవలెను. విధి పూర్వకముగ పొయ్యి శ్రార్ధము చేసి దాని అగ్నిలో, పూరక ప్రాణాయామముతో ఒక హోమము చేయవలెను. జఠారానలమును ఉద్దేశించి ఒక ఆహుతి ఇచ్చి రేచక ప్రాణాయామముచే లోపలినుండి బైటకు వచ్చుచున్న వాయువుతో అగ్నిబీజమును (రం) గ్రహించి, క్రమముగ, కకారాద్యక్షరముల ఉచ్చారణ స్థానములగు కంఠాదుల ద్వారా బైటకు తీసికొని వచ్చి, “నీవు శివస్వరూపుడవగు అగ్నివి” అని చింతించుచు దానిని పొయ్యిలో ఉన్న అగ్నితో కలిపినట్లు భావనచేయవలెను. పిమ్మట పొయ్యికి పూర్వాది దిశలందు “ఓం హాం అగ్నయే నమః’ ఓం హాం సోమాయ నమః, ఓం హాం సూర్యాయ నమః, ఓం హాం బృహస్పతయే నమః, ఓం హాం ప్రజాపతయే నమః, ఓం హాం సర్వేభ్యోదేవేభ్యో నమః, ఓం హాం సర్వవిశ్వేభ్యో నమః, ఓం హాం అగ్నయే స్విష్టకృతే నమః” అను ఎనిమిది మంత్రములతో ఎనమండుగురు దేవతలను పూజించవలెను. పిదప ఈ మంత్రముల చివర ‘స్వాహా’ చేర్చి ఒక్కొక్క ఆహుతి ఇచ్చి, అపరాధములను క్షమింపుడని ప్రార్థించి అందరిని విసర్జన చేయవలెను.

పొయ్యికి కుడిప్రక్క “ధర్మాయ నమః” అను మంత్రముతో ధర్మమును, ఎడమప్రక్క ‘అధర్మాయ నమః’ అను మంత్రముతో అధర్మమును పూజించవలెను. గంజి మొదలగునవి పోయుటకు ఉపయోగించు పాత్రలందును, జలమునుంచు ఘటాదులందును “ఓం రసపరివర్తమానాయ వరుణాయ నమః” అను మంత్రముతో వరుణుని, వంటింటి ద్వారమున ‘విఘ్న రాజాయ నమః అని విఘ్నేశ్వరుని, తిరుగలిపై “సుభగాయై నమః” అని సుభగను, రోటియందు “రౌద్రికే గిరికే నమః” అను మంత్రముచే రౌద్రికా, గిరికలను, రోకలి యందు “బలప్రియాయుధాయ నమః అను మంత్రముతో బలరాముని ఆయుధమును పూజించవలెను.

చీపురుపైన పూర్వోక్త దేవతలను (రౌద్రికా గిరికలను), శయ్యపై కామదేవుని, మధ్య నున్న స్తంభముపై స్కంధుని పూజింపవలెను. పిమ్మట వ్రతపాలనము చేయు సాధకుడును, పురోహితుడును వాస్తుదేవతకు బలి సమర్పించి, బంగారు పాత్రలోగాని, లేదా తామరాకులలోగాని భోజనము చేయవలెను.

మఱ్ఱి, రావి, జిల్లేడు, వాతావి, సర్జము, భల్లాతకము ఈ ఆకులలో భోజనము చేయగూడదు. ముందు ఆచమనముచేసి, ‘ప్రాణ’ మొదలగు శబ్దములకు మొదట ‘ఓం’ కారము చివర “స్వాహా” చేర్చి అన్నము ఐదు ఆహుతులు తీసికొని, జఠరాగ్ని ఉద్దీప్తము చేసి పిమ్మట భోజనము చేయవలెను. నాగ, కూర్మ, కృకల, దేవదత్త, దనంజయములు ఉపవాయువులు “ఏతేభ్యో నాగాదిభ్య ఉపవాయుభ్యః స్వాహా” అను మంత్రముతో ఆచమనముచేసి, అన్నాదులను నివేదనముచేసి, చివర మరల ఆచమనముచేసి “ఓం అమృతోపస్తరణమసి స్వాహా” అని చెప్పి, “ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా” అను మంత్రములతో పంచ ప్రాణములకును పంచాహును తన ముఖమునందు ఈయవలెను. పిమ్మట పూర్తిగా భోజనముచేసి, చులుకము నీటితో ఆచమనముచేసి, “ఓం అమృతాపిధానమసి స్వాహా” అని చెప్పవలెను. ఈ ఆచమనము శరీరములోపల నున్న అన్నమును ఆచ్ఛాదించుటకు ఉపయోగించును. (77)