అగ్ని మహా పురాణము

Table of Contents

సంగ్రామ విజయ పూజ

పరమేశ్వరుడు పలికెను:

ఓం డే ఖ ఖ్యాం సూర్యాయ సంగ్రామ విజయాయ నమః-ఇది మంత్రము. హ్రాం హ్రీం హ్రః ఇవి సంగ్రామమునందు విజయము నిచ్చు సూర్యుని ఆరు అంగములు. ఓం హం ఖం ఖఖోల్కాయ స్వాహా ఇది పూజామంత్రము. స్ఫూం హ్రూం హుం క్రూం ఓం హ్రాం క్రేం ఇవి అంగన్యాస బీజమంత్రములు. పీఠ పాదములందును, మధ్యనున్న నాల్గు దిక్కులందును వరుసగా ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యములను పూజించవలెను. పిదప అనంతాసన, సింహాసన, పద్మాసనములను పూజించి కమలకర్ణికను, కేసరములను, అచ్చటనే సూర్య మండల, సోమమండల, వహ్ని మండలములను అర్చించి, దీప్త, సూక్ష్మ, జయ, భద్ర, విభూతి, విమల, ఆమోఘు, విద్యుత, సర్వతోముఖీ అను నవశక్తులను పూజించవలెను. పిదప సత్త్వ, రజస్, తమస్సులను, ప్రకృతి-పురుషులను, ఆత్మాంతరాత్మ పరమాత్మలను పూజించవలెను. ఆద్యక్షరమును అనుస్వారయుక్తము చేసి అంతమున నమః చేర్చి చతుర్థ్యంతము చేయగా పూజా మంత్రములు అగును. (ఉదా: ‘సం’ సత్త్వాయ నమః మొ.) ఉష, ప్రభ, సంధ్య, సాయా, మాయా, బల, బిందు, విష్ణువులను, ఎనమండుగురు ద్వారపాలులను పూజించి, గంధాదులతో సూర్య, చండ, ప్రచండులను పూజించవలెను. ఈ విధముగ పూజా, జప, హోమాదులు చేయుటచే యుద్ధాదులందు జయము కలుగును. (148)