అగ్ని మహా పురాణము

Table of Contents

నానాబల వర్ణన

పరమేశ్వరుడు చెప్పెను:

విష్కంభ యోగమున మూడు ఘడియలు, శీలయోగమున ఐదు ఘడియలు, గండ-అతిగండ యోగముల ఆరు ఘడియలు, వ్యాఘాత-వజ్రముల తొమ్మిది ఘడియలు అన్ని కార్యములందును త్యాజ్యములు. అనగా వదలివేయ తగినది. పరిఘ, వ్యతీపాత, వైధృత యోగములందు దినమంతయు త్యాజ్యమే. ఈ యోగములందు యాత్రా యుద్ధాదికము చేయరాదు. దేవీ! నేనిపుడు మేషాదిరాశుల ఫలములను, గ్రహముల ద్వారా కలుగు ఫలములను చెప్పెదను. జన్మ రాశియందు చంద్ర శుక్రులు వర్ణితులే యైనను శుభప్రదులు. జన్మరాశినుండియు, లగ్నము నుండియు రెండవ స్థానమున సూర్యుడుగాని, శనిగాని, రాహువుగాని, కుజుడుగాని ఉన్నచో ప్రాప్త ద్రవ్యము నశించును. అప్రాప్తము లభించదు; యుద్ధమున పరాజయము కలుగును. చంద్ర, బుధ, గురు, శుక్రులు ద్వితీయమందున్నచో శుభప్రదులు. మూడవ ఇంటిలో నున్న రవి, శని, కుజ, శుక్ర, బుధ, చంద్ర, రాహువులు శుభప్రదులు. నాల్గవ ఇంటిలో బుధ శుక్రులున్నచో శుభులు. ఇతరులు భయప్రదులు. పంచమము నందున్న గురు, శుక్ర, బుధ, చంద్రులు అభీష్ట లాభదాయకులు. దేవీ! తన రాశి నుండి ఆరవ భావమున రవి, చంద్ర, శని కుజు, బుధులున్నచో శుభఫలము నిత్తురు. కాని శుక్ర గురులు శుభప్రదులుకారు. సప్తమ భావమునందు రవి, శుక్ర, శని, కుజ, రాహువులున్నచో హాని కలుగును. బుధ, గురు, శుక్రులున్నచో సుఖము కలుగును; అష్టమము నందలి బుధ, శుక్రులు శుభులు. ఇతరులు హానికరులు. నవమ భావమునందున్న బుధ, శుక్రులు శుభులు, ఇతరులు అశుభులు. దశమ భావమునందలి శుక్ర, సూర్యులు లాభకరులు. శని, కుజు, రాహు, చంద్ర, బుధులు శుభకారకులు. పదకొండవ భావము నందున్న ఏ గ్రహమైనను శుభమునిచ్చును. దశమ స్థానమునందు బుధ, శుక్రులు శుభులు. ఇతర గ్రహములు అశుభులు. ఒక దివసమునందు పండ్రెండ్రు రాసులును తిరిగి వచ్చును. ఇప్పుడు వాటి ఫలమును చెప్పెదను.

మీన, మేష, మిథునములకు ఒక్కొక్క దానికి భోగకాలము నాలుగు దండములు వృషభ, కర్కట, సింహ, కన్యలకు ఆరేసి దండములు. తులా వృశ్చిక ధనుర్మకర కుంభములకు ఐదేసి దండముల కాలము. సూర్యుడున్న రాశి ఉదయ రాశి, ఆ రాశి నుండి ఇతర రాశుల భోగకాలము ప్రారంభమగును. మేషాది రాశులకు క్రమముగ చర, స్థిర, ద్వి స్వభావములని పేరు. మేష, కర్కట, తులా, మకరములు చరరాశులు. వీటియందు అస్థిరములైన శుభాశుభ కార్యములు చేయవలెను. వృషభ, సింహ, వృశ్చిక, కుంభములు స్థిరరాశులు. వీటిలో స్థిరకార్యములు చేయవలెను. ఈ లగ్నములలో బైటకువెళ్ళిన వ్యక్తితో శీఘ్ర సమాగము జరుగదు. రోగి శీఘ్రముగ రోగవిముక్తుడు కాడు. మిథున, కన్యా, ధనుః, మీనములు ద్వి స్వభావ రాశులు. ఈ రాశులు అన్ని కార్యములందును శుభ ప్రదములు. వీటియందు యాత్ర, వ్యాపారము, సంగ్రామము, వివాహము, రాజదర్శనము, వృద్ధికరము, జయలాభకరములు; యుద్ధమునందు విజయప్రదములు, అశ్వినీనక్షత్రము నందు ఇరువది తారలు ఉండును. దాని ఆకారము గుర్రమువలె నుండును. ఈ నక్షత్రము నందు వర్షము ప్రారంభించినచో ఒక రాత్రి గొప్ప వర్షము కలుగును. భరణి యందు వర్షము ప్రారంభించినచో పదునైదు దినముల వరకును అవిచ్ఛిన్నముగా నుండును. (127)