అగ్ని మహా పురాణము

Table of Contents

నవగ్రహహోమ నిరూపణము

లక్ష్మిని కోరువాడును, శాంతికాముడును, వృష్టి, ఆయుర్దాయ, పుష్టులు కోరువాడును లేదా అభిచార ప్రక్రియ ప్రారంభించనున్నవాడును గ్రహపూజ ప్రారంభించవలెను. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు. ఈ గ్రహముల మూర్తులను క్రమముగ రాగి, స్పటికము, రక్త చందనము, స్వర్ణము (బుధ గురువులు), రజతము, ఇనుము, సీసము (రాహు కేతువులు)-వీటితో నిర్మించవలెను. లేదా ఆయా గ్రహముల రంగులతో వ్రాసిగాని, గంధ మండలముల పైగాని పూజించవలెను. వారివారి రంగులను అనుసరించి వస్త్రములు, పుష్పములు, గంధములు, బలులు ఇవ్వవలెను. గుగ్గులు ధూపము ఈయవలెను. ప్రతి గ్రహమునకును మంత్ర పూతములైన చరువులు ఇవ్వవలెను. ఈ గ్రహములకు వరుసగా ‘ఆకృష్ణాన.....’, ‘ఇమం దేవా.......’ ‘అగ్నిర్మూర్ధా దివః కకుత్.......’ ‘ఉద్బుధ్యస్వ.......’ ‘బృహస్పతే అతి యదర్యః........’ ‘అన్నాత్పరిస్రుతః......’, ‘శన్నో దేవీః......’, ‘కేతుం కృణ్వన్ని మాన్.....’ అను మంత్రములు వినియోగించవలెను. ఈ గ్రహములకు క్రమముగ-అర్కము, పలాశ, ఖదిర, అపామార్గ, పిప్పల ఉదుంబర, శమీ, దూర్వా, కుశలు సమిధలు. ఒక్కొక్క గ్రహమునకు ఈ సమిధలు నూట ఎనిమిదిగాని, నూట ఇరువది గాని, మధు, ఆజ్య, దధులతో హోమము చేయవలెను. ఈ గ్రహములను ఉద్దేశించి బ్రాహ్మణులకు భోజనమునందు వరుసగా బెల్లముతో వండిన అన్నము, పాయసము, హవిష్యము, క్షీర యష్టికము, దధ్యోదనము, హవిస్సు, అపూపములు, మాంసము, చిన్నము ఇవ్వవలెను. వారిని యథాశక్తిగా, యథాలాభముగా సత్కరించవలెను. ఈ గ్రహములను ఉద్దేశించి క్రమముగా ఈయదగిన దక్షిణలు-ధేనువు, శంఖము, ఎద్దు, సువర్ణము, వస్త్రము, అశ్వము, కపిల ధేనువు, మేక. ఏ గ్రహము ఎవనికి దుష్ట స్థానాదుల నుండుటచే అపకారిగా నుండునో అతడు ఆ గ్రహమును పూజించవలెను, ‘మిమ్ములను ఎవరు పూజింతురో వారిని మీరు పూజించవలెను ‘రక్షించవలెను’ అని బ్రహ్మ ఈ గ్రహములకు వరములు ఇచ్చెను. రాజుల ఉన్నతి పతనము కూడ గ్రహాధీనమైనది. జగత్తు యొక్క స్థితిలయములు గూడ వీటిపై ఆధారపడి ఉన్నవి. అందుచే గ్రహములు చాల పూజింపదగినవి. (164)